పదేళ్ల తర్వాత తెరిచారు.. నెలకే నేలమట్టం! | Japan Rebuilt Aeon Mall Collapses After Powerful 7.1 Magnitude Earthquake, Bringing Back Old Trauma, Video Went Viral | Sakshi
Sakshi News home page

పదేళ్ల తర్వాత తెరిచారు.. నెలకే నేలమట్టం!

Jul 29 2026 12:03 PM | Updated on Jul 29 2026 12:43 PM

Japan Earthquake: Kumamoto Aeon Mall Collapses After Reopening

గతాన్ని మరిచి కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. పునఃప్రారంభమైన నెల రోజులకే మరోసారి ప్రకృతి దెబ్బకు విలవిలలాడింది. భూకంపం ధాటికి శిథిలాలుగా మారిన జపాన్‌లోని కుమమోటో ఏయాన్‌ షాపింగ్‌ మాల్‌ విషాదం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.

దాదాపు పదేళ్ల కిందట భూకంపాన్ని తట్టుకుని తిరిగి నిలబడిన ఈ మాల్‌.. తాజాగా సంభవించిన భారీ ప్రకంపనలకు మరోసారి తీవ్రంగా దెబ్బతింది. మంగళవారం కుమమోటో ప్రాంతాన్ని వణికించిన 7.1 తీవ్రత గల భూకంపం ధాటికి 13 మంది మృతి చెందారు. అదే ఏరియాలో ఏయాన్‌ మాల్‌లోని రెండో అంతస్తు కుప్పకూలింది. ఆ తర్వాత చోటుచేసుకున్న పేలుడు పరిస్థితిని మరింత విషమంగా మార్చింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకోగా.. ఇద్దరు మహిళలు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

తొలి దెబ్బ 2016లో.. మళ్లీ ఇప్పుడు
కుమమోటో ప్రాంతానికి భూకంపాలు కొత్తేమీ కాదు. 2016లో వచ్చిన భారీ భూకంపాలు ఈ ప్రాంతాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఆ ప్రకంపనల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది భవనాలు దెబ్బతిన్నాయి. వాటిలో ఏయాన్‌ కుమమోటో షాపింగ్‌ మాల్‌ కూడా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంది. ఆ తర్వాత మాల్‌ను మూసివేసి భారీ పునర్నిర్మాణ పనులు చేపట్టారు. భూకంపాలను తట్టుకునేలా నిర్మాణంలో మార్పులు చేశారు. ఆధునిక భద్రతా ప్రమాణాలతో బలోపేతం చేశారు. చివరకు 2026 జూన్‌ 13న కొత్త రూపంలో తిరిగి ప్రారంభించారు.

దాదాపు 200 దుకాణాలు, సినిమా థియేటర్‌, ఫుడ్‌ కోర్ట్‌, వేలాది వాహనాలకు పార్కింగ్‌ సదుపాయాలతో ఈ మాల్‌ కుమమోటో ప్రజలకు ఓ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పదేళ్ల తర్వాత తిరిగి తెరుచుకోవడం స్థానికుల్లో కొత్త ఆశలు నింపింది.

కొత్త ఆరంభం.. నెలకే విషాదం
అయితే ఆ ఆనందం నెల రోజులు కూడా నిలవలేదు. భారీ భూకంపం ఒక్కసారిగా పరిస్థితిని మార్చేసింది. ప్రకంపనలు మొదలైన వెంటనే మాల్‌లో ఉన్న ప్రజలను బయటకు తరలించే ప్రయత్నాలు జరిగాయి. అయితే కొద్దిసేపటికే సంభవించిన పేలుడు మరింత భయాందోళనకు గురిచేసింది. పేలుడుకు గ్యాస్‌ లీక్‌ కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి భవనం భాగాలు కూలిపోవడంతో పలువురు లోపల చిక్కుకున్నారు. శిథిలాల మధ్య ప్రాణాలతో ఉన్న వారిని గుర్తించేందుకు రక్షణ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

‘సమయంతో పోరాటం’.. కొనసాగుతున్న గాలింపు
భూకంపం తర్వాత జపాన్‌ ప్రభుత్వం అత్యవసర సహాయక చర్యలను ముమ్మరం చేసింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, జపాన్‌ రక్షణ దళాలు రంగంలోకి దిగాయి. దాదాపు వేలాది మంది సిబ్బందిని సహాయక చర్యలకు మోహరించారు. జపాన్‌ ప్రధాని సనే తకైచి మాట్లాడుతూ.. ఇంకా సహాయం కోసం ఎదురుచూస్తున్న వారు ఉన్నారని తెలిపారు. "ఇది సమయంతో పోరాటం. ఒక్కో ప్రాణాన్ని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం" అని ఆమె పేర్కొన్నారు.

భూకంప ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వేలాది మంది ప్రజలు ఇళ్లను వదిలి సహాయక శిబిరాలకు తరలిపోయారు. ఎండ తీవ్రత కూడా పెరగడంతో బాధితులకు ఆహారం, నీరు, ఎయిర్‌ కండిషనింగ్‌, విద్యుత్‌ జనరేటర్లను అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

రవాణా వ్యవస్థపై ప్రభావం
భూకంప ప్రభావంతో కుమమోటో సహా పరిసర ప్రాంతాల్లో రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. క్యుషు ప్రాంతంలో బుల్లెట్‌ రైళ్ల సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు కూడా ప్రభావితమయ్యాయి. అయితే జపాన్‌ అధికారులు పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు వేగంగా చర్యలు చేపడుతున్నారు.

భారత్‌ సంఘీభావం
జపాన్‌లో సంభవించిన భారీ భూకంపంపై భారత్‌ కూడా స్పందించింది. విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ జపాన్‌ ప్రజలకు సంఘీభావం తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల భద్రత, త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు. "జపాన్‌లో సంభవించిన భూకంప వార్తతో తీవ్ర ఆందోళన చెందాను. జపాన్‌ ప్రభుత్వం, ప్రజలకు మా సంఘీభావం, మద్దతు తెలియజేస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు.

మాల్‌ మాత్రమే కాదు.. 
ఏయాన్‌ కుమమోటో మాల్‌ కేవలం ఓ షాపింగ్‌ సెంటర్‌ కాదు. 2016 భూకంపం తర్వాత కుమమోటో ప్రజలు తిరిగి కోలుకుంటున్నారనే సంకేతంగా అది నిలిచింది. పదేళ్ల తర్వాత పునఃప్రారంభం కావడం స్థానికులకు ఓ భావోద్వేగ క్షణంగా మారింది. కానీ అదే మాల్‌ నెల రోజులకే మరోసారి శిథిలాలుగా మారడం ఇప్పుడు విషాదాన్ని మిగిల్చింది. ఒకసారి ప్రకృతి దెబ్బ నుంచి కోలుకున్న నిర్మాణం.. మరోసారి అదే ప్రకృతి శక్తి ముందు నిలబడలేకపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement