శివాజీనగర: వారాల తరబడి కసరత్తు, నిరీక్షణల తరువాత సీఎం డీకే శివకుమార్ మంత్రిమండలిలోకి కొత్త బలగం వచ్చి చేరింది. అనేక మందికి ఆశా భంగం కాగా, 19 మందిని మాత్రమే మంత్రిపదవీ యోగం వరించింది. వారిలో ఎక్కువమంది గత సిద్దరామయ్య కేబినెట్ సభ్యులే కావడం విశేషం.
ఇరు వర్గాలకూ సమానంగా
సోమవారం సాయంత్రం 5 గంటలకు లోక్‌భవన్‌లో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సిద్దరామయ్య వర్గానికి, డీ.కే.శివకుమార్ సన్నిహితులకు సమాన స్థానాలు కల్పించినట్లు కనిపిస్తోంది. నలుగురు లింగాయత్‌లు, ముగ్గురు ఒక్కలిగలు, ముగ్గురు ఎస్సీ నేతలు, ఇద్దరు ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో ఇద్దరు ముస్లింలు, ఒకరు లంబాణి, ఒకరు రాజపుత్ర, ఒకరు మరాఠా, ఒకరు ఉప్పర, ఒకరు ఈడిగ ఎమ్మెల్యేలు కొత్త మంత్రుల్లో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి ధరం సింగ్ కుమారుడు, కల్బుర్గి జిల్లా జీవర్గి ఎమ్మెల్యే అజయ్‌సింగ్‌కు ఎట్టకేలకు పదవి లభించింది. వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల కుంభకోణం కేసులో జైలుకు వెళ్లి మంత్రి పదవిని కోల్పోయిన బళ్లారినేత బీ.నాగేంద్రకు మళ్లీ మంత్రి పదవి లభించడం ఆశ్చర్యకరం.
7 మంది తాజా మాజీలకు చాన్సు
బనశంకరి: సిద్దరామయ్య ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన జమీర్ అహ్మద్‌ఖాన్, ఎస్‌ఎస్.మల్లికార్జున్, ఎన్.చలువరాయస్వామి, శివరాజ తంగడగి, సంతోష్ లాడ్, మధు బంగారప్ప, నాగేంద్ర, పుట్టరంగశెట్టికి పదవులు కట్టబెట్టడం గమనార్హం. వేర్వేరు ప్రభుత్వాల్లో మంత్రిగా ఉన్న బసవరాజ రాయరెడ్డి, హెచ్‌సీ.బాలకృష్ణ, పీఎం.నరేంద్రస్వామి, బీజేపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న లక్ష్మణ సవది డీకే కేబినెట్‌లో చేరారు.
వీరు కొత్తగా వచ్చారు...
కొత్తగా ఎవరు వచ్చారంటే.. టీ.రఘుమూర్తి, అజయ్ సింగ్, కేఎస్.బసవంతప్ప, కేఎం.శివలింగేగౌడ, విజయానంద కాశప్పనవర్ మంత్రులయ్యారు. వీరు సిద్దు కేబినెట్‌లో మంత్రులుగా లేరు.
బాగేపల్లిలో సుబ్బారెడ్డి అభిమానుల ఆందోళన
సిద్దరామయ్య గైర్హాజరు దేనికో?
సాక్షి, బెంగళూరు: మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ సీఎం సిద్దరామయ్య గైర్హాజరు ద్వారా అసంతృప్తిని వ్యక్తం చేశారు. సీఎం పదవిని ఆయన అయిష్టంగా వదులుకోవడం తెలిసిందే. అలాగే మంత్రుల ఎంపిక గురించి ఆయన అసంతృప్తితో ఉన్నారని, ఫలితంగా రాలేకపోయినట్లు సమాచారం. దీనిపై తలో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ గాయత్రి శాంతేగౌడ పేరును మంత్రుల జాబితా నుంచి చివరి నిమిషంలో తొలగించడం సిద్దరామయ్యకు ఆగ్రహం తెప్పించింది. ఆమెకు కుర్చీ ఇవ్వాలని సిద్దరామయ్య ప్రయత్నాలు చేశారని, తీరా తొలగించేసరికి అలిగారని పార్టీ వర్గాల కథనం.
బనశంకరి: నేను అందరికీ ఏదో ఒక అవకాశం కల్పిస్తా, ఎమ్మెల్యేలు ఓపిక పట్టాలని సీఎం డీకే.శివకుమార్ అసంతృప్త ఎమ్మెల్యేలను కోరారు. నివాసంలో డీకే.శివకుమార్ విలేకరులతో మాట్లాడారు. మంత్రి రేసులో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎక్కువమంది అర్హులు ఉన్నారు, కొన్ని సమయాల్లో పార్టీ నిర్ణయిస్తుంది. 2004లో నన్ను కూడా మంత్రివర్గంలోకి తీసుకోలేదని, ఓపిక వహించానని చెప్పారు. సహనం వల్లే ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నానన్నారు. మంత్రిపదవి దక్కలేదని కొందరు ఎమ్మెల్యేలు రాజీనామాలు ప్రకటించారని తెలిసిందన్నారు. కాగా, పెరుగుతున్న అసంతృప్తిని ఏ విధంగా సర్దుబాటు చేస్తారనేది ఉత్కంఠ కలిగిస్తోంది. ఇక శాఖల కేటాయింపు ఎలా ఉంటుందనేది కూడా కుతూహలమే.
నూతన మంత్రులు ఎవరంటే...
1) డాక్టర్ అజయ్‌సింగ్ (జేవర్గి నియోజకవర్గం)
2) హెచ్‌సీ.బాలకృష్ణ (మాగడి)
3) కేఎస్.బసవంతప్ప (మాయకొండ)
4) బసవరాజ రాయరెడ్డి (యలబుర్గా )
5) ఎన్.చలువరాయస్వామి (నాగమంగల)
6) లక్ష్మణ సవది (అథణి)
7) సారెకొప్ప మధు బంగారప్ప(సొరబ)
8) ఎస్‌ఎస్.మల్లికార్జున్ (దావణగెరె ఉత్తర)
9) బి.నాగేంద్ర (బళ్లారి గ్రామీణ)
10) నరేంద్రస్వామి (మళవళ్లి)
11) పుట్టరంగశెట్టి (చామరాజనగర)
12) టి.రఘుమూర్తి (చళ్లకెరె)
13) రిజ్వాన్ అర్షద్ (శివాజీనగర)
14).రుద్రప్ప లమాణి (హావేరి)
15) సంతోష్ ఎస్.లాడ్ (కలఘటగి)
16) కేఎం శివలింగేగౌడ(అరసికెరె)
17) శివరాజ్ తంగడగి (కనకగరి)
18) విజయానంద కాశప్పనవర్ (హునగుంద)
19) జమీర్ అహ్మద్‌ఖాన్ (చామరాజపేటే)
డీకే శివకుమార్ సీఎం అయిన సరిగ్గా 2 నెలల తరువాత మంత్రిమండలి విస్తరణ కుదిరింది. ఇప్పటికే 13 మంది మంత్రులు ఉండగా, మరో 19 మంది చేరారు. దీంతో దాదాపుగా పూర్తిస్థాయి కేబినెట్ ఊపిరి పోసుకుంది. ఇక పరిపాలనలో కొత్తదనం, వేగం చూపాల్సిన బాధ్యత డీకే భుజాలపై ఉంది. పేరుకే కొత్త మంత్రులైనా వారిలో చాలామంది గత ప్రభుత్వంలో, అంతకుముందు మంత్రులుగా పనిచేసినవారే కావడం విశేషం. నలుగురైదుగురు మాత్రమే కొత్త ముఖాలు. అదే సమయంలో అసమ్మతి జ్వాలలు భగ్గుమన్నాయి. మాకు బెర్తు దక్కలేదని అనేకమంది ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారు. కొందరు రాజీనామాలకూ సై అనడంతో రానున్న రోజులు డీకే సహనానికి పరీక్ష కాబోతున్నాయి.
ఎట్టకేలకు పూర్తయిన కాంగ్రెస్
హైకమాండ్ కసరత్తు
19 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం
ఇంకా ప్రకటించని శాఖలు
ఆశాభంగ ఎమ్మెల్యేల్లో ఆగ్రహ జ్వాల
బెర్తు దక్కక... భగభగ
ఎమ్మెల్యేల్లో ఆవేదన
అభిమానుల నిరసనలు
శివాజీనగర: సీనియర్లలో చాలామందికి మంత్రి గిరీ దక్కలేదు. దీంతో అనేకమంది ఆగ్రహానికి లోనయ్యారు. కొందరు ఎమ్మెల్యేల అభిమానులు నిరసనలకు కూడా దిగారు. బాగేపల్లిలో ఎమ్మెల్యే సుబ్బారెడ్డి అనుచరులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో రహదారిని దిగ్బంధించారు. ఉవ్వెత్తున మంటలు వేసి నినాదాలు చేశారు.
ముఖ్య నేతలకు మొండిచెయ్యి
బెళగావి జిల్లాలో తీవ్రమైన పోటీ నెలకొంది. లక్ష్మీ హెబ్బాళ్కర్, పీ.ఎం.అశోక్, గణేష్ హుక్కేరి, ఆసిఫ్ సేట్, మహాంతేష్ కౌజలగిలో ఎవరికీ సీటు రాకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. బాగల్‌కోట, విజయపుర, కల్బుర్గి, యాదగిరి, బీదర్, రాయచూరు జిల్లాలకు చెందిన ఆర్.బీ.తిమ్మాపుర, అప్పాజీ నాడగౌడ, శివానంద పాటిల్, ఎం.వై.పాటిల్, కనీజ్ ఫాతిమా వంటి ప్రధాన ఆశావహులకు ఆశాభంగమైంది. హుబ్లీ– ధార్వాడ ప్రాంతంలో ఎన్.హెచ్.కోనారెడ్డికి ఏమీ ఇవ్వలేదు.


