రెండు ప్రాణాంతక ఇంజెక్షన్లు తరువాత ప్రాణాలతో బయటపడిన 50 ఏళ్ల క్రిస్టా పైక్ (Christa Pike) ఉదంతం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అమెరికాలోని టెన్నెసీలో ఇది చోటుచేసుకున్ ఈ ఘటనలోమరణశిక్షను తాత్కాలికంగా నిలిపి వేయాల్సి వచ్చింది. అయితే ఇపుడు ఆమె పరిస్థితి ఎలా ఉంది? అనేది చర్చకు దారి తీసింది.
ఒక విధంగా చెప్పాలంటే.. మూడు దశాబ్దాల తరువాత దోషిగా తేలిన క్రిస్టా ఉరిశిక్ష ఒక చరిత్ర. అది నిలిచి పోవడం మరో చరిత్ర. ఈ ఉదంతంతో మిగిలిన అన్ని ఉరిశిక్షలను నిలిపివేయడం కూడా ఊహించని పరిణామమే. ఇలాంటి అనూహ్య సంఘటనల సందర్భంలో న్యాయ వ్యవస్థ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది మరో చర్చ.
టెన్నెసీకి చెందిన క్రిస్టా గెయిల్ పైక్ జరిగిన హత్య కేసులో దోషిగా తేలింది. 18 ఏళ్ల వయసులో అప్పటి ప్రియుడు తడారిల్ షిప్‌తో కలిసి 1995లో ఒక ఘోరమైన నేరానికి పాల్పడింది. ఇద్దరూ కోలిన్ స్లెమ్మర్ (Collin Slemmer) అనే సహచర విద్యార్థిని నిర్జన ప్రదేశానికి రప్పించి నిర్దాక్షిణ్యంగా హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘ దర్యాప్తు అనంతరం ఇటీవల మొదటి డిగ్రీ హత్య, కుట్ర కింద మరణ శిక్ష పడింది. గత 200 ఏళ్లలో టెన్నెసీలో మరణశిక్ష పడిన తొలి మహిళ క్రిస్టానే. అయితే రెండు సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్లు ఇచ్చినా కూడా ఆమె ప్రాణాలతో బయటపడిన తర్వాత కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం అంతగా బాగాలేదని,మెదడు దెబ్బతినే (brain damage) ప్రమాదం ఉందని అంటున్నారు వైద్య నిపుణులు. ఆమె ఆరోగ్య సంక్షోభం నుండి కోలుకున్న తర్వాత తదుపరి ఏమి జరగనుందనే వివరాలు కూడా ఆసక్తికరంగా మారాయి.
ఇదీ చదవండి: మోనాలిసా భోస్లేకు భారీ ఊరట : తండ్రికి మొట్టికాయలు
మెదడు దెబ్బతింది?
ఇంజెక్షన్లు విఫలమవడంతో తీవ్రమైన క్రిస్టా మానసిక, శారీరక వేదనను ఎదుర్కొన్నారు. రెండు డోసుల నుండి ప్రాణాలతో బయ టపడిన తర్వాత, టెన్నెస్సీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కరెక్షన్ ప్రకటన ప్రకారం ఆమెను మరిన్ని సౌకర్యాలున్న ప్రాంతానికి తరలించారు. దీనిపై విచారణ కొనసాగుతోంది, ఈ తరుణంలో క్రిస్టా ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్లు వెలువడ్డాయి.
క్రిస్టా పైక్‌ను ప్రాణాలను కాపాడేందుకు నాష్‌విల్లే ఆసుపత్రిలో లైఫ్ సేవింగ్ మెడికల్ కేర్ కొనసాగుతోందని న్యాయవాదులలో ఒకరు తెలిపారు. ప్రాణాలతో ఉన్నప్పటికీ ఆమె ఆరోగ్యం అంతగా బాగాలేదన్నారు. ఈ బాధాకరమైన ప్రక్రియ తాలూకు తీవ్రమైన దుష్పరిణామాలుంటాయని వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఎమోరీ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ జోయెల్ జివోట్ (Dr. Joel Zivot) మాట్లాడుతూ, క్రిస్టాకు వైద్య పునరుజ్జీవన (resuscitation) చికిత్స అందించడంలో ఆలస్యం జరిగిందని, ఇది ఆమె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
క్రిస్టా పైక్‌కు మెదడు గాయం (brain injury) అయ్యే అవకాశం ఉందని ఆ ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు. ఈ రెండు ప్రాణాంతక ఇంజెక్షన్ల శారీరక ప్రభావం, గతంలో ఆమె ఎదుర్కొన్న లైంగిక వేధింపులు, దుర్వ్యవహారాల తాలూకు భావోద్వేగ క్షోభ కలసి ఆమె మెదడు దెబ్బతినడానికి దారితీయవచ్చు. డాక్టర్ జోయెల్ జివోట్ మాటల్లో చెప్పాలంటే పునరుజ్జీవన ప్రక్రియ ప్రారంభించడంలో జరిగిన ఆలస్యం కారణంగా మెదడు గాయంతో బాధపడే అవకాశం చాలా ఉంది.
మరోవైపు తాము ముందుగానే ఈ సమస్య గురించి హెచ్చరించామని ఆమె న్యాయవాదులు స్పైవి (Randy Spivey), కెల్లీ గ్లీసన్ (Kelly Gleason), అలాగే ఈస్టర్న్ టెన్నెస్సీకి చెందిన ఫెడరల్ డిఫెండర్ సర్వీసెస్ సభ్యులు స్టీఫెన్ ఫెర్రెల్ (Stephen Ferrell), లూక్ ఇహ్నెన్ (Luke Ihnen) సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
విఫలమైన ఉరిశిక్ష తర్వాత క్రిస్టా పైక్ పరిస్థితి ఏమిటి?
క్రిస్టా పైక్ మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని అధికారికంగా అభ్యర్థించింది. ఆధునిక కాలంలో ఒక ఖైదీ పట్ల జరిగిన అత్యంత క్రూరమైన చర్యలలో ఇది ఒకటని వారు అభివర్ణించారు. ఇంత హింసాత్మక అనుభవం తర్వాత, క్రిస్టాను మళ్లీ ఉరిశిక్ష గదికి వెళ్లేలా బలవంతం చేయడం కఠినమైన అసాధారణమైన శిక్ష, ఆమె రాజ్యాంగ హక్కును ఉల్లంఘించడమేనని వాదించారు.
టెన్నెస్సీ గవర్నర్ బిల్ లీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ క్రిస్టా ఉరిశిక్షను నిరవధికంగా వాయిదా వేశారు. అంతేకాదు 2026లో రాష్ట్రంలో జరగాల్సిన మిగతా అన్ని ఉరిశిక్షలను కూడా నిలిపివేశారు. అంతేకాకుండా, రాష్ట్ర ఉరిశిక్షా విధానాలపై సమగ్రమైన, మూడవ పక్షం స్వతంత్ర విచారణకు ఆయన ఆదేశించారు. తద్వారా కోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు క్రిస్టా పైక్ ఆసుపత్రి నుండి విడుదలైన తర్వాత నిర్బంధంలోనే ఉంటారు.


