వాషింగ్టన్ డీసీ: దోమల సంఖ్యను తగ్గించేందుకు ప్రయోగశాలలో పెంచిన దాదాపు 6,00,000 మగ దోమలను అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో వదులుతున్నారు. ఈ దోమల్లో వోల్బాకియా అనే సహజ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ మగ దోమలు అడవిలో ఉన్న ఆడ దోమలతో జతకట్టినప్పుడు గుడ్లు పొదగకుండా ఈ బ్యాక్టీరియా అడ్డుకుంటుంది. వాషింగ్టన్ డీసీలోకి వదులుతున్నవి మగ దోమలే కావడంతో అవి మనుషులను కరవవు, రక్తం పీల్చవు.
ఈ కార్యక్రమానికి సిల్వర్ స్ప్రింగ్ కేంద్రంగా పనిచేస్తున్న బీ సేఫ్ మస్కిటో కంట్రోల్ సంస్థ నాయకత్వం వహిస్తోంది. ఈ దోమల నియంత్రణ విధానాన్ని అందిస్తున్న అమెరికాలో తొలి ప్రైవేట్ సంస్థగా ఇది నిలిచింది. ఇప్పటివరకు ఇలాంటి కార్యక్రమాలను ప్రధానంగా ప్రభుత్వ సంస్థలు, దోమల నియంత్రణ, పరిశోధనా సంస్థలే నిర్వహించేవి.
ప్రస్తుతం ఈ సంస్థ వాషింగ్టన్ డీసీ, మేరీల్యాండ్ ప్రాంతాల్లోని దాదాపు 25 నివాస గృహాలకు సేవలు అందిస్తోంది. పాల్గొనే ప్రతి ఇంటి వెనుక భాగంలో వేసవి మొత్తం ప్రతి వారం సుమారు 1,500 మగ దోమలను విడుదల చేస్తున్నారు. దీంతో గుడ్లు తక్కువగా పొదగడం వల్ల స్థానిక దోమల జనాభా క్రమంగా తగ్గుతోంది.
ఈ దోమలను కెంటకీ కేంద్రంగా పనిచేస్తున్న మస్కిటోమేట్ సంస్థ సరఫరా చేస్తోంది. కెంటకీ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన సాంకేతికతతో వోల్బాకియా బ్యాక్టీరియా ఉన్న దోమలను ఈ సంస్థ పెంచుతోంది. విస్తృత స్థాయిలో కీటకనాశకాలు పిచికారీ చేయడానికి బదులుగా ఈ విధానం ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని బీ సేఫ్ చెబుతోంది. ఇది దోమలపైనే ప్రభావం చూపుతుందని, ఇతర కీటకాలు, అడవి జీవులపై ప్రభావం ఉండదని పేర్కొంది. ఈ సంస్థ దోమల నియంత్రణకు ఎర కేంద్రాలు, నిల్వ నీటికి జీవ చికిత్సలు వంటి ఇతర సేవలను కూడా అందిస్తోంది.
ఇప్పటికే పలు ప్రాంతాల్లో సక్సెస్
వోల్బాకియా విధానం ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో విజయవంతంగా అమలైంది. ఉదాహరణకు సింగపూర్ దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా బ్యాక్టీరియా సోకిన లక్షలాది మగ దోమలను విడుదల చేసింది. చికిత్స చేసిన ప్రాంతాల్లో దోమల సంఖ్య 90% వరకు తగ్గినట్లు వెల్లడించింది. 2026 చివరి నాటికి దేశంలోని సగం గృహాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరించాలని ఆ దేశం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ విధానంపై ఇప్పుడు అమెరికాలో ఆసక్తి పెరుగుతోంది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్, కాలిఫోర్నియా, ఫ్లోరిడా రాష్ట్రాల్లో లక్షలాది వోల్బాకియా బ్యాక్టీరియా ఉన్న దోమలను విడుదల చేసేందుకు నియంత్రణ అనుమతుల కోసం దరఖాస్తు చేసింది. ఇది కూడా ఇలాంటి దోమల నియంత్రణ కార్యక్రమంలో భాగమే.
బీ సేఫ్ వ్యవస్థాపకుడు టాడ్ మాంట్‌గొమెరీ ప్రకారం, ఉత్పత్తి వ్యయాలు, నిర్వహణ సవాళ్లు, నియంత్రణ అడ్డంకుల కారణంగా అమెరికాలో ఈ విధానం విస్తృత స్థాయిలో ఇంకా అమలుకాలేదు. పర్యావరణానికి అనుకూల దోమల నియంత్రణ పద్ధతులపై డిమాండ్ పెరుగుతున్న సమయంలో ప్రైవేట్ సంస్థలు ఈ లోటును భర్తీ చేయగలవని ఆయన అభిప్రాయపడ్డారు.
ఉష్ణోగ్రతలు పెరగడం, మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల దోమలు వృద్ధి చెందేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. దీంతో దోమల ద్వారా వ్యాపించే డెంగీ, జికా, వెస్ట్ నైల్ వైరస్ వంటి వ్యాధులపై ఆందోళనలు పెరుగుతున్న సమయంలో ఈ సాంకేతికతపై ఆసక్తి పెరుగుతోంది.


