breaking news
dungi
-
పేడ కుప్పలో పసికందు సజీవ సమాధి
బాలాఘాట్: పరువు పోతుందన్న అవమానభావంతో ఒక కుటుంబం అత్యంత పాశవికంగా ప్రవర్తించిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పెళ్లికాకుండానే గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చిన విషయం బయటకు పొక్కకుండా ఆ పసికందును అమ్మాయి కుటుంబం ఏకంగా పేడ కుప్పలో కప్పిపెట్టి ప్రాణంతీశారు. పేడ కుప్పలో సజీవంగా పూడ్చేసిన విషయం స్థానికుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. అందరికీ విషయం తెల్సిపోవడంతో పరువుపోయిందన్న భావంతో ఆ అమ్మాయి తండ్రి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలాఘాట్ జిల్లాలో వారాశివానీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో జూలై 31వ తేదీన ఒక యువతి పెళ్లికాకుండానే గర్భందాల్చి మగబిడ్డను ప్రసవించింది. పుట్టిన బిడ్డ ఏడుపు ఇరుగుపొరుగు వాళ్లకు గట్టిగా విన్పించింది. పరువుపోతుందన్న భయంతో వెంటనే అమ్మాయి కుటుంబం ఆ పసిబిడ్డ నోరు, మెడ చుట్టూ ఒక వస్త్రాన్ని గట్టిగా చుట్టి అలాగే పేడకుప్పలోకి పూడ్చేశారు. దీంతో పసిబిడ్డ చనిపోయింది. ఏడుపు విన్న ఇరుగుపొరుగు వాళ్లు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెల్సి గ్రామ సర్పంచ్ అందర్నీ సమావేశపరిచాడు. అవివాహిత ప్రసవించిన విషయం ఆశా వర్కర్ ఇచ్చిన సమాచారంతో ధ్రువీకరించుకున్నారు. ఆగస్ట్ ఒకటో తేదీన పోలీసులు, తహíసీల్దార్, వైద్య బృందం ఆ పేడకుప్ప నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టమ్‌కు పంపించారు. పోస్ట్‌మార్టమ్ నివేదిక వచ్చాక తదనుగుణంగా దర్యాప్తు కొనసాగిస్తామని వారాశివానీ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ తెలిపారు. -
బుకాయింపు జబ్బుకు వైద్యమేదీ?
అనంతపురం అర్బన్ : జిల్లాలో డెంగీ మరణాలు లేనేలేవంటూ వైద్య, ఆరోగ్య శాఖ బుకాయిస్తోంది. 281 మందికి రక్త పరీక్షలు నిర్వహించగా, 44 మందిలోడెంగీ లక్షణాలు కనిపించాయని చెబుతోంది. డెంగీ కారణంగా ఇప్పటి వరకు ఒక్కరూ చనిపోలేదని అంటోంది. విష జ్వరాల వల్లే 18 మంది చనిపోయారని వివరణ ఇస్తోంది. ప్రభుత్వ వైద్య కళాశాల అందిస్తున్న వివరాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో 428 రక్త పరీక్షలు చేయగా.. అందులో 51 మందికి డెంగీ లక్షణాలు కనిపించాయని చెబుతోంది. వీరిలో ముగ్గురు మరణించినట్లు వైద్య కళాశాల వర్గాలు చెబుతున్నాయి. డెంగీ మరణాలకు నిలువెత్తు సాక్ష్యం ధర్మవరానికి చెందిన శ్రీవాణి(20) డెంగీ లక్షణాలతో ఈ నెల 14న మృతి చెందింది. ఈమె మరణాన్ని ఆరోగ్య శాఖ అధికారులు ‘వైరల్ హెమరైజ్డ్ ఫీవర్ విత్ త్రోంబోసైక్టోఫీనియా, సివియర్ హైపర్ టెన్షన్’ అని తేల్చారు. ‘హెమరైజ్డ్’ అంటే ప్లేట్లెట్స్ తగ్గిపోయి షాక్ సిండ్రోమ్‌లోకి వెళ్లడం ద్వారా శరీరంలోని ఏదైనా ప్రాంతంలో రక్తస్రావం అవుతుంది. దీనిని వైద్యులు డెంగీగా పరిగణిస్తారు. ఇదే విషయాన్ని వైద్య కళాశాలలోని సీనియర్ వైద్యులూ అంగీకరిస్తున్నారు. ఇలాంటి లక్షణాలతోనే ఈ నెల 18న ధర్మవరం పట్టణానికే చెందిన చరణ్(4) మరణించాడు. ఆ బాలుడిది కూడా డెంగీ మరణం కాదని అధికారులు బుకాయిస్తున్నారు. అదే రోజున బొమ్మనహాళ్ మండలం కురువళ్లికి చెందిన శాలిని (10 నెలలు) ఇదే రీతిలో మరణించింది. ‘డెంగీ’ కాదంటూ అధికారులు వితండవాదం చేస్తున్నారు. మరి ఏ కారణంతో వీరు చనిపోయారో చెప్పడం లేదు. ఈ నెల 21న మనోజ్‌కుమార్(5) డెంగీ లక్షణాలతో చనిపోగా, ఆరోగ్యశాఖ నిజమైన డయాగ్నసిస్ ఏమిటో తెలీదంటోంది. అదే రోజున ధర్మవరం మారుతీనగర్‌కు చెందిన నాగేంద్ర(32) జ్వరంతో చనిపోయాడు. ఇందుకూ కారణం తేలీదని నివేదికలో పేర్కొన్నారు. ఈ నెల 23న అనంతపురం మండలం ఇటుకలపల్లిలో వెన్నెల(11) మృతికి వైద్యులు ఎటువంటి కారణమూ వెల్లడించలేదు. రికార్డుల్లో ఉన్న కేసుల పరిస్థితే ఇలా ఉంటే ఇక లెక్కల్లో లేనివి అనేకం ఉన్నాయని ఆ శాఖలోని కొంత మంది ఉద్యోగులే చెబుతున్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ఉన్నతాధికారుల వద్ద చీవాట్లు తప్పించుకునేందుకే ఆరోగ్య శాఖాధికారులు ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. వారికి పట్టిన ఈ ‘బుకాయింపు’ జబ్బును ముందు నయం చేస్తేకానీ.. జిల్లాలో ‘డెంగీ’జ్వరాలు తగ్గుముఖం పట్టవన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పీహెచ్సీలలో సరైన వైద్యం అందక జ్వర పీడితులు అనంతపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వస్తున్నారు. ఇలా వస్తున్న వారితో ఆస్పత్రి కిక్కిరుస్తోంది. పీహెచ్సీలలో సరైన వైద్యం అందించే ఏర్పాట్లు చేయడంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇన్నాళ్లూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. వారం రోజులుగా పత్రికల్లో పెద్ద ఎత్తున వార్తలు వస్తుండటంతో ఇపుడు హడావుడి చేస్తున్నారు. ఇదంతా గమనించని కొందరు ప్రజాప్రతినిధులు.. అనంతపురం ఆస్పత్రిలో అందుతున్న సేవలు, రాజ్యమేలుతున్న సమస్యలు తెలుసుకోకుండానే నోటికి పని చెప్పడంపై వైద్య వర్గాల నుంచి విమర్శలు పెల్లుబుకుతున్నాయి.


