చైనా సోషల్‌ మీడియాలో భారత్‌పై విషం | Indian diaspora in China seeks action on anti-India content | Sakshi
Sakshi News home page

చైనా సోషల్‌ మీడియాలో భారత్‌పై విషం

Aug 3 2026 5:09 AM | Updated on Aug 3 2026 5:09 AM

Indian diaspora in China seeks action on anti-India content

ఆందోళన వ్యక్తం చేసిన ప్రవాస భారతీయులు  

బీజింగ్‌: చైనా సోషల్‌ మీడియాలో భారత్‌కు వ్యతిరేకంగా దూషణాత్మక కంటెంట్‌ పెరిగిపోతోంది. భారత వృత్తి నిపుణులకు చైనా ప్రభుత్వం వర్క్‌ వీసాలు జారీ చేయకుండా తిరస్కరిస్తోంది. చైనాలో పని చేస్తున్న భారతీయుల జీవిత భాగస్వాములు ఉద్యోగాలు, ఉపాధి పొందడంపై ఆంక్షల విధిస్తోంది. ఈ పరిణామాలపై చైనాలోని ప్రవాస భారతీయలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం నిర్వహించిన ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమలో వారు తమ అభిప్రాయాలు వెల్లడించారు. 

భారతీయ వృత్తి నిపుణులను ఒకచోట చేర్చి, ఆ వర్గానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు రాయబార కార్యాలయం శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. భారత రాయబారి విక్రమ్‌ దొరైస్వామి, కౌన్సిలర్లు నితిన్‌జీత్‌ సింగ్, రమేష్‌ సింగ్‌లతో కలిసి ప్రవాస భారతీయులు వివిధ అంశాలపై చర్చించారు. చైనా సోషల్‌ మీడియా వేదికలపై భారతీయుల ఆహారపు అలవాట్లు, సంస్కృతిని లక్ష్యంగా చేసుకుని వారిపై దూషణలతో కూడిన కంటెంట్‌ పెరుగుతోందని వెల్లడించారు. కాన్సులర్‌ సేవలకు సంబంధించిన ఇబ్బందులను ప్రస్తావించారు. తమ జీవిత భాగస్వాములకు ఇక్కడ ఉద్యోగాలు నిరాకరిస్తున్నారని తెలిపారు.

 ఆయా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని విక్రమ్‌ దొరైస్వామి చెప్పారు. చైనా సోషల్‌ మీడియాలో ప్రతికూల, దూషణాత్మక కంటెంట్‌ పట్ల వ్యక్తమవుతున్న ఆందోళనలపై స్పందించారు. అటువంటి కంటెంట్‌ పెరుగుదల పట్ల చైనా ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోందని అన్నారు. తమ వంతుగా వాస్తవ ఆధారిత సమాచారాన్ని తమ సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా ప్రచారం చేయడం ద్వారా తప్పుడు సమాచార వ్యాప్తిని ఎదుర్కొంటున్నామని ప్రకటించారు. భారతదేశపు విభిన్న సంస్కృతి, వంటకాలను ప్రదర్శించేందుకు చైనాలో పలు కార్యక్రమాలను నిర్వహించాలని ఎంబసీ యోచిస్తున్నట్లు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement