గణేశ మండపంలో అవయవదాన సందేశం | Festival of Humanity with Organ Donation Message at Pandal | Sakshi
Sakshi News home page

గణేశ మండపంలో అవయవదాన సందేశం

Sep 17 2026 8:36 AM | Updated on Sep 17 2026 8:36 AM

Festival of Humanity with Organ Donation Message at Pandal

సూరత్: భక్తి, ఆధ్యాత్మికతతో పాటు సామాజిక అవగాహనకు గుజరాత్‌లోని సూరత్‌లో నిర్వహిస్తున్నగణేశోత్సవం వేదికగా నిలుస్తున్నది. వాస్తవ్ గ్రూప్ ఆధ్వర్యంలో ‘ఆర్గన్ డొనేషన్.. లైఫ్ డొనేషన్..’ అనే థీమ్‌తో వినూత్న గణేశ మండపాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. రాందేర్ రోడ్‌లోని తాడ్‌వాడీ చార్ రాస్తా వద్ద బేజన్‌వాలా కాంప్లెక్స్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ మండపం భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది.

వినాయక మండపం నేపథ్యంలో అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆకర్షణీయమైన పోస్టర్లు, స్ఫూర్తినిచ్చే వాస్తవ ఘటనలు, సందేశాల ద్వారా మరణానంతరం అవయవదానం చేయడం ద్వారా అవసరమైన వారికి జీవితంపై కొత్త ఆశ కల్పించవచ్చని వారు భక్తులకు వివరిస్తున్నారు. ఒక బ్రెయిన్ డెడ్ వ్యక్తి అవయవదానం ద్వారా 8 నుంచి 9 మంది వరకు ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు.

అవయవదానానికి సంబంధించిన పూర్తి ప్రక్రియను వివిధ దృశ్యాలు, సందేశాల ద్వారా ప్రదర్శించారు. బ్రెయిన్ డెడ్ వ్యక్తి కుటుంబ సభ్యులకు అవయవదానంపై కౌన్సెలింగ్ ఇవ్వడం, కుటుంబ సభ్యుల సమ్మతి అనంతరం అవయవదాతకు గార్డ్ ఆఫ్ ఆనర్‌తో గౌరవప్రదంగా వీడ్కోలు పలకడం, గ్రీన్ కారిడార్ ద్వారా అవయవాలను ఒక నగరం నుంచి మరో నగరానికి తరలించే ప్రక్రియను ఇందులో చూపించారు.

డొనేట్ లైఫ్ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత నీళేశ్ మండలేవాలా మాట్లాడుతూ.. 2047 నాటికి అవయవాల కొరత కారణంగా ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోని పరిస్థితి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. గణేశోత్సవం సందర్భంగా పెద్ద సంఖ్యలో యువతకు ‘ఆర్గన్ డొనేషన్.. లైఫ్ డొనేషన్..’ సందేశాన్ని చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: ఒకవైపు 6 మి.మీ. గణేశుడు.. మరోవైపు 50 వేల విగ్రహాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement