బెంగళూరు: కర్ణాటకలోని మైసూరు జిల్లాలో చిప్స్ ప్యాకెట్‌లో ఉన్న చిన్న ప్లాస్టిక్ బొమ్మ బంతిని మింగడంతో ఐదేళ్ల బాలుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన బాలుడిని ముకుంద్ మయూర్‌గా గుర్తించారు. అతడు మాజీ గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షురాలు గౌరమ్మ, శంకర్ నాయక్‌ల మనవడు. సంతోష్, ఐశ్వర్య దంపతులకు ముకుంద్ ఒక్కగానొక్క కుమారుడు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ముకుంద్ ఓ చిప్స్ ప్యాకెట్‌లో ఉన్న చిన్న ప్లాస్టిక్ గిఫ్ట్ బంతిని గుర్తించి ప్రమాదవశాత్తు మింగినట్లు తెలుస్తోంది. ఆ బొమ్మ అతడి గొంతులో ఇరుక్కుని ఊపిరాడకుండా చేసినట్లు అనుమానిస్తున్నారు. బాలుడిని వైద్య సహాయం కోసం తీసుకెళ్లినా అతడిని కాపాడలేకపోయారు.
హున్సూర్ గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేసి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగా స్నాక్స్ ప్యాకెట్‌లోకి ప్లాస్టిక్ బొమ్మ ఎలా వచ్చిందనే విషయాన్ని అధికారులు పరిశీలించనున్నారు.
మరో ఘటన
ఈ ఘటన జరిగిన ప్రాంతంలోనే కొన్ని నెలల క్రితం మరో ఊపిరాడక మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో మైసూరు హున్సూర్‌లోని దొడ్డహెజ్జూర్ గ్రామంలో ఇంట్లో పూజ కోసం ఉంచిన ఎండిన మందార పువ్వు గొంతులో ఇరుక్కోవడంతో ఆరున్నర నెలల చిన్నారి చిన్మయ్ గౌడ మృతి చెందాడు. చిన్నారి తన అన్నతో ఆడుకుంటున్న సమయంలో ఇంటి తలుపు వద్ద ఉంచిన ఎండిన పువ్వును తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. అన్న దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించిన సమయంలో చిన్నారి పొరపాటున దానిని మింగాడు.
మొదట చిన్నారిని ప్రథమ చికిత్స కోసం హనగోడులోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం మైసూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రయత్నాలు చేసినప్పటికీ చిన్నారి మృతి చెందాడు. దీంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.


