కాంట్రాక్టు ఒకరిది.. చేసింది మరొకరు | Irregularities in Model Solar Village tenders: Telangana | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు ఒకరిది.. చేసింది మరొకరు

Aug 2 2026 1:16 AM | Updated on Aug 2 2026 1:16 AM

Irregularities in Model Solar Village tenders: Telangana

మోడల్‌ సోలార్‌ విలేజ్‌ టెండర్లలో అవకతవకలు 

ప్రభుత్వం వద్ద కాంట్రాక్టు సంస్థ తీసుకున్నది రూ.1.36 లక్షలు 

పనిచేసిన సంస్థకు కాంట్రాక్టు సంస్థ ఇచ్చింది రూ.86 వేలు 

ఒక ఇంటి కనెక్షన్‌పై సుమారు రూ.50 వేలు మిగులు 

ప్యానెల్స్‌ నాణ్యతపై అనుమానాలు 

ప్రయోగాత్మకంగా 81 గ్రామాల్లో 40 వేల ఇళ్లకు అనుమతి

సాక్షి, హైదరాబాద్‌: మోడల్‌ సోలార్‌ విలేజ్‌ టెండర్లలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. టెండర్లు దక్కించుకున్న సంస్థలు ఇళ్లపై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటుచేసే పనిని సబ్‌ కాంట్రాక్టుకు ఇచ్చేసి.. ఒక్కో ఇంటిపై రూ.40 వేల నుంచి రూ.50 వేలు దక్కించుకున్నాయన్న ఆరోపణలున్నాయి. వాస్తవ వ్యయం కంటే ఎక్కువ కోట్‌ చేసి టెండర్లు దక్కించుకున్నప్పటికీ.. అధికార యంత్రాంగం చూసీచూడనట్లు ఉందన్న విమర్శలున్నాయి. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పొందుతున్న ఇళ్లకు సౌర విద్యుత్‌ అందించాలనే లక్ష్యంతో ప్రయోగాత్మకంగా 81 గ్రామాల్లో 40 వేల ఇళ్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే... తొలిదశలో 20 వేల ఇళ్లకు ఈ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసేందుకు టెండర్లు పిలిచారు.

అందులో కేంద్రీయభండార్‌ సంస్థలు, మరో నాలుగు సంస్థలు టెండర్లలో పాల్గొన్నట్లు టీజీ రెడ్కో అధికారులు చెబుతున్నారు. ఇందులో 17,500 ఇళ్లకు  సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేయడంతోపాటు, ఇన్వర్టర్‌లు, మీటరింగ్, గ్రిడ్‌కు అనుసంధానం చేసేందుకు ఒక ఇంటిపై రూ.1.36 లక్షలకు టెండర్‌ కట్టబెట్టారు. టెండర్‌ దక్కించుకున్న కేంద్రీయ భండార్‌ సంస్థ స్థానికంగా సబ్‌ కాంట్రాక్టర్లకు కేవలం రూ. 86 వేలు మాత్రమే చెల్లించడం గమనార్హం. ఇప్పటికే 9వేల ఇళ్లపై ప్యానెల్స్‌ ఏర్పాటు పూర్తయినట్లు సమాచారం.  

నాణ్యతపై అనుమానాలు... 
టెండర్‌ దక్కించుకున్న సంస్థ మరీ అంత తక్కువకు సబ్‌ కాంట్రాక్ట్‌కు అప్పగించడం చూస్తే.. దాని నాణ్యతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సౌర విద్యుత్‌ ఫలకలు ఒకసారి ఏర్పాటు చేస్తే.. 25 సంత్సరాల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని చెబుతున్నారు. మరి సబ్‌కాంట్రాక్ట్‌ తీసుకుంటున్న సంస్థలు నాణ్యమైన ఫలకలు ఏర్పాటు చేస్తున్నాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒక్కో ఇంటిపై సౌర విద్యుత్‌ ఉత్పత్తికి రూ.1.36 లక్షలు వ్యయయ్యే ఈ పథకంలో రూ.60 వేలు కేంద్రం సబ్సిడీగా ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.76 వేలు వెచ్చిస్తూ.. ఉచితంగా అమలు చేస్తోంది. 2 కిలోవాట్‌ సౌర విద్యుత్‌తో ప్రతీరోజు 8 నుంచి 10 యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుందని అధికారవర్గాలు తెలిపాయి.

అంటే నెలకు 240–300 యూనిట్ల వరకు ఉత్పత్తి అవుతుంది. ప్రభుత్వం 200 యూనిట్ల వరకు విద్యుత్‌ వినియోగించుకునే గృహాలకు గృహజ్యోతి కింద ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేస్తోంది. సౌర విద్యుత్‌ను ఈ గృహాలకు అందించడం వల్ల ప్రభుత్వంపై భారం పడకుండా ఉండటమేకాక.. ఆయా గృహ యజమానులకు వినియోగానికిపోగా అదనంగా ఉత్పత్తయ్యే విద్యుత్‌ను డిస్కమ్‌లకు విక్రయిస్తే ఆదాయం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని మొదట సీఎం రేవంత్‌రెడ్డి సొంతూరులో, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గంలో అమలు చేస్తున్నారు.  

వ్యవసాయ పంపుసెట్లకు... 
ఈ 81 గ్రామాల్లోని ఇళ్లకు సౌర విద్యుత్‌ను అందిస్తున్న విధంగానే.. వ్యవసాయ పంపుసెట్లకు సౌర విద్యుత్‌ అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 16,078కి పైగా వ్యవసాయ పంపుసెట్లకు (7.5 కిలోవాట్‌ సామర్థ్యం) సోలార్‌ ప్యానెళ్లు అమర్చాలని నిర్ణయించింది. ఇందుకోసం ఒక్కో పంపు సెట్‌కు అయ్యే వ్యయం రూ. 4 లక్షలుగా నిర్ణయించారు. వీటి టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement