ఒక ఫొటో.. అప్పట్లో భారతీయ చలన చిత్ర పరిశ్రమలో పెను సంచలనం. ఏకంగా అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో అప్పుడే స్టార్‌డమ్ దిశగా అడుగులేస్తున్న యువనటి నవ్వుతూ కనిపించింది. ఆ ఫొటో చుట్టూ ఎన్నో కథనాలు, ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. ఇద్దరి మధ్య సంబంధం ఉందని, దావూద్‌తో ఆమె డేటింగ్ చేసిందని, సీక్రెట్‌గా పెళ్లయ్యిందని.. వారికి ఓ బిడ్డ కూడా పుట్టాడంటూ వార్తలు గుప్పుమన్నారు. అయితే మొదటి నుంచీ ఆమె వాటిని ఖండిస్తూనే వచ్చారు. కానీ, తాజాగా షాకింగ్ కామెంట్లు చేశారామె. ఆ ఫొటో తన కెరీర్‌కు చాలా నష్టం చేసిందని చెప్పారామె.
ఏఎన్‌ఐ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో అలనాటి అందాల తార మందాకిని మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దావూద్ ఇబ్రహీం అనే వ్యక్తి తనకు పరిచయం లేదని.. అతను తనను దుబాయ్‌కు పిలవలేదని.. ఓ షో కోసం తానే అక్కడికి వెళ్లాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. అక్కడే ఓ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా దావూద్ కనిపించాడని.. ఆ సమయంలోనే మాట్లాడుకున్నామని చెప్పారామె. అయితే ఓ కళాకారిగా తాను ఎంతోమందిని కలుస్తుంటానని, ఆ ఫొటో ఆధారంగా రకరకాల కథనాలు రావడంపై తానేమీ చేయలేనని చెప్పారు. ఈ వివాదం తనకు ఎంతో నష్టం చేసిందని, అప్పట్లో వచ్చిన రూమర్లను తాను మీడియా ముందే ఖండించానని గుర్తుచేశారు.
సుమారు 1994–95 ప్రాంతంలో ఆ ఫొటో వెలుగులోకి వచ్చిన తర్వాత మందాకిని, దావూద్ సంబంధంపై రకరకాల కథనాలు వచ్చాయి. దావూద్‌ను పెళ్లి చేసుకున్నారని, అతనితో కలిసి దుబాయ్‌లో ఉంటున్నారని, వారికి ఓ కుమారుడు పుట్టాడని కూడా ప్రచారం జరిగినట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే 2005లో మందాకిని స్వయంగా ఈ వాదనలను ఖండించారు. దావూద్‌తో తనకు ఎలాంటి ప్రేమ సంబంధం లేదని, తాను 1990లో డాక్టర్ ఆర్. థాకూర్‌ను వివాహం చేసుకున్నానని చెప్పారు. తన కుమారుడు తన భర్తతోనే ఉన్నాడని స్పష్టం చేశారు.
‘ఆ విషయాలన్నీ తర్వాతే తెలిసింది’
1980లలో బాలీవుడ్‌లో అండర్‌వరల్డ్ డబ్బు, ప్రభావం గురించి తనకు అప్పట్లో తెలియదని మందాకిని తాజాగా చెప్పారు. సినిమాల్లో తర్వాత వచ్చిన కథల ద్వారానే ఆ విషయాలు తెలుసుకున్నానన్నారు. ఆ ఫొటో చుట్టూ జరిగిన ప్రచారం తన కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపిందని, ఒకానొక టైంలో సినీ ఆఫర్లు బాగా తగ్గిపోయాయన్నారు. ఇలాంటి వివాదాలను ఎదుర్కొనేందుకు ఓ ప్రత్యేక టీమ్ ఉండాల్సిన అవసరాన్ని తర్వాత అర్థం చేసుకున్నానని చెప్పారు. అయినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ఆమె చెప్పుకొచ్చారు.

సినిమా కాంట్రవర్సీ పైనా..
మందాకిని అసలు పేరు యాస్మిన్ జోసెఫ్. 1985లో రాజ్‌కపూర్ దర్శకత్వంలో వచ్చిన రామ్ తేరీ గంగా మైలీతో వెండితెరకు పరిచయమైన ఆమె.. తొలి సినిమాతోనే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ చిత్రంలో జలపాతంలో టాప్‌లెస్‌గా కనిపించడం అలాగే.. బిడ్డకు చనుబాలు ఇచ్చే సీన్‌లు ఆమెపై చిత్రీకరించారు. తాను 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఈ చిత్రీకరణ జరిగిందని, రాజ్‌కపూర్ ఎంతో సున్నితంగా సన్నివేశాలను వివరించారని చెప్పారు. జలపాతం సన్నివేశంలో తనకు ఎలాంటి అసభ్యత అనిపించలేదని, కథలో గంగా పాత్ర పవిత్రతను చూపించేందుకే వాటిని రూపొందించారని పేర్కొన్నారు. బిడ్డకు పాలిచ్చే సన్నివేశం కూడా కెమెరా యాంగిల్స్‌తో అలా కనిపించేలా చిత్రీకరించారని, నిజంగా పాలివ్వలేదని వివరించారు. ఆ తర్వాత చాలామంది జలపాతం సన్నివేశాన్ని మళ్లీ చేయాలని కోరినా తాను మాత్రం అంగీకరించలేదని తెలిపారు.
మందాకిని హిందీతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేశారు. సూపర్ స్టార్ కృష్ణ తీసిన సింహాసనంతో పాటు మలయాళంలో ఇతిలే ఇనియుమ్ వరూ, కన్నడలో హోస జీవన వంటి సినిమాల్లో నటించారు. దాదాపు 11 ఏళ్ల సినీ ప్రయాణంలో పలు చిత్రాల్లో కనిపించిన ఆమె.. 1996లో జోర్దార్ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. అయితే రామ్ తేరీ గంగా మైలీలోని జలపాతం సన్నివేశం, బిడ్డకు పాలిస్తున్నట్లు కనిపించే సన్నివేశం, ఆ తర్వాత దావూద్ ఇబ్రహీంతో ఉన్న ఫొటో చుట్టూ సాగిన వివాదం.. ఇవన్నీ ఆమె సినీ జీవితంలో ఇప్పటికీ ఎక్కువగా చర్చకు వచ్చే అంశాలుగా మిగిలిపోయాయి. తాజాగా ఈ విషయాలపై స్పందిస్తూ.. దావూద్‌తో ఫొటో వివాదం తన కెరీర్‌కు చాలా నష్టం చేసిందని మందాకిని చెప్పారు.
ఇదీ చదవండి: చాక్లెట్ తిన్నంత మాత్రాన ప్రాణం పోతుందా?


