సాక్షి,బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర అసంతృప్తి బయటపడింది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలోని మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైన వేళ పార్టీలో తిరుగుబాటు వ్యక్తమైంది. కేబినెట్‌లో చోటు దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఇండి నియోజకవర్గ ఎమ్మెల్యే యశవంతరాయగౌడ వి. పాటిల్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్ రుద్రప్ప లమాణికి అందజేశారు.
మరోవైపు సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బేలూరు గోపాలకృష్ణ సైతం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి కాంగ్రెస్ అధిష్ఠానానికి షాక్ ఇచ్చారు. తమతో పాటు మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు.
ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కేబినెట్‌లోకి కొత్తగా 20 మంది మంత్రులను చేర్చుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే, వరుస రాజీనామాలు, ఎమ్మెల్యేల అసంతృప్తితో రాజధాని బెంగళూరులో తీవ్ర కలకలం రేగింది. ఈ పరిణామాల నేపథ్యంలో, కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.


