ఓ ఫేక్‌ న్యూస్‌.. అమెరికా–ఇరాన్‌ అణు చర్చల్లో కలకలం | Fake Post Sparks Global Shock, How False Iran Nuclear Claim Reached Israel, US Political Circles | Sakshi
Sakshi News home page

ఓ ఫేక్‌ న్యూస్‌.. అమెరికా–ఇరాన్‌ అణు చర్చల్లో కలకలం

Aug 17 2026 10:50 AM | Updated on Aug 17 2026 11:04 AM

Indian Account Fake Claim Sparks Global Stir in US Iran Nuclear Tensions

క్షిపణులు, డ్రోన్లతో సాగుతున్న అమెరికా–ఇరాన్‌ ఘర్షణ ఇప్పుడు మరో కొత్త మలుపు తీసుకుంది. యుద్ధం కేవలం మైదానంలోనే కాదు.. సోషల్‌ మీడియా వేదికలపైనా సాగుతోంది. తాజాగా ఓ తప్పుడు సమాచారం అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టించింది. ఎలాంటి నిర్ధారణ లేకుండానే ఇజ్రాయెల్‌, అమెరికా రాజకీయ వర్గాల్లోకి చేరి.. చివరకు అణు చర్చలపై ప్రభావం చూపే స్థాయికి చేరుకుంది.

ఆగస్టు 5న ‘ఎక్స్‌’ (X) వేదికగా ఓ గుర్తుతెలియని భారతీయ ఖాతా నుంచి ఓ సంచలన పోస్టు వెలువడింది. ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కమాండర్‌ బ్రిగేడియర్‌ జనరల్‌ అహ్మద్‌ వహీది.. ‘‘అమెరికా, ఇజ్రాయెల్‌ వద్ద అణ్వాయుధాలు ఉన్నంత కాలం.. ఇరాన్‌ కూడా తన అణు ఆయుధాల లక్ష్యాన్ని వదులుకోదు’’ అని వ్యాఖ్యానించినట్లు అందులో పేర్కొన్నారు. దీనికి అణు పేలుడు మేఘాన్ని పోలిన ఏఐ రూపొందించిన చిత్రాన్ని కూడా జత చేశారు.

అయితే ఈ వ్యాఖ్యలు నిజంగా వహీది చేశారనే ఆధారాలు ఏవీ లేవు. ఇరాన్‌ అణ్వాయుధాన్ని తయారు చేసిందనే ఆధారాలు కూడా లేవు. అయినప్పటికీ ఆ పోస్టు వేగంగా వైరల్‌ అయింది.

భారత్‌ టు అమెరికా వయా ఇజ్రాయెల్‌.. 
సుమారు 1.75 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఆ భారతీయ ఖాతా నుంచి మొదలైన ఈ ప్రచారం.. కొన్ని గంటల్లోనే మరో భారతీయ ఖాతా ద్వారా హిందీలోకి అనువదించబడింది. ఆ తర్వాత ఇజ్రాయెల్‌కు చెందిన కొన్ని సోషల్‌ మీడియా ఖాతాలు దీనిని విస్తృతంగా ప్రచారం చేశాయి. 

ఇజ్రాయెల్‌లోని ఓ టీవీ ఛానల్‌ ఈ తప్పుడు సమాచారాన్ని ఆధారంగా చేసుకుని.. ‘‘ఇరాన్‌ తొలిసారి అణుబాంబు తయారీ లక్ష్యాన్ని అంగీకరించింది’’ అన్నట్టుగా కథనం ప్రసారం చేసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ జెరూసలేం‌లోని మౌంట్‌ హెర్జెల్‌ వద్ద చేసిన ప్రసంగంలో కూడా దీనిని ఇరాన్‌ ఉద్దేశాలకు నిదర్శనంగా ప్రస్తావించారు.

అమెరికాలోనూ ఈ ప్రచారం ప్రభావం చూపింది. ఐక్యరాజ్యసమితిలో ట్రంప్‌ ప్రభుత్వ ప్రతినిధి మైక్‌ వాల్ట్జ్‌ ఈ పోస్టును షేర్‌ చేస్తూ.. ఇరాన్‌ అసలు ఉద్దేశాలను అంగీకరించిందన్న అర్థంలో వ్యాఖ్యానించారు. అమెరికా సెనేటర్‌ రిక్‌ స్కాట్‌ కూడా దీన్ని పంచుకున్నారు. అయితే తర్వాత మైక్‌ వాల్ట్జ్‌ తన పోస్టును ఎలాంటి వివరణ లేకుండా తొలగించారు.

అణు చర్చలపై ప్రభావం
అమెరికా–ఇరాన్‌ మధ్య ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్‌ అణు కార్యక్రమంపై అమెరికా, ఇజ్రాయెల్‌ అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. తాము శాంతియుత అవసరాల కోసమే అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని టెహ్రాన్‌ చెబుతోంది. ఇలాంటి సమయంలో అణ్వాయుధాలపై ఇరాన్‌ నేత వ్యాఖ్యలంటూ వచ్చిన తప్పుడు ప్రచారం.. దౌత్య చర్చల వాతావరణాన్ని మరింత క్లిష్టంగా మార్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఫేక్‌ న్యూస్‌ పవర్‌ అది!
ఈ ఘటన సోషల్‌ మీడియా యుగంలో తప్పుడు సమాచారానికి ఉన్న ప్రభావాన్ని మరోసారి బయటపెట్టింది. ఒక గుర్తుతెలియని ఖాతా నుంచి వచ్చిన నిర్ధారణ లేని పోస్టు.. భాషలు, దేశాల సరిహద్దులు దాటి.. ప్రపంచ నాయకుల ప్రసంగాల్లోకి చేరింది. నిజానిజాలు నిర్ధారించకుండానే ప్రచారం జరిగితే.. అంతర్జాతీయ రాజకీయాలు, యుద్ధ నిర్ణయాలపైనా ప్రభావం చూపగలదని ఈ ఉదంతం స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement