బానెట్‌పై ఎక్కించి,ఈడ్చుకెళ్లి.. | Lucknow Hit-And-Run Shocker, Woman Dragged On Car Bonnet Near Janeshwar Mishra Park, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

బానెట్‌పై ఎక్కించి,ఈడ్చుకెళ్లి..

Sep 17 2026 8:31 AM | Updated on Sep 17 2026 9:04 AM

Lucknow Hit-And-Run: Woman Dragged On Car Bonnet Near Janeshwar Mishra Park

మహిళపై ఆగంతకుడి దురాగతం  

లక్నో: తనతో మాట్లాడుతున్న మహిళను ఏమాత్రం పట్టించుకోకుండా ఆమెను కారు బానెట్‌పైకి ఎక్కించి కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన దారుణోదంతం ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లక్నోలోని గోమతీ నగర్‌ పరిధిలోని జనేశ్వర్‌ మిశ్రా పార్క్‌ రోడ్డులో బుధవారం ఉదయం అనామిక అనే ఒక మహిళ గతంలో స్నేహితుడైన షానవాజ్‌తో వాగ్వాదానికి దిగింది. కారు దిగి మాట్లాడాలని ఆమె సూచించినా అతను కారు దిగలేదు. దీంతో ఆమె కారు ఎదుట నిలబడి వాగ్వాదానికి దిగింది. 

అయినాసరే ఆమెను పట్టించుకోకుండా కారును అలాగే ముందుకు పోనిచ్చాడు. దీంతో ఆమె కారు బానెట్‌ను పట్టుకుని అలాగే 25 మీటర్లకుపైగా ముందుకెళ్లింది. తర్వాత కొన్ని సెకన్లపాటు కారు ఆగింది. ఆ సమయంలో ఆమె కారు ముందు అద్దాన్ని బలంగా కొట్టడంతో రెచ్చిపోయిన ఆ వ్యక్తి అలాగే ఆమె మీదకు కారును పోనిచ్చాడు. దీంతో బానెట్‌పై వేలాడుతూ ఏడుస్తూ కాపాడండి అని అరిచింది. అయినాసరే పట్టించుకోకుండా అలాగే ఆమెను ఈడ్చుకెళ్లాడు. కారు వేగంగా దూసుకెళ్లడంతో ఆమె తర్వాత పక్కకు పడిపోయింది. తలకు అత్యంత సమీపంలో కారు కుడి ముందు టైరు దూసుకుపోయింది. దీంతో కొద్దిలో ఆమె ప్రాణాపాయ స్థితి నుంచి త్రుటిలో తప్పించుకుంది. ఇదంతా అక్కడ సమీపంలోని ఒక వ్యక్తి తన స్మార్ట్‌ఫోన్‌లో రికార్డ్‌చేశారు. 

గాయాలపాలైన మహిళ అనామిక ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు షానవాజ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు లక్నో ఈస్ట్‌ డెప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ దీక్షా శర్మ తెలిపారు. భారతీయ న్యాయ సంహితలోని హత్యాయత్నం నేరం కింద 109 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. అయితే అనామిక, షానవాజ్‌ ఏడాది క్రితం సహజీవనం చేశారని, షానవాజ్‌ ఇప్పుడు వేరే మహిళతో సన్నిహితంగా ఉండటంతో ఇద్దరి మధ్య విభేదాలు పెరిగి బుధవారం గొడవ పడినట్లు స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. అయితే అవన్నీ అబద్ధాలని షానవాజ్‌ చెప్పాడు. తన నగదును ఆమె తీసుకుందని అతను ఆరోపించాడు. కేసు దర్యాప్తులో నిజానిజాలు బయటపడతాయని పోలీసులు తెలిపారు.   

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement