సాక్షి, హైదరాబాద్: ట్రేడింగ్ స్కామ్‌లో రూ. 12.7 లక్షలు కోల్పోయిన ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు యాపిల్ యాప్ స్టోర్స్ ఇండియా హెడ్‌ను నిందితుడిగా చేర్చారు. సోమాజీగూడకు చెందిన బాధితుడు ఇన్‌స్ట్రాగామ్ ద్వారా జే–బారా మొబైల్ ట్రేడింగ్ యాప్ ప్రకటనకు ఆకర్షితుడై యాప్ ప్రతినిధిగా చెప్పుకున్న సోనల్ జగన్నాథ్ నాయక్‌ను ఫోన్లో సంప్రదించాడు. యాప్ స్టోర్‌కు సంబంధించిన ఓ లింకును వాట్సాప్ ద్వారా పంపిన నాయక్.. ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవాలని బాధితుడికి సూచించాడు.
అలాగే జూలియస్ బేర్ దలాల్ వ్యూ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూపులోనూ బాధితుడిని చేర్చాడు. దాని అడ్మిన్‌గా ఉన్న కునాల్ సుమయ అనే మహిళ బాధితుడికి పెట్టుబడులపై సలహాలు ఇచ్చింది. దీంతో బాధితుడు దశలవారీగా మొత్తం రూ. 12.7 లక్షలు పెట్టుబడి పెట్టగా యాప్‌లో ఆయన పెట్టుబడి విలువ రూ. 25.42 లక్షలకు పెరిగినట్లు చూపింది. కానీ పెట్టుబడి లక్ష్యాన్ని చేరుకోలేదంటూ ఆ ట్రేడింగ్ ఖాతాను నిందితులు బ్లాక్ చేశారు. ఆ తర్వాత కునాల్ సుమయ సహాయకురాలినని చెప్పుకున్న సోనాల్ జగన్నాథ్ నాయక్ అనే వ్యక్తి.. తాము డిమాండ్ చేసిన మొత్తం చెల్లించాలని డిమాండ్ చేయడంతో తాను మోసపోయినట్లు బాధితుడు గుర్తించాడు.
వెంటనే సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ఇందులో యాపిల్ ప్లే స్టోర్ పైనా ఆరోపణలు చేశారు. సదరు ట్రేడింగ్ యాప్ అందులో ఉన్నందునే తాను నమ్మానని పేర్కొన్నాడు. దీంతో యాపిల్ స్టోర్ హెడ్‌ను సైతం పోలీసులు నిందితుడిగా చేర్చారు. మరోవైపు రూ. 29.,25 లక్షలు కోల్పోయి ఖైరతాబాద్‌కు చెందిన ఓ సేల్స్‌మన్ ఇచ్చిన ఫిర్యాదుతో నమోదైన మరో కేసులోనూ జగన్నాథ్ నాయక్, కునాల్ నిందితులుగా ఉన్నారు.


