కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) ద్వారా ‘తెలంగాణ రైజింగ్-2047’ లక్ష్యసాధనలో భాగస్వామ్యం కావాలని కార్పొరేట్ సంస్థలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వం, పరిశ్రమలు, సమాజం సమష్ఠిగా కృషి చేస్తేనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ది ఇన్సిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్ఐ), హైదరాబాద్ ఛాప్టర్ ఆధ్వర్యంలో కొండాపూర్ లోని తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్‌లో రెండ్రోజుల పాటు నిర్వహించనున్న ‘50వ సదరన్ ఇండియా రీజినల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్’ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... 'తెలంగాణ రైజింగ్-2047' అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని, సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యంతో సాకారమయ్యే అభివృద్ధి విజన్ అని వివరించారు. ఆర్థిక వృద్ధితో పాటు సామాజిక పురోగతి సమాంతరంగా సాగేలా... ఆవిష్కరణల ద్వారా ఉపాధి అవకాశాలు సృష్టించేలా... అభివృద్ధి ప్రతి నియోజకవర్గానికి, దాని ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరేలా ఈ బృహత్తర ప్రణాళికను రూపొందించామన్నారు. ఈ లక్ష్య సాధనలో ప్రభుత్వం... పరిశ్రమలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ రంగం భాగస్వామ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు.
సీఎస్ఆర్ ద్వారా సమాజంలో మార్పు తెచ్చే కార్యక్రమాల అమలుకు, పరిశ్రమల స్థాపనకు సంబంధించి ప్రతి దశలోనూ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు భాగస్వామిగా, సహాయకారిగా ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు భరోసానిచ్చారు. ఏఐ, డేటా గవర్నెన్స్, సైబర్ భద్రత వంటి అంశాలు కార్పొరేట్ ప్రపంచంలో కొత్త సవాళ్లుగా మారుతున్న నేపథ్యంలో కంపెనీ సెక్రటరీలు... కేవలం కంప్లయన్స్ నిపుణులుగా కాకుండా స్ట్రాటజిక్ బోర్డ్ అడ్వైజర్లుగా మారాల్సిన
అవసరం ఉందన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీలు కేవలం లాభార్జనే కాకుండా... సస్టైనబుల్, ఎథికల్ వ్యాపార వృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కాన్‌స్టిట్యూయెన్సీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్( సీడీఎక్స్)కు నాలెడ్జ్ పార్ట్‌నర్‌గా ఉండేందుకు ముందుకొచ్చిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ప్రతినిధులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని కార్పోరేట్ కంపెనీలు, సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ఐసీఎస్ఐ ప్రతినిధులు మహదేవ్ తిరునగరి, ఎం.దామోదరన్, శిల్పా, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.


