కావేరీ కత్తి.. విజయ్‌కు తొలి పరీక్ష! | Vijay Faces First Major Test as Tamil Nadu CM Over Cauvery Water Dispute | Sakshi
Sakshi News home page

కావేరీ కత్తి.. విజయ్‌కు తొలి పరీక్ష!

Aug 3 2026 7:14 AM | Updated on Aug 3 2026 7:18 AM

Vijay Faces First Major Test as Tamil Nadu CM Over Cauvery Water Dispute

తమిళనాడు రాజకీయాల్లో కావేరీ జల వివాదం మరోసారి వేడి పుట్టిస్తోంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) ప్రభుత్వానికి ఇది తొలి పెద్ద రాజకీయ సవాల్‌గా మారింది. ముఖ్యమంత్రి సి.జోసెఫ్‌ విజయ్‌ ముందు ఇప్పుడు రెండు సవాళ్లు ఉన్నాయి.. ఒకటి కర్ణాటకతో నీటి హక్కుల పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి? రెండోది.. రాష్ట్రంలో ప్రతిపక్షాల రాజకీయ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి?

కావేరీ అంశం తమిళనాడులో కేవలం నీటి సమస్య మాత్రమే కాదు.. ఇది రైతుల జీవనాధారం, ప్రాంతీయ హక్కులు, రాజకీయ ప్రతిష్ఠతో ముడిపడిన సున్నితమైన అంశం. అందుకే ఈ విషయంలో ఏ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రతిపక్షాలు నిశితంగా గమనిస్తుంటాయి.

అఖిలపక్ష సమావేశం కోసం డీఎంకే ఒత్తిడి
కావేరీ వివాదంపై ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డీఎంకే సహా ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కర్ణాటక ప్రభుత్వం మేకెదాటు డ్యామ్‌ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన నేపథ్యంలో.. తమిళనాడు ప్రభుత్వం కూడా అన్ని పార్టీలను కలుపుకుని వ్యూహం రూపొందించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.

డీఎంకే వాదన ప్రకారం.. కావేరీ వంటి కీలక అంశాల్లో రాజకీయ భేదాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు ఒకే వేదికపైకి రావాలి. ముఖ్యమంత్రి విజయ్‌ అఖిలపక్ష సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదని డీఎంకే ప్రశ్నిస్తోంది.

‘ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేశాం’
అయితే టీవీకే ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షాల డిమాండ్‌ను అంగీకరించడం లేదు. టీవీకే సీనియర్‌ నేత, మంత్రి సీటీఆర్‌ నిర్మల్‌కుమార్‌ మాట్లాడుతూ.. కావేరీ అంశంపై ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీలో చర్చ జరిగిందని, అన్ని పార్టీల మద్దతుతో తీర్మానం కూడా ఆమోదించామని తెలిపారు. అసెంబ్లీలో ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత మళ్లీ అఖిలపక్ష సమావేశం నిర్వహించాల్సిన అవసరం లేదని ఆయన వాదిస్తున్నారు. ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని టీవీకే ఆరోపిస్తోంది.

చర్చల నుంచి రాజకీయ విమర్శల దిశగా.. 
కావేరీ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నించిన విజయ్‌ ప్రభుత్వ వైఖరిలో ఇప్పుడు రాజకీయ దూకుడు కూడా కనిపిస్తోంది. విజయ్‌ కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో నేరుగా చర్చలు జరిపేందుకు ప్రయత్నించిన కొద్ది రోజులకే.. మంత్రి ఆర్‌. నిర్మల్‌కుమార్‌ కర్ణాటక సీఎంపై తీవ్ర విమర్శలు చేశారు. డీకే శివకుమార్‌ కర్ణాటక ప్రయోజనాల కంటే డీఎంకే నాయకత్వం ప్రభావంతో వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. “ఆయన సొంత పార్టీ నేతగా కాకుండా డీఎంకేతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది” అంటూ విమర్శలు చేశారు.

అయితే కావేరీ వంటి సున్నితమైన అంశంలో ఇలాంటి రాజకీయ ఆరోపణలు ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత వేడెక్కించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

విజయ్‌ వ్యూహం వెనుక..
అనుభవం ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే ప్రభుత్వాలు గతంలో కావేరీ వివాదం తీవ్రంగా మారిన ప్రతిసారి అఖిలపక్ష సమావేశాలను ఆశ్రయించాయి. అయితే విజయ్‌ ప్రభుత్వం మాత్రం మరో మార్గాన్ని ఎంచుకుంటోంది. సమస్యను నేరుగా చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సంకేతాలు ఇస్తోంది.

కర్ణాటక ముఖ్యమంత్రితో భేటీ కోసం బెంగళూరు వెళ్లాలని విజయ్‌ భావించినట్లు సమాచారం. అయితే కర్ణాటకలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆ పర్యటన వాయిదా పడింది. ఇక్కడే విజయ్‌కు అసలు పరీక్ష మొదలవుతుంది.

రాజకీయ అనుభవం ఉన్న పార్టీల మాదిరిగా ఉద్యమాల మార్గాన్ని ఎంచుకోవాలా? లేక చర్చల ద్వారా పరిష్కారం సాధించే ప్రయత్నం చేయాలా? అనే విషయంలో ఆయన నిర్ణయం కీలకం కానుంది.

కావేరీ నీటి వివాదం దశాబ్దాలుగా తమిళనాడు-కర్ణాటక మధ్య కొనసాగుతున్న సమస్య. ఇది మరీ ముఖ్యంగా తమిళ రాజకీయాల్లో ఎప్పుడూ భావోద్వేగ అంశమే. డెల్టా ప్రాంత రైతులకు కావేరీ నీరు అత్యంత కీలకం. నీటి విడుదలలో ఆలస్యం జరిగిన ప్రతిసారి తమిళనాడులో రైతుల ఆందోళనలు, రాజకీయ నిరసనలు తీవ్ర స్థాయికి చేరుతాయి. అందుకే ఈ అంశంలో ఏ ప్రభుత్వం బలహీనంగా కనిపించినా ప్రతిపక్షాలకు అది రాజకీయ ఆయుధంగా మారుతుంది.

డీఎంకే ఆందోళనతో మరింత వేడి
కావేరీ నీటి సమస్య, రైతుల అంశంపై టీవీకే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని డీఎంకే ఆగస్టు 3న తంజావూరులో భారీ నిరసనకు సిద్ధమవుతోంది. ఈ ఆందోళన ద్వారా విజయ్‌ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని డీఎంకే భావిస్తోంది. మరోవైపు టీవీకే మాత్రం తమ ప్రభుత్వం తమిళనాడు హక్కుల విషయంలో రాజీ పడదని చెబుతోంది.

విజయ్‌ ముందు రెండు మార్గాలు
ప్రస్తుతం కావేరీ వివాదం విజయ్‌ రాజకీయ నాయకత్వానికి తొలి పెద్ద పరీక్షగా మారింది. ఒకవైపు ప్రతిపక్షాల ఒత్తిడి.. మరోవైపు కర్ణాటకతో సున్నితమైన జల వివాదం.. ఇంకోవైపు రైతుల అంచనాలు.. ఈ మూడు అంశాలను సమతుల్యం చేయాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రి విజయ్‌కు ఎదురైంది. కావేరీ విషయంలో విజయ్‌ తీసుకునే నిర్ణయం కేవలం ఒక నీటి వివాదానికి పరిష్కారం చూపడమే కాదు.. ఆయన పరిపాలనా శైలి, రాజకీయ పరిపక్వతకు కూడా తొలి కొలమానంగా మారనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement