సాక్షి,ఢిల్లీ: సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సహాజీవనంలోనూ గృహాహింస కేసు వర్తిస్తుందని తెలిపింది. పెళ్లయిన మహిళలకు రక్షణ కల్పించే సెక్షన్ 498ఏ.. సహజీవనంలో ఉన్న స్త్రీలకు అప్లై అవుతుందని పేర్కొంది. అయితే ఆ సదరు మహిళ తాము వివాహానికి సిద్ధంగా ఉన్నామని నిరూపించాల్సి ఉంటుందని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పు వెలువరించింది.
సహజీవనంలో (లివ్-ఇన్ రిలేషన్‌షిప్) ఉండే మహిళలకు సైతం వివాహితల మాదిరిగానే భర్త లేదా భాగస్వామి వేధింపులపై రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గృహహింస చట్టం కేవలం గృహహింస నిరోధాకానికి మాత్రమే కాకుండా, క్రిమినల్ చట్టాలు ఇటువంటి బాధితులకు రక్షణ కల్పిస్తాయని కోర్టు తెలిపింది. అయితే దీనికి తప్పనిసరిగా ఇద్దరు పరస్పర వివాహ అంగీకారంతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఈ రక్షణ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ నోంగ్మీకాపమ్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం తమతీర్పులో "భర్త లేదా అత్తమామలు ఉద్దేశపూర్వకంగా ప్రవర్తించి, మానసిక లేదా శారీరక గాయం కలిగించడం లేదా మహిళను ఆత్మహత్యకు పురికొల్పడం వంటి వేధింపులకు పాల్పడే కేసులకు రక్షణ కల్పించడమే సెక్షన్ 498A యొక్క ఉద్దేశ్యం అయినప్పుడు, అటువంటి వేధింపులు కేవలం వివాహం తర్వాత మాత్రమే జరుగుతాయని, అంతకు ముందు కాదని చెప్పడం, మా సునిశ్చిత అభిప్రాయంలో, విషయాన్ని అతి సరళీకరించడమే అవుతుంది... సెక్షన్ 498A ద్వారా ఉద్దేశించిన రక్షణకు సంబంధించినంత వరకు, 'వివాహం' 'వివాహ స్వభావం గల సహజీవనం' మధ్య ఉన్న ఈ వ్యత్యాసానికి, గృహ హింసను నివారించే లక్ష్యంతో ఎటువంటి హేతుబద్ధమైన సంబంధం లేదు అందువల్ల ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధం." అని తెలిపింది.


