మళ్లీ తీవ్ర కలకలం.. ఇరాన్‌పై అమెరికా భీకరదాడులు | US Forces Strike Iranian Drone Missile Sites After Attack On Cargo Ship | Sakshi
Sakshi News home page

మళ్లీ తీవ్ర కలకలం.. ఇరాన్‌పై అమెరికా భీకరదాడులు

Jun 27 2026 4:32 AM | Updated on Jun 27 2026 5:39 AM

 US Forces Strike Iranian Drone Missile Sites After Attack On Cargo Ship

టెహ్రాన్‌: అమెరికా-ఇరాన్‌ యుద్ధం మళ్లీ మొదలైంది. ఇరాన్‌కు చెందిన క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, తీరప్రాంత రాడార్ కేంద్రాలపై అమెరికా బలగాలు దాడులు చేసి, వాటిని బూడిద చేశాయి. దీంతో ఇప్పటికే అమల్లో ఉన్న సున్నితమైన కాల్పుల విరమణ ఒప్పందానికి ఎదురుదెబ్బ తగిలింది. 

ఇరాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, హార్మూజ్‌లో ఓ సరుకు రవాణా నౌకపై డ్రోన్‌ దాడి జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మండిపడ్డ కొన్ని గంటలకే యూఎస్‌ సేనలు టెహ్రాన్‌పై దాడులు చేయడం గమనార్హం. రెండు రోజుల క్రితం ఒమన్‌ తీరంలో ఒక వాణిజ్య నౌకపై మిసైల్‌ దాడి జరిగినట్లు బ్రిటిష్‌ సైన్యం కూడా పేర్కొంది. అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపిన వివరాల ప్రకారం.. వాణిజ్య నౌకలపై ఇరాన్ బలగాలు అనవసరంగా దాడి చేశాయి. దానికి ప్రతిస్పందనగానే ఇరాన్‌పై అమెరికా దాడులు చేసింది.

అమెరికా ఏమంది? 
క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, తీరప్రాంత రాడార్ కేంద్రాలపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ దాడులను డ్రోన్ దాడికి "బలమైన ప్రతిస్పందన"గా అభివర్ణించింది. ఇరాన్ ప్రమాదకర ప్రవర్తన వల్ల కీలక అంతర్జాతీయ వాణిజ్య మార్గంలో నౌకల రాకపోకల స్వేచ్ఛ దెబ్బతింటోందని పేర్కొంది. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలకు అమెరికా సైన్యం సహకారాన్ని కొనసాగిస్తుందని తెలిపింది. 

ఇరాన్ ఏమంది? 
ఈ దాడులకు అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కూడా కారణమని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఆరోపించింది. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ ఓడరేవు నగరం తహెరూయెహ్ పియర్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటాక భారీ పేలుడు శబ్దం వినిపించింది. ఆ ప్రాంతంలో క్షిపణి తాకడంతోనే పేలుడు జరిగిందని తెలిపింది.

అమెరికా-ఇరాన్‌ యుద్ధం ఫిబ్రవరి 28న మొదలైంది. యుద్ధానికి తుది పరిష్కారం దిశగా అమెరికా, ఇరాన్‌ చర్చలు జరుపుతున్న వేళ హార్మూజ్ జలసంధి తెరిచి ఉంచేలా జరుగుతున్న ప్రయత్నాలపై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement