వెయ్యి మందికి ఇద్దరు నర్సులైనా లేరు
10 వేల నియామకాలు జరిగినా తీరని నర్సుల కొరత
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు 47 శాతం వెనుకబడిన తెలంగాణ
దక్షిణాదిలో చివరి స్థానంలో రాష్ట్రం.. రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో వైద్యారోగ్య రంగంలో భారీ స్థాయిలో నియామకాలు చేపట్టింది. ఒక్క నర్సింగ్ విభాగంలోనే దాదాపు10 వేల మందిని నియమించింది. వారికి రాష్ట్ర స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవల నాణ్యత పెంపుపై దృష్టి సారిస్తోంది. విదేశాల్లో ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకొని జపనీస్, కొరియన్, జర్మన్ భాషల్లో శిక్షణ ఇచ్చే ప్రణాళికను కూడా ప్రకటించింది. అయినా, రాష్ట్రంలో నర్సుల కొరత ఇంకా తీవ్రంగానే ఉందని తాజా గణాంకాలు చెబుతున్నాయి.
రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాలు చూస్తే.. 2026 అంచనా ప్రకారం రాష్ట్ర జనాభా 3.86 కోట్లు కాగా, తెలంగాణలో నమోదిత నర్సులు, మిడ్‌వైఫ్‌లు కలిపి కేవలం 60,919 మంది మాత్రమే ఉన్నారు. దీంతో వెయ్యి మందికి 1.58 మంది నర్సులు మాత్రమే అందుబాటులో ఉన్నట్టు తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రమాణం ప్రకారం వెయ్యి మందికి కనీసం ముగ్గురు నర్సులు ఉండాలి. ఆ లెక్కన తెలంగాణకు సుమారు 1.16 లక్షల మంది నర్సులు అవసరం కాగా, ప్రస్తుతం 55 వేల మంది నర్సుల కొరత ఉంది. అంటే డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణంతో పోలిస్తే రాష్ట్రం 47 శాతం వెనుకబడి ఉంది.
దక్షిణాదిలో తెలంగాణే చివర
రోగులకు సేవలందించే నర్సుల విషయంలో మన రాష్ట్రం దక్షిణాది రాష్ట్రాల్లో చివరి స్థానంలో నిలిచింది. కేరళలో వెయ్యి మందికి 10.47 మంది, కర్ణాటకలో 7.69 మంది, ఏపీలో 5.72 మంది, తమిళనాడులో 5.09 మంది నర్సులు ఉన్నారు. ఈ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో నర్సింగ్ మానవ వనరులు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ నర్సుల అవసరం కూడా వేగంగా పెరుగుతోంది. వైద్యులు చికిత్సను సూచిస్తే, రోగికి నిరంతర పర్యవేక్షణ, మందుల నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో స్పందించడం, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడం వంటి కీలక బాధ్యతలను నర్సులే నిర్వహిస్తారు. అందువల్ల నర్సుల కొరత నేరుగా రోగి సేవల నాణ్యతపై ప్రభావం చూపుతుందని ఆరోగ్య రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
నియామకాలతో తీరని సమస్య
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వేలాది నర్సింగ్ అధికారులను నియమించింది. గతంలో స్టాఫ్ నర్సుల నియామకాల ద్వారా వేల ఖాళీలను భర్తీ చేయగా, తాజాగా మరో విడతలో కూడా భారీ నియామకాలు చేపట్టింది. కొత్తగా ఎంపికైన నర్సులకు ప్రభుత్వ సేవా నియమాలు, రోగి భద్రత, ఇన్‌ఫెక్షన్ నియంత్రణ, అత్యవసర వైద్యం, వైద్య నైతికత తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. అయితే నియామకాలు మాత్రమే సరిపోవని నిపుణులు చెబుతున్నారు. నర్సింగ్ కళాశాలల్లో సీట్లు పెంచడం, గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించే నర్సులకు ప్రోత్సాహకాలు కల్పించడం, ఉద్యోగాల్లో కొనసాగేందుకు అనుకూల పరిస్థితులు సృష్టించడం, పదోన్నతుల వ్యవస్థను బలోపేతం చేయడం వంటి దీర్ఘకాలిక చర్యలు కూడా అవసరమని సూచిస్తున్నారు.
విదేశాలకు వెళ్లడమే కారణం కాదు
తెలంగాణలో నర్సుల కొరతకు విదేశీ వలసలే ప్రధాన కారణం కాదని గణాంకాలు సూచిస్తున్నాయి. విదేశాలకు వెళ్లే నర్సుల సంఖ్య కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో చాలా తక్కువ. అయినా, ఆ రాష్ట్రాల్లో నర్సుల సాంద్రత ఎక్కువగా ఉండగా, తెలంగాణలో మాత్రం తక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలోనే నర్సింగ్ మానవ వనరుల తయారీ, నియామకాలు, దీర్ఘకాలిక నిలుపుదలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో మౌలిక సదుపాయాల విస్తరణ, కొత్త వైద్య కళాశాలలు, ఆస్పత్రుల ఏర్పాటు, భారీ నియామకాలపై దృష్టి పెట్టినా, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన నర్సుల నిష్పత్తిని చేరుకోవడానికి ఇంకా గణనీయమైన దూరం ప్రయాణించాల్సి ఉందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నర్సింగ్ వ్యవస్థను సంఖ్యాపరంగానే కాకుండా నైపుణ్యపరంగా కూడా మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆరోగ్య రంగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


