పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో కొనసాగుతున్న ఆందోళనలు మరింత ఉద్రిక్తంగా మారాయి. నిరసనకారులపై భద్రతా బలగాల కాల్పుల్లో 14 మంది మృతి చెందిన ఘటనపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని కూడా భారత్‌తో సమానంగా శత్రువులుగా చూస్తానని ఆయన పేర్కొన్నారు.
స్థానిక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ వ్యతిరేకంగా వ్యవహరించే వారిని ఉపేక్షించేది లేదని వ్యాఖ్యానించారు. ‘‘నేను నిరసనకారులను కూడా భారత్ మాదిరిగానే శత్రువులుగా పరిగణిస్తాను’’ అని ఆయన చెప్పడం వివాదాస్పదమైంది. ఆందోళనకారులతో చర్చలకు అవకాశం లేదని, వారు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.
పీవోకేలో కాల్పులు.. 14 మంది మృతి
పీవోకేలోని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. రావల్‌కోట్ నుంచి ముజఫరాబాద్ వరకు సాగిన భారీ ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో కనీసం 14 మంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయినట్లు నిరసనకారులు వెల్లడించారు. పలువురు గాయపడ్డారు.
పీవోకే అసెంబ్లీలో కశ్మీరీ శరణార్థులకు కేటాయించిన 12 స్థానాలను రద్దు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ రిజర్వ్ సీట్ల విధానం వల్ల స్థానిక ప్రజల రాజకీయ హక్కులు ప్రభావితం అవుతున్నాయని JAAC ఆరోపిస్తోంది. ఇస్లామాబాద్‌కు చెందిన రాజకీయ పార్టీలు పీవోకే రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతోందని వారు విమర్శిస్తున్నారు.
అయితే పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. నిరసనకారుల వద్ద ఆధునిక ఆయుధాలు ఉన్నాయని, వారు భద్రతా సిబ్బందిపై దాడి చేయడంతోనే బలగాలు స్పందించాయని అధికారులు చెబుతున్నారు. ఇరువర్గాల వాదనలను స్వతంత్రంగా నిర్ధారించడం సాధ్యం కాలేదు.
కారణాలు ఉన్నాయి
పీవోకేలో ప్రస్తుత ఆందోళనలు ఒక్కసారిగా మొదలైనవి కావు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరల పెరుగుదల, విద్యుత్ కొరత, నిరుద్యోగం, పాలనా వైఫల్యాలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. చౌక ధరలకు విద్యుత్, గోధుమ పిండి సరఫరా, స్థానిక ప్రజలకు మెరుగైన పాలన, ఎక్కువ రాజకీయ హక్కులు కల్పించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. గత కొంతకాలంగా కొనసాగుతున్న నిరసనలు ఇప్పుడు ఇస్లామాబాద్ పాలనపై పెద్ద ఎత్తున వ్యతిరేకతగా మారాయి.
భారత్ స్పందన ఇదే..
పీవోకేలో జరుగుతున్న పరిణామాలపై ఇటు భారత్ కూడా స్పందించింది. అక్కడ చేపడుతున్న ఎన్నికల ప్రక్రియను కేవలం పాకిస్థాన్ ఆక్రమణను సమర్థించుకునే ప్రయత్నంగా భారత్ అభివర్ణించింది. పీవోకేలో ప్రజల అసంతృప్తికి కారణం ఆర్థిక దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, పాలనా వైఫల్యాలేనని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
ఇదిలా ఉండగా.. పీవోకే నిరసనకారులను భారత్‌తో పోల్చుతూ ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన సమయంలో మరింత కఠిన వైఖరి ప్రదర్శించడం ఉద్రిక్తతలను పెంచే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


