‘నామినేటెడ్‌’పై కాంగ్రెస్‌ కసరత్తు | congress party focus on nominated posts | Sakshi
Sakshi News home page

‘నామినేటెడ్‌’పై కాంగ్రెస్‌ కసరత్తు

Aug 2 2026 5:48 AM | Updated on Aug 2 2026 5:48 AM

congress party focus on nominated posts

సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్

పీఏసీఎస్‌ చైర్మన్లు, డైరెక్టర్లతో పాటు కార్పొరేషన్లు, జిల్లా–రాష్ట్ర స్థాయి పదవుల భర్తీపై మార్గదర్శకాలు 

జిల్లాల వారీగా ఇన్‌చార్జి మంత్రుల సమావేశాలు 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు ప్రాధాన్యం

జాబితాలపై సీఎం, పీసీసీ చీఫ్‌ తుది నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను కాంగ్రెస్‌ పార్టీ వేగవంతం చేసింది. వ్యవసాయ పరపతి సహకార సంఘాల (పీఏసీఎస్‌) చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ కార్పొరేషన్లు, జిల్లా, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయి నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి అనుసరించాల్సిన విధివిధానాలను ఖరారు చేసింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని గాం«దీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌తో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి సమావేశమై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తిగా పార్టీ నాయకత్వం నిర్దేశించిన విధానాల ప్రకారమే చేపట్టాలని నిర్ణయించారు. సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ సూచనలకు అనుగుణంగా నియామకాలు చేపట్టాలని స్పష్టం చేశారు. నియామకాల విషయంలో స్థానిక నాయకత్వం అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులకు సముచిత గుర్తింపు కలి్పంచాలని సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలిసింది. 

ఆశావహుల పేర్లపై చర్చ 
ఉమ్మడి జిల్లాలకు నియమించిన ఇన్‌చార్జి మంత్రులు ఆయా జిల్లాల్లో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాలకు సంబంధిత జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, ఆయా నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులు, సీనియర్‌ నాయకులు హాజరై ఆశావహుల పేర్లపై చర్చించనున్నారు. స్థానిక పరిస్థితులు, పార్టీ బలోపేతానికి చేసిన కృషి, నాయకుల సేవలను పరిగణనలోకి తీసుకుని సమన్వయంతో నివేదిక సిద్ధం చేసి పీసీసీకి పంపాలని నిర్ణయించారు. నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో పార్టీ సంస్థాగత నాయకత్వానికి అధిక ప్రాధా న్యం ఇవ్వాలని గాం«దీభవన్‌లో జరిగిన సమావేశం నిర్ణయించింది.

మొత్తం పోస్టుల్లో సుమారు 60 శాతం పదవులను గతంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షులుగా పనిచేసిన నాయకు లు, జిల్లా కాంగ్రెస్‌ కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, నియోజకవర్గ స్థాయి సీనియర్‌ నాయకులకు కేటాయించాలని నిర్ణయించారు. పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేసిన వారికి గుర్తింపు కలి్పంచడమే ఈ నిర్ణయం ఉద్దేశమని పార్టీ వర్గాలు తెలిపాయి.

నియామకాలలో సామాజిక న్యాయం పాటించాలని కూడా సమావేశం నిర్ణయించింది.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు తగిన ప్రాధాన్యం కలి్పస్తూ అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం ఉండేలా జాబితాలు రూపొందించాలని సూచించారు. సామాజిక సమతుల్యతతో పాటు ప్రాంతీయ సమతుల్యతను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నాయకత్వం నిర్ణయించింది.

సీఎం, పీసీసీ చీఫ్‌ తుది నిర్ణయం 
జిల్లాల నుంచి వచ్చే నివేదికలను పరిశీలించిన అనంతరం అన్ని సంప్రదింపులు పూర్తి చేసి తుది జాబితాను సిద్ధం చేయనున్నారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌ గౌడ్‌ కలిసి తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో చాలాకాలంగా ఎదురుచూస్తున్న నామినేటెడ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ త్వరలోనే పూర్తి కానుందని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా పీఏసీఎస్‌ చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేషన్‌ చైర్మన్లు, ఇతర నామినేటెడ్‌ పదవుల నియామకాల కోసం ఎదురుచూస్తున్న పార్టీ నాయకుల్లో ఈ పరిణామం ఆసక్తిని రేకెత్తిస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement