డ్రగ్స్‌తో జీవితాలు నాశనం | PM Modi launched the Nasha Mukt Yuva for Viksit Bharat Sankalp Abhiyan | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌తో జీవితాలు నాశనం

Aug 3 2026 5:03 AM | Updated on Aug 3 2026 5:03 AM

PM Modi launched the Nasha Mukt Yuva for Viksit Bharat Sankalp Abhiyan

మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయాలి  

యువతకు ప్రధాని మోదీ పిలుపు  

‘నషా ముక్త్‌ యువ ఫర్‌ వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ అభియాన్‌’ ప్రారంభం  

న్యూఢిల్లీ: మాదక ద్రవ్యాల వినియోగం వల్ల తాత్కాలికంగా ఉత్సాహం కలిగినప్పటికీ అవి వృత్తి, వ్యక్తిగత జీవితాలను పూర్తిగా నాశనం చేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయాలని యువతకు పిలుపునిచ్చారు. ‘నషా ముక్త్‌ యువ ఫర్‌ వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ అభియాన్‌’ కార్యక్రమాన్ని ఆయన ఆదివారం ఢిల్లీలో వర్చువల్‌గా ప్రారంభించారు. 

యువత మానసికంగా, శారీరకంగా దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలని.. ఇందుకోసం అన్ని రకాల మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండటం అవసరమని పేర్కొన్నారు. శత్రు దేశాలు తమ ఉగ్రవాద ప్రణాళికల్లో భాగంగా మాదక ద్రవ్యాల సరఫరాను ఒక ఆయుధంగా వాడుతున్నాయని ఆరోపించారు. డ్రగ్స్‌ వ్యసనం నుంచి బయటపడేవారు పోరాట యోధులని, సమాజం వారిని గౌరవించాలని సూచించారు.   

అవగాహన పెంచుకోవాలి..
చుట్టూ ఉన్న సమాజం తోడ్పాటు, యోగా, ధ్యానంతో మాదక ద్రవ్యాల వ్యసనం నుంచి సులభంగా బయటపడవచ్చని మన సంస్కృతి బోధిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. ‘నషా ముక్త్‌ యువ’కార్యక్రమం అనేది వ్యక్తి, కుటుంబం, సమాజం, అన్నింటికంటే ముఖ్యంగా దేశం పట్ల ఒక సంకల్పం అని చెప్పారు. ఈ కార్యక్రమం పేరులోనే దాని ఉద్దేశం ప్రతిబింబిస్తోందని అన్నారు. ‘అభివృద్ధి చెందిన భారతదేశం’మన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఇలాంటి తరుణంలో శారీరకంగా, మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటూ ఆత్మవిశ్వాసంతో నిండిన యువత మనకు అవసరమని స్పష్టంచేశారు. 

 డ్రగ్స్‌ వల్ల తలెత్తే దుష్పరిమాణాలపై అవగాహన పెంచుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయాలని చెప్పారు. నేటి నుంచే దేశవ్యాప్తంగా నషా ముక్త్‌ యువ అభియాన్‌ ప్రారంభమవుతోందని, ఇది ఒక సామూహిక ఉద్యమంగా మారినప్పుడు, మాదక ద్రవ్యాల నుంచి దేశానికి విముక్తి లభిస్తుందని వివరించారు. ఈరోజు తీసుకున్న సంకల్పం రాబోయే 100 వారాల పాటు ఇదే రీతిలో కొనసాగుతుందని పేర్కొన్నారు. 

రాబోయే 100 ఆదివారాలు ‘డ్రగ్స్‌ రహిత భారత్‌’దిశగా 100 బలమైన అడుగులు పడబోతున్నాయని వెల్లడించారు. ఒక చెడు వ్యసనం కేవలం శరీరాన్నే కాకుండా, తల్లి చిరునవ్వును దూరం చేస్తుందని, తండ్రి కలలను ఛిద్రం చేస్తుందని, సోదరి ఆశలను బలహీనపరుస్తుందని, తమ్ముడి గౌరవాన్ని హరిస్తుందని వ్యాఖ్యానించారు. తమ కళ్ల ముందే తమ పిల్లలు క్రమంగా తమను తాము కోల్పోతుండటం చూస్తూ కుటుంబ సభ్యులు ప్రతిరోజూ వేదనతోనే జీవిస్తుంటారని అన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ పోరాటంలో ప్రభుత్వం యువతకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.  

పిల్లల వ్యసనాలను దాచవద్దు 
దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు. గతంతో పోలిస్తే అరెస్టుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్నారు. రూ.వేల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వా«దీనం చేసుకున్నట్లు తెలిపారు. మాదక ద్రవ్యాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందన్నారు. సామాజికంగా పరువు ప్రతిష్టలకు భయపడి పిల్లల వ్యసనాలను దాచవద్దని, దానికి బదులుగా వారితో స్వేచ్ఛగా మాట్లాడాలని, వ్యసనం నుంచి బయటపడేందుకు నిపుణుల సహాయం లేదా వైద్య సాయం పొందాలని మోదీ సూచించారు. 

యువత మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండేలా ప్రోత్సహించడం, వారు సమాజంలో సానుకూల సామాజిక మార్పుకు రాయబారులుగా మారేలా చేసేందుకు ప్రభుత్వం ‘నషా ముక్త్‌ యువ’ను ప్రారంభించింది.  దేశవ్యాప్తంగా ప్రతి ఆదివారం పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో క్రీడలు, వాకథాన్‌లు, ధ్యానం, సాంస్కృతిక కార్యక్రమాలు, అవగాహన ప్రచారాలు, వీధి నాటకాలు, చర్చా వేదికలు, కళల పోటీలు, సామాజిక భాగస్వామ్య కార్యక్రమాలు ఉంటాయి. నషా ముక్త్‌ భారత్‌(వ్యసన రహిత భారత్‌)ను నిర్మించాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ‘నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌’ను ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి మన్సుఖ్‌ మాండవీయా వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement