కాలిఫోర్నియా: బీచ్‌లో ఎత్తైన అలల తాకిడికి సముద్రంలోకి కొట్టుకుపోయిన పదేళ్ల బాలుడిని 16 ఏళ్ల లైఫ్‌గార్డ్ రక్షించాడు. ఆ యువకుడి ధైర్యానికి ఎరిక్ ట్రంప్ సహా ఎంతో మంది ప్రశంసలు కురిపించారు. కాలిఫోర్నియాలో ఉన్న శాంటాక్రూజ్‌లోని సీబ్రైట్ బీచ్‌లో శనివారం నాడు శక్తివంతమైన అలలు ఎగసిపడ్డాయి. అసాధారణమైన ఈ అలలు బీచ్‌కు వచ్చిన వారిని ఆశ్చర్యం, ఆందోళనకు గురి చేశాయి. విరుచుకుపడిన అలల తాకిడికి పదేళ్ల వయస్సున్న బాలుడు కొట్టుకుపోయాడు. ఉధృతమైన అలలతో పోరాడుతూ కనిపించాడు.ఒడ్డున ఉన్నవారు ఏం ఘోరం జరుగుతుందోనని భయపుడుతూ చూశారు.
ఇది చూసిన 16 ఏళ్ల లైఫ్‌గార్డ్ కొన్ని క్షణాల్లో రంగంలోకి దిగాడు. కల్లోలంగా ఉన్న సముద్రంలోకి దూకి, ఉధృతంగా ఉన్న అలలను ఎదుర్కొంటూ నీటిలో కొట్టుమిట్టాడుతున్న బాలుడిని చేరుకున్నాడు. అలలతో పోరాడుతూ, చివరికి ఆ బాలుడిని ఒడ్డుకు తీసుకొచ్చాడు. ఉత్కంఠభరితమైన రెస్క్యూ ఆపరేషన్‌ను బీచ్‌లో ఉన్న వ్యక్తులు చిత్రీకరించారు. ఈ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదకరమైన పరిస్థితిలో లైఫ్‌గార్డ్ చూపిన ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని ప్రశంసించారు. ఈ వీడియోపై ఎరిక్ ట్రంప్ కూడా స్పందించారు. రక్షించిన యువకుడిని ప్రశంసించారు.


