తుమకూరు: జిల్లాలో శిర తాలూకాలోని బుక్కపట్టణ హోబ్లీలో, కిలార్దహళ్లి తండా గేట్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున బొలెరో, ఓమ్ని వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. బుక్కాపట్టణ రోడ్డు నుంచి వస్తున్న బొలెరో, శిర రోడ్డు నుంచి వస్తున్న ఓమ్ని వాహనం ఢీకొనగా రెండూ దూరంగా పల్టీలు కొట్టాయి. ఓమ్నిలో ఇద్దరికి కాళ్లు విరగగా, బొలెరోలోని ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బుక్కాపట్టణ పోలీసులు చేరుకుని గాయపడిన వారిని శిరా పబ్లిక్ ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన చికిత్సకై తుమకూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు.
సంగీత సామ్రాజ్ఞి జానకి
● మైసూరులో సంస్మరణ సభ
మైసూరు: సంగీత ప్రపంచానికి ప్రఖ్యాత గాయని ఎస్.జానకి చేసిన సేవ విశిష్టమైనదని ఎమ్మెల్యే టి.ఎస్. శ్రీవత్స అన్నారు. మైసూరు కృష్ణమూర్తిపురంలోని శారదా విలాస్ శతాబ్ది హాలులో పతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జానకి సంస్మరణ సభను నిర్వహించారు. జానకి తెలుగువారైనప్పటికీ కన్నడలో అత్యధిక పాటలను పాడి కన్నడిగుల అభిమానాన్ని చూరగొన్నారని ఎమ్మెల్యే అన్నారు. ఆమె ఇక్కడ స్థిరపడి, సంగీత రంగానికి గొప్ప సేవ చేసి మైసూరులోనే తుదిశ్వాస విడిచారని చెప్పారు. ఎమ్మెల్సీ ఆర్.రఘు కౌటిల్య మాట్లాడుతూ, ఎస్. జానకి మధుర గానం, వినయశీల వ్యక్తిత్వంతో భారతీయ సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేశారని అన్నారు. ఆమె గానంతో సంగీత ప్రియుల మనసుల్లో ఎప్పటికీ సజీవంగా ఉంటారని కొనియాడారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో సేవలు చేసిన ఆర్. రఘు కౌటిల్య, యోగా అనంతు, సాహితీ పుష్ప అయ్యంగార్, వైదేహి అయ్యంగార్‌లను సన్మానించారు.
నోట్లు పడేసి,
రూ.లక్షల అపహరణ
● మైసూరు డిక్కీ గ్యాంగులు
మైసూరు: మైసూరులో డిక్కీ గ్యాంగుల బెడద అధికమైంది. ఓ మహిళ, కుమారున్ని మాటల్లో పెట్టి స్కూటరు డిక్కీలోని రూ. 3.40 లక్షల నగదు, రూ. 30 వేల బంగారాన్ని దొంగిలించారు. వివరాలు.. హూట గల్లికి చెందిన శకుంతల సాహు, కుమారుడు బీరేంద్ర కుమార్ సాహు ఇల్లు కట్టుకోవడానికి స్థానిక కెనరా బ్యాంకులో బంగారాన్ని కుదవ పెట్టి డబ్బులు తీసుకున్నారు. స్కూటర్ డిక్కీలో తీసుకువెళుతుండగా, స్కూటర్ ముందు చక్రం పంక్చర్ అయింది. తోసుకుంటూ దగ్గరలోని గ్యారేజీకి వెళ్లారు. ఆ సమయంలో, ఓ అపరిచితుడు మీ డబ్బు కింద పడిపోయిందని చెప్పి శకుంతల, కుమారుని దృష్టిని మళ్లించాడు. అక్కడ చూడగా రూ. 10, 20, 50 నోట్లు నేలపై పడి ఉన్నాయి. వాటిని ఏరుకోవడానికి తల్లీ కొడుకు అటు తిరగ్గా, డిక్కీలోని డబ్బు, బంగారంతో దొంగ పరారయ్యాడు. బాధితులు విజయనగర పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఇటీవల ఓ వృద్ధుడు బ్యాంకులో రూ.4 లక్షల తీసుకుని స్కూటరు డిక్కీలో ఉంచగా, కొంతసేపట్లోనే దొంగలు కొట్టేశారు.
మంత్రిమండలిలో
మహిళలకు నో
● ఆకస్మాత్తుగా గాయత్రి పేరు తొలగింపు
● బోసురాజుకు పదవి
బనశంకరి: సీఎం డీకే.శివకుమార్ కేబినెట్‌లో మహిళా మంత్రులు లేకుండా పోయారు. చిక్కమగళూరు జిల్లా ఎమ్మెల్సీ గాయత్రి శాంతేగౌడ పేరు జాబితాలో ప్రకటించారు. కానీ చివరి క్షణంలో రాయచూరు నేత ఎన్‌ఎస్. బోసురాజును చేర్చి ఆమెను తొలగిచడం అంతటా చర్చనీయాంశమైంది. బోసురాజు గత సిద్దరామయ్య సర్కారులోనూ మంత్రిగా ఉండడం తెలిసిందే. ఇలా డీకే సర్కారులో మహిళా శక్తి కరువైంది.
చివర్లో ఇద్దరి మార్పు
శివాజీనగర: జాబితాలో ఆఖరి నిమిషం వరకూ మార్పులు జరుగుతూనే ఉన్నాయి. జాబితాలో ఇద్దరిని తొలగించి ఇద్దరిని చేర్చారు. మహంకాళ వైద్యను తప్పించి దావణగెరె మాజీ మంత్రి ఎస్.ఎస్.మల్లికార్జునకు చోటిచ్చారు. అలాగే గాయత్రి శాంతేగౌడను తీసేశారు. కారణాలు ఏమిటనేది తెలియకపోయినా బలమైన లాబీయింగ్, సీఎం శివ, సిద్దరామయ్య, పార్టీ నాయకత్వం అంచనాలే దీని వెనకుంటాయి.


