ఇరాన్ యుద్ధం మొదలయ్యాక ఇద్దరు నేతల మొదటి సమావేశం
వాషింగ్టన్: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ మంగళవారం వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు ఏకాంతంగా దాదాపు గంటన్నరపాటు చర్చలు జరిపారు. ఇరాన్‌తో యుద్ధం మొదలయ్యాక వీరిద్దరూ సమావేశమవ్వడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. వీరి మధ్య చర్చలు సానుకూలంగా, ఫలప్రదంగా జరిగాయని అనంతరం వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కెరొలిన్ లీవిట్ చెప్పారు. ఇద్దరు నేతలు చర్చించిన అంశాలపై వైట్‌హౌస్‌గానీ, ఇజ్రాయెల్ ప్రభుత్వం గానీ స్పందించలేదు. కాగా, ట్రంప్, నెతన్యాహూలకు ఇది కీలక సమావేశం.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ సొంత దేశంలో ప్రజాదరణ తగ్గిపోతుండటంపై నెతన్యాహూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ సైతం ఇరాన్‌తో యుద్ధం ప్రారంభించి, తలనొప్పులు తెచ్చుకున్నారు. నవంబర్‌లో మధ్యంతర ఎన్నికలు జరుగనుండగా ఇరాన్‌తో యుద్ధం కొనసాగించలేక, నిలిపివేసి ఓటమిని అంగీకరించలేక ఆపసోపాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరు నేతల మధ్య దెబ్బతిన్న సంబంధాలు తిరిగి గాడినపడే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు.


