మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో దారుణం
బాలాఘాట్: పరువు పోతుందన్న అవమానభావంతో ఒక కుటుంబం అత్యంత పాశవికంగా ప్రవర్తించిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పెళ్లికాకుండానే గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చిన విషయం బయటకు పొక్కకుండా ఆ పసికందును అమ్మాయి కుటుంబం ఏకంగా పేడ కుప్పలో కప్పిపెట్టి ప్రాణంతీశారు. పేడ కుప్పలో సజీవంగా పూడ్చేసిన విషయం స్థానికుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. అందరికీ విషయం తెల్సిపోవడంతో పరువుపోయిందన్న భావంతో ఆ అమ్మాయి తండ్రి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలాఘాట్ జిల్లాలో వారాశివానీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో జూలై 31వ తేదీన ఒక యువతి పెళ్లికాకుండానే గర్భందాల్చి మగబిడ్డను ప్రసవించింది. పుట్టిన బిడ్డ ఏడుపు ఇరుగుపొరుగు వాళ్లకు గట్టిగా విన్పించింది. పరువుపోతుందన్న భయంతో వెంటనే అమ్మాయి కుటుంబం ఆ పసిబిడ్డ నోరు, మెడ చుట్టూ ఒక వస్త్రాన్ని గట్టిగా చుట్టి అలాగే పేడకుప్పలోకి పూడ్చేశారు. దీంతో పసిబిడ్డ చనిపోయింది.
ఏడుపు విన్న ఇరుగుపొరుగు వాళ్లు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెల్సి గ్రామ సర్పంచ్ అందర్నీ సమావేశపరిచాడు. అవివాహిత ప్రసవించిన విషయం ఆశా వర్కర్ ఇచ్చిన సమాచారంతో ధ్రువీకరించుకున్నారు. ఆగస్ట్ ఒకటో తేదీన పోలీసులు, తహíసీల్దార్, వైద్య బృందం ఆ పేడకుప్ప నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టమ్‌కు పంపించారు. పోస్ట్‌మార్టమ్ నివేదిక వచ్చాక తదనుగుణంగా దర్యాప్తు కొనసాగిస్తామని వారాశివానీ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ తెలిపారు.


