దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో అన్ని హోటళ్లలో తప్పనిసరిగా కస్టమర్లకు వేడి నీటిని అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి యూటీ ఖాదర్ ఆదేశించారు. ప్రతి వినియోగదారుకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని, అందులో వేడి నీరు కూడా ఉండాలని తెలిపారు. నిజానికి ఈ ఆదేశాలు గతంలోనూ ఉన్నాయి, కానీ పాటించే హోటళ్లు తక్కువ. కలుషిత నీటి వల్ల అనేక రోగాలు వస్తుండడంతో వేడి నీరు ఉంచాలని ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇది ఎంతమాత్రం అమలవుతుందో చూడాలి. వేడి నీరు ఇస్తున్నాం కాబట్టి, అదనంగా చార్జి చేస్తామని హోటళ్లు చెప్పే అవకాశముంది.
మాజీ భర్త ఉన్మాద చేష్టలు
దొడ్డబళ్లాపురం: భర్త వేధింపులను భరించలేక అతనికి విడాకులు ఇచ్చి ప్రశాంతంగా బతుకుదామనుకున్న మహిళకు పీడకలలా మారాడు. వేరుగా జీవిస్తున్న మాజీ భార్యను నానా రకాలుగా వేధిస్తున్న సైకో బెంగళూరు హెచ్‌ఏఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూశాడు. వైట్‌ఫీల్డ్ నివాసి అయిన మహిళ (36)ను ఆమె మాజీ భర్త నితిన్ గుప్త నానా రకాలుగా సతాయిస్తున్నాడు. వీరికి 2013లో ఢిల్లీలో పెళ్లయింది. అయితే నితిన్ ఆమెకు నరకం చూపించాడు. దీంతో విడాకులు తీసుకుని 2022లో బెంగళూరుకు వచ్చి జీవిస్తోంది. ఆమె ఇంటికి అర్ధరాత్రిళ్లు ఫుడ్ ఆర్డర్ పెట్టడం ప్రారంభించాడు. ఆమె ప్రైవేటు ఫోటోలను ఇంటర్నెట్‌లో పోస్టు చేశాడు. పలుమార్లు ఇంటికి వచ్చి హత్యాయత్నం చేసినట్టు బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేశారు.
బాధితులకు వినోద్‌రాజ్ అండ
మండ్య: మండ్య తాలూకాలోని బి. హట్ని గ్రామంలో రైతు దంపతులు మీసె పుట్టస్వామి (58), నాగమ్మ (55) అప్పుల బాధ వల్ల ఒకే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. నటుడు వినోద్‌రాజ్ వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. పాండవపుర దీపు, శర్మ, నాగేంద్ర, రాజేష్, గ్రామజనం ఆయన వెంట వచ్చారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దని తెలిపారు. కొంత ఆర్థిక సహాయం అందించారు. వినోద్ రాజ్ మాట్లాడుతూ కుటుంబీకుల్ని కోల్పోవడం ఎంతటి బాధో తెలుసన్నారు. మా అమ్మను కోల్పోయినప్పుడు ఆ బాధను అనుభవించాను, అలాంటి దుఃఖం మరో కుటుంబానికి కలగకూడదు అని చెప్పారు. వ్యవసాయం అనేది ప్రకృతిపై ఆధారపడి ఉంటుంది, సమస్య వస్తే ఆత్మహత్య చేసుకోవడం సరైనది కాదని గ్రామస్తులకు వివరించారు. బాధిత కుటుంబానికి పరిహారం, ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.


