కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ విషయంలో యూటర్న్‌? | Proposal to operate Kazipet Coach Factory in-house rather than handing it over to private sector | Sakshi
Sakshi News home page

కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ విషయంలో యూటర్న్‌?

Aug 2 2026 5:30 AM | Updated on Aug 2 2026 5:30 AM

Proposal to operate Kazipet Coach Factory in-house rather than handing it over to private sector

ప్రైవేటుకు అప్పగించకుండా సొంతంగా నిర్వహించాలని యోచన 

టెండర్లు పిలిచిన తర్వాత పునరాలోచన 

ఇటీవలే ఫ్యాక్టరీని సందర్శించిన రైల్వే బోర్డు చైర్మన్‌ 

ఆ తర్వాత ఢిల్లీలో ఉన్నతాధికారులతో భేటీ 

ప్రైవేటీకరణపై వస్తున్న విమర్శలే కారణం...త్వరలో తుది నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల దశాబ్దాల కల అయిన వరంగల్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ విషయంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఆధునిక మౌలిక వసతులతో నిర్మించిన ఈ కర్మాగారంలో కోచ్‌ల ఉత్పత్తిని ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని తొలుత నిర్ణయించిన రైల్వే బోర్డు ఇప్పుడు పునరాలోచనకొచ్చింది. ప్రైవేటు సంస్థలకు అప్పగించేబదులు తనే సొంతంగా ఫ్యాక్టరీని నిర్వహించాలని భావిస్తోంది. ఇటీవల ఈ కోచ్‌ఫ్యాక్టరీని పరిశీలించిన రైల్వే బోర్డు చైర్మన్, ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి దీనిపై అభిప్రాయాలు తీసుకున్నట్లు తెలిసింది. ప్రైవేటు సంస్థకు అప్పగించాలని తొలుత నిర్ణయించి ఇప్పటికే ఆమేరకు టెండర్లు కూడా పిలిచారు. ఇప్పుడు పునరాలోచన చేస్తుండటం విశేషం.  

ప్రైవేటీకరణపై వ్యతిరేకతే ప్రధాన కారణమా? 
కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ తెలంగాణ రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ప్రకటించిన ప్రాజెక్టు. ఈ ఫ్యాక్టరీ కోసం స్థానిక ప్రజలు, ప్రజాసంఘాలు, కార్మీక సంఘాలు, నిరుద్యోగ యువత ఏళ్ల తరబడి ఉద్యమాలు నిర్వహించారు. ప్రభుత్వ నిధులతో భూములు సేకరించి, కోట్లాది రూపాయల వ్యయంతో మౌలిక వసతులు కల్పించిన తర్వాత ఉత్పత్తిని ప్రైవేటు సంస్థలకు అప్పగించడం సమంజసం కాదని పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్రమంగా రైల్వేను ప్రైవేటీకరించే దీర్ఘకాలిక వ్యూహంలో ఇది భాగమని విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

రైల్వే శాఖ సొంతంగా చెన్నై ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ, కపుర్తల రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ, రాయ్‌బరేలీ మోడ్రన్‌ కోచ్‌ ఫ్యాక్టరీలాంటి పెద్ద ఫ్యాక్టరీలను నిర్వహిస్తోంది. వీటిల్లో స్థానిక యువతతో పాటు దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభించాయి. అదే, ప్రైవేటు సంస్థకు అప్పగిస్తే వాటిల్లో రైల్వే పరంగా ఉద్యోగాలు దొరకవు. ప్రధాన కొన్ని పోస్టులు మినహా మిగతావన్నీ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలోనే ఉంటాయి. ఇక, టెండర్‌ దక్కించుకున్న సంస్థ తన ప్రాంతానికి చెందిన వారికి మానవ వనరుల సరఫరా బాధ్యత అప్పగిస్తుంది. ఈ విషయంలో ఇప్పుడు రైల్వే శాఖ పునరాలోచనలో ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

ఆర్థిక అంశాల ఆధారంగా... 
ప్రైవేటు సంస్థలు టెండర్ల ద్వారా కోచ్‌ తయారీకి సూచించే ధరలు, రైల్వే స్వయంగా తయారు చేస్తే అయ్యే వ్యయాలపై కూడా మదింపు జరిగినట్టు తెలుస్తోంది. ప్రారంభ దశలో ప్రైవేటు భాగస్వామ్యం పెట్టుబడి భారం తగ్గించినా, దీర్ఘకాలంలో ఉత్పత్తి వ్యయం, నిర్వహణ, ఒప్పందాల అమలు, లీజు, రాయల్టీ వంటి అంశాల వల్ల ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారంఉండే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నట్లు సమాచారం. సొంతంగా ఉత్పత్తి జరిగితే... దీర్ఘకాలంలో రైల్వే శాఖకే అధిక ఆర్థిక ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

పెరుగుతున్న కోచ్‌ల డిమాండ్‌ 
దేశవ్యాప్తంగా వందే భారత్, అమృత్‌ భారత్, వందే మెట్రో, ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల అవసరం వేగంగా పెరుగుతోంది. ప్రస్తు­తం ఐసీఎఫ్, ఆర్‌సీఎఫ్, ఎంసీఎఫ్‌లపై భారీపనిభారం ఉంది. ఈ నేపథ్యంలో వరంగల్‌ కోచ్‌ ఫ్యాక్టరీని పూర్తిస్థాయిలో ప్రభు­త్వ ఉత్పత్తి కేంద్రంగా అభివద్ధి చేస్తే దేశవ్యాప్తంగా పెరుగుతు­న్న కోచ్‌ల అవసరాన్ని వేగంగా తీర్చే అవకాశం ఉంటుందని రైల్వే శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కోచ్‌ ఫ్యాక్టరీని రైల్వే అనుబంధ సంస్థ రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్, మరో ప్రైవేటు సంస్థతో కలిసి జాయింట్‌ వెంచర్‌గా అభివృద్ధి చేసింది. మహారాష్ట్ర లోని లాతూర్‌లోని మరాటా్వడా రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీని రైల్‌ వికాస్‌నిగమ్‌ లిమిటెడ్‌ సొంతంగా ఉత్పత్తి ప్రక్రియను నిర్వహిస్తోంది. కాజీపేటలో తాను నిర్మించిన కోచ్‌ ఫ్యాక్టరీని కూడా నిర్వహించేందుకు ఆ సంస్థ ఆసక్తి చూపుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement