గ్రాడ్యుయేట్, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలపై కాంగ్రెస్ కసరత్తు
నవంబర్‌లో 3 గవర్నర్ కోటా, మార్చిలో రెండు గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికలు
గ్రాడ్యుయేట్ స్థానాలపై పలువురు కాంగ్రెస్ నేతల ఆసక్తి
నల్లగొండ రేసులో గుత్తా అమిత్‌రెడ్డి... హైదరాబాద్ నుంచి సామా రామ్మోహన్‌రెడ్డి
పోటీలో దొమ్మాటి సాంబయ్య, లోకేశ్ యాదవ్, చనగాని దయాకర్
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి సభ్యుల (ఎమ్మెల్సీ) ఎంపికపై అధికార కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. నవంబర్‌లో ఖాళీ కానున్న మూడు గవర్నర్ కోటా స్థానాలు, వచ్చే ఏడాది మార్చిలో జరిగే రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయా స్థానాల్లో అభ్యర్థిత్వాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రాథమికంగా చర్చించారు. అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల కంటే తక్కువ సమయం ఉండగా వచ్చే మార్చిలో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఆయా స్థానాల అభ్యర్థిత్వాలపై వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రెండింటికి పది మందికి పైగా..
నల్లగొండ–ఖమ్మం–వరంగల్, హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు వచ్చే మార్చిలోపు ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఈ పట్టభద్రుల స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాణీదేవీ, తీన్మార్ మల్లన్న పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్‌లోనే ఓటరు నమోదు నోటిఫికేషన్ వస్తుందని రాజకీయ వర్గాల అంచనా. అప్పటి నుంచే ఓటర్ల నమోదు హడావుడి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాలకు పదిమందికిపైగా ఆశావహులు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ స్థానానికి టీపీసీసీ మీడియా, కమ్యూనికేషన్స్ కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఆయనతోపాటు ఉపాధ్యాయ సంఘాల నేత, టీపీసీసీ అధికార ప్రతినిధి జి. హర్షవర్దన్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరి సతీశ్ యాదవ్‌తోపాటు పలు విద్యాసంస్థల అధినేతలు కూడా పోటీ పడుతున్నారు. ఇక నల్లగొండ–ఖమ్మం–వరంగల్ స్థానం నుంచి తెలంగాణా డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనతోపాటు ఖమ్మం జిల్లా యువనేత డాక్టర్ జి.లోకేశ్ యాదవ్, వరంగల్ జిల్లాకు చెందిన దొమ్మాటి సాంబయ్య, నమిండ్ల శ్రీనివాస్, కాశీరాం నాయక్, నల్లగొండ నుంచి చనగాని దయాకర్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. వీరిలో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై త్వరలోనే పూర్తిస్థాయి కసరత్తు ప్రారంభమవుతుందని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి.
మిగిలిన సామాజిక వర్గాలకు..
గవర్నర్ కోటా కింద ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బొగ్గారపు దయానంద్, బస్వరాజు సారయ్యల పదవీకాలం నవంబర్‌లో ముగియనుంది. ఎస్సీ, ఓసీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన ముగ్గురి పదవీ విరమణతో ఖాళీ కానున్న స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయాన్ని పాటించాలని అధిష్టానం భావిస్తోంది. ఇందులో రెండు స్థానాలు బీసీలకు, ఒకటి ఎస్సీలకు ఇవ్వాలనేది ఆ పార్టీ నేతల ఆలోచనగా కనిపిస్తోంది. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచి్చన తర్వాత గౌడ, ముస్లిం, మాల, వెలమ, లంబాడీ, ఎంబీసీ సామాజిక వర్గాలకు ఎమ్మెల్సీలుగా అవకాశమిచ్చింది.
అందువల్ల నేపథ్యంలో ఈసారి మున్నూరుకాపు, యాదవ, పద్మశాలి, ముదిరాజ్, మాదిగ సామాజిక వర్గాలకు చెందిన నేతల పేర్లను పరిశీలించే అవకాశాలున్నాయి. ఒకవేళ ఓసీలకు ఇవ్వాల్సి వస్తే వైశ్య, బ్రాహ్మణ, కమ్మ సామాజిక వర్గాలకు అవకాశం లభించనుంది. ఇదిలాఉండగా, దేశవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి యువతకు అవకాశాలు కలి్పస్తారని, రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఓసీలకు కేటాయిస్తారని, గవర్నర్ కోటాలో బీసీ, ఎస్సీలకు అవకాశమిస్తారనే మరో చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతుండటం గమనార్హం.


