ప్యోంగ్యాంగ్: జపాన్‌లో సైనిక బలగాల పెంపు, అమెరికాకు చెందిన టామాహాక్ క్షిపణి పరీక్షలపై ఉత్తర కొరియా తీవ్రంగా మండిపడింది. జపాన్ అనుసరిస్తున్న తీరును తప్పుపడుతూ, తమ దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే అదనపు సైనిక చర్యలు చేపట్టాల్సి వస్తుందని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ హెచ్చరించారు.
ఇటీవల జపాన్ విడుదల చేసిన రక్షణ శ్వేతపత్రం (డిఫెన్స్ వైట్ పేపర్)లో చైనా, రష్యా, ఉత్తర కొరియాలను ప్రధాన భద్రతా ముప్పులుగా పేర్కొనడం ఉద్రిక్తతలకు దారితీసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఏజిస్ డిస్ట్రాయర్ 'చోకాయ్' నుంచి జపాన్ ఇటీవల నిర్వహించిన టామాహాక్ క్రూయిజ్ క్షిపణి పరీక్షను కిమ్ యో జోంగ్ తీవ్రంగా ఖండించారు. జపాన్ తన రక్షణ వైఖరిని విడనాడి, ముందస్తు దాడులకు పాల్పడేలా, విదేశీ సైనిక చర్యలు చేపట్టేలా తన బలగాలను మలుచుకుంటోందని ఆమె ఆరోపించారు.
జపాన్ సైనిక విస్తరణ వెనుక అమెరికా పాత్ర ఉందని, అమెరికా సహకారంతోనే టోక్యో ఈ ప్రమాదకర చర్యలకు పాల్పడుతోందని కేసీఎన్ఏ వార్తా సంస్థ ద్వారా ఆమె వెల్లడించారు. జపాన్ దగ్గరున్న దీర్ఘకాలిక స్ట్రైక్ సామర్థ్యాలు ఉత్తర కొరియా సహా పొరుగు దేశాలను ప్రమాదంలో పడేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జపాన్ భద్రత ప్రమాదంలో పడేలా, ఆ దేశం పశ్చాత్తాపపడేలా తాము తగిన సైనిక ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తామని కిమ్ యో జోంగ్ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: ట్రంప్ షాక్: 28 వేల మంది డ్రైవింగ్ లైసెన్సులు రద్దు


