పండగ షాపింగ్‌కు.. ఏ కార్డు వాడదాం? | Which Credit Card to Use for Festive Shopping Ultimate Guide | Sakshi
Sakshi News home page

పండగ షాపింగ్‌కు.. ఏ కార్డు వాడదాం?

Sep 14 2026 8:43 AM | Updated on Sep 14 2026 8:45 AM

Which Credit Card to Use for Festive Shopping Ultimate Guide

ఖర్చు ఎలాంటిదన్న దాన్నిబట్టే కార్డు ఎంపిక

ఈ–కామర్స్‌కు ఒకటి... క్విక్‌ కామర్స్‌కు మరొకటి

ట్రావెల్, డైనింగ్‌ ఆఫర్ల కోసం మరిన్ని కార్డులు

వ్యాపార సంస్థలతో కలిసి కార్డులు తెస్తున్న బ్యాంకులు

ఆ సంస్థల్లో కొంటే ఆ కార్డులపై ప్రత్యేక డిస్కౌంట్లు

క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు సరే, వాటికి పరిమితులూ ఉంటాయి

కొన్ని జాగ్రత్తలతో క్రెడిట్‌ కార్డులు వాడితే... లాభం కూడా  

వినాయకచవితి వచ్చేసింది. మరో నెలరోజుల్లో దసరా. ఆ తరువాత దీపావళి. ఇలా వరుస పండగలొచ్చే సీజన్‌ మొదలయ్యింది. పండగంటే మొదట చేసేది షాపింగే. చాలామందికి ఈ విషయంలో అక్కరకొచ్చేది క్రెడిట్‌ కార్డే. ఎందుకంటే రెడీగా అంత డబ్బులు లేకపోవటం ఒక కారణమైతే... ఆ కార్డులపై వచ్చే ఆఫర్లు మరో కారణం. ఒక్కోసారి క్యాష్‌బ్యాక్‌ ఇతర ఆఫర్లను చూసుకుంటే నేరుగా నగదు పెట్టి కొనటం కన్నా క్రెడిట్‌ కార్డుతో కొంటేనే మంచిదనిపిస్తుంది. మరి ఈ సారి పండగ షాపింగ్‌ ఏ కార్డుతో చేస్తే బెటర్‌? ఎవరు ఎలాంటి ఆఫర్లిస్తున్నారు? అసలు ఒక కార్డు సరిపోతుందా? అవసరాన్ని బట్టి మన దగ్గర ఉన్న వివిధ రకాల కార్డులు ఉపయోగించటం మంచిదా? ఇవన్నీ సమగ్రంగా వివరించేదే ఈ ‘సాక్షి వెల్త్‌’ ప్రత్యేక కథనం.. – సాక్షి, వెల్త్‌

పండగ సీజన్‌లో షాపింగ్‌ పెరుగుతుంది. దుస్తులు, ఎల్రక్టానిక్స్, గ్రాసరీ, ఫుడ్‌ ఆర్డర్లు, ప్రయాణాలు.. ఇలా కుటుంబ ఖర్చులు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు భలే ఆకర్షిస్తుంటాయి. అయితే ఒక కార్డుపై ‘‘10% క్యాష్‌బ్యాక్‌’’ మరో కార్డుపై ‘15% క్యాష్‌బ్యాక్‌’ అని ఇచ్చారనుకోండి. 15% క్యాష్‌బ్యాక్‌ కార్డు బెస్ట్‌ అనుకోవాలా? అదే తప్పు. ఎందుకంటే ఎవరు ఎంత శాతాన్ని క్యాష్‌బ్యాక్‌గా ప్రకటించినా... దానికో లిమిట్‌ అంటూ ఉంటుంది. కార్డు వాడేవారు ఆ లిమిట్‌ను బట్టి తమకు అది ఉత్తమమో కాదో తేల్చుకోవచ్చు. కొన్ని కార్డులైతే నిర్దిష్ట వెబ్‌సైట్లు లేదా వ్యాపారుల దగ్గర కొంటే అధిక డిస్కౌంట్లు ఆఫర్‌ చేస్తాయి. కొన్ని కార్డుల్లో వార్షిక ఫీజు ఉంటుంది. కాబట్టి కార్డు ఎంచుకునేటప్పుడు క్యాష్‌బ్యాక్‌ శాతంతో పాటు నెలవారీ/త్రైమాసిక పరిమితి, వార్షిక ఫీజు, మినహాయింపులు, మీరు నిజంగా చేసే ఖర్చులను కూడా చూడాలి.

ఎవరికి ఏ కార్డు బెటర్‌...

డైనింగ్, గ్రాసరీ ఖర్చులు ఎక్కువైతే.. హెచ్‌ఎస్‌బీసీ లైవ్‌ ప్లస్‌

ప్రతిరోజూ క్యాష్‌బ్యాక్‌ అందిస్తున్న కార్డులో ప్రస్తుతం దీన్ని అత్యంత ఆకర్షణీయమైన కార్డుగా చెప్పొచ్చు. ఎందుకంటే డైనింగ్, ఫుడ్‌ డెలివరీ, గ్రాసరీ, షాపింగ్, యుటిలిటీ ఖర్చులపై 10 శాతం వరకూ క్యాష్‌బ్యాక్‌ ఉంటుంది. ఇది గరిష్ఠంగా నెలకు రూ.1200 వరకూ వస్తుంది. ఇతర అర్హత కలిగిన ఖర్చులపై మరో 1.5 శాతం క్యాష్‌బ్యాక్‌ ఉంటుంది. దీనికి ఎలాంటి పరిమితులూ లేవు. వార్షిక ఫీజు రూ.999. అయితే ఒక ఏడాదిలో గనక రూ.2 లక్షలు ఖర్చు చేస్తే రెన్యువల్‌ ఫీజు మినహాయింపు ఉంటుంది.

గ్రాసరీకి కొత్త ప్రత్యామ్నాయం.. ఫెడరల్‌ బ్యాంక్‌ పైసాబజార్‌ పైసాబ్యాక్‌

ఈ క్రెడిట్‌ కార్డు మార్కెట్‌కు చాలా కొత్త. ఎందుకంటే ఈ నెల్లోనే వచ్చింది. ప్రత్యేకంగా కుటుంబాలు ఖర్చుపెట్టే గ్రాసరీని టార్గెట్‌ చేస్తూ ఫెడరల్‌ బ్యాంక్, పైసాబజార్‌ కలిసి తెచ్చిన కోబ్రాండెడ్‌ కార్డు ఇది. అర్హత ఉన్న గ్రాసరీ కొనుగోళ్లపై 7.5 శాతం క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. రిలయన్స్‌ ఫ్రెష్, డీమార్ట్‌లో చేసే ఖర్చులకు ప్రాధాన్యమెక్కువ. స్టార్‌ బజార్, నేచర్‌ బాస్కెట్‌ వంటి సూపర్‌ మార్కెట్లతో పాటు బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌ బాస్కెట్‌ వంటి క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌ను కూడా ఈ కార్డు కవర్‌ చేస్తోంది. ఇవికాక ఇతర అర్హత ఉన్న ఖర్చులపై 1 శాతం క్యాష్‌బ్యాక్‌ ఉంది. రూ.2,000కు మించిన కొన్ని యూపీఐ లావాదేవీలపై 0.5 శాతం క్యాష్‌బ్యాక్‌ ఉంది. అయితే మొత్తం క్యాష్‌బ్యాక్‌ పరిమితి మాత్రం నెలకు రూ.1000 మాత్రమే. ఇదికాక ఏడాదికి రూ.1.5 లక్షలు గనక ఖర్చుచేస్తే వార్షిక ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ప్రతినెలా రూ.8,000 నుంచి రూ.15000 వరకు గ్రాసరీపై వెచ్చించే కుటుంబాలకు ఇది బెస్ట్‌ కార్డ్‌ అని చెప్పొచ్చు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయమేంటంటే క్యాష్‌బ్యాక్‌ అనేది పాయింట్ల రూపంలో  వస్తుంది. వాటికి ఏడాది కాలపరిమితి ఉంటుంది.  

డైనింగ్, ట్రావెల్‌కు సూపర్‌ కార్డు.. ఎస్‌బ్యాంకు పైసాసేవ్‌

డైనింగ్, ట్రావెల్‌ ఖర్చులపై 6 శాతం వరకూ క్యాష్‌బ్యాక్‌ ఉంది. అది కూడా నెలకు రూ.3వేల వరకూ. ఇతర అర్హత కలిగిన ఖర్చులపై 1% వరకూ క్యాష్‌బ్యాక్‌ ఉంది. స్విగ్గీ, జొమాటో, రెస్టారెంట్లు, మేక్‌ మై ట్రిప్, క్లియర్‌ ట్రిప్, హోటళ్ల వంటి డైనింగ్, ట్రావెల్‌ ఖర్చులన్నీ ఈ పరిధిలోకి వస్తాయి. నెలకు రూ.3000 అంటే ఏడాదికి రూ.36వేల దాకా గరిష్ఠంగా క్యాష్‌బ్యాక్‌ పొంద వచ్చు. రూ.499 ఫీజు ఉన్నా... ఏడాదికి  రూ.1.2 లక్షలు ఖర్చు చేస్తే మినహాయిస్తారు. అయితే, కొన్ని అర్హత గల లావాదేవీలకే 6% క్యాష్‌బ్యాక్‌ వస్తుంది.  

ఫ్లిప్‌కార్ట్, మింత్రాలో షాపింగ్‌ చేసేవారికి.. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ కార్డ్‌

ప్రస్తుతం ఈ కార్డుతో గనక మింత్రాలో షాపింగ్‌ చేస్తే 7.5%, ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్‌ చేస్తే 5%, క్లియర్‌ట్రిప్‌లో లావాదేవీలు జరిపితే 5% క్యాష్‌బ్యాక్‌ ఉంది. ఈ మూడు వ్యాపార సంస్థల్లోనూ జరిపే లావాదేవీలకు విడివిడిగా 3 నెలలకు రూ.4,000 గరిష్ఠ పరిమితి వర్తిస్తుంది. అంటే మూడింటిపై కలిసి ఏడాదికి గరిష్ఠంగా రూ.48వేల వరకూ క్యాష్‌బ్యాక్‌ పొందే అవకాశముంది. వార్షిక ఫీజు రూ.500 కానీ... ఏడాదికి రూ.3.5 లక్షలు గనక ఈ కార్డుపై ఖర్చుచేస్తే రెన్యువల్‌ ఫీజు ఉండదు.

సాధారణ ఆన్‌లైన్‌ ఖర్చులకు... ఎస్‌బీఐ క్యాష్‌బ్యాక్‌ కార్డ్‌

ఈ కార్డు ప్రధాన ఆకర్షణ ఏంటంటే... ఇది ఏదో కొన్ని వ్యాపార సంస్థలకే పరిమితం కావటం లేదు. ఆన్‌లైన్లో చేసే ఖర్చుల్లో అర్హత కలిగిన వాటిపై 5 శాతం వరకూ క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. ప్రతి స్టేట్‌మెంట్‌ సైకిల్‌కు గరిష్ఠంగా రూ.2,000 వరకూ క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. ఇక ఆఫ్‌లైన్‌ ఖర్చులపై కూడా 1 శాతం క్యాష్‌బ్యాక్‌ ఉంది. ఇది కూడా గరిష్ఠంగా రూ.2,000 పరిమితి లోబడి ఉంటుంది. సాధారణంగా స్టేట్‌మెంట్‌ సైకిల్‌ 30– 45 రోజులుగా ఉంటుంది. అంటే జాగ్రత్తగా ఉపయోగిస్తే గరిష్ఠంగా ఏడాదికి రూ.32,000 నుంచి రూ.48వేల వరకు క్యాష్‌బ్యాక్‌ అవకాశం ఉంది. అయితే యుటిలిటీ చెల్లింపులు, బీమా చెల్లింపులు, పెట్రోల్‌/డీజిల్, రెంట్, వాలెట్లోకి లోడ్‌ చేయటం, విద్యా ఖర్చులు, నగల కొనుగోళ్లు, రైల్వే టికెట్ల బుకింగ్‌ వంటివాటికి ఈ క్యాష్‌బ్యాక్‌ వర్తించదు.  

ప్రధాన ఆన్‌లైన్‌ సంస్థలకైతే.. హెచ్‌డీఎఫ్‌సీ మిలీనియా

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, టాటా క్లిక్, స్విగ్గీ, జొమాటో, ఉబెర్, బుక్‌ మై షో, సోనీ లైవ్, కల్ట్‌.ఫిట్‌ వంటి ప్రముఖ వ్యాపార సంస్థలతో ఈ కార్డు అనుసంధానమై ఉంది. కాబటల్టి వాటికి చేసే ఖర్చులైతే 5 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. ఇతర అర్హత కలిగిన ఖర్చులపై మాత్రం క్యాష్‌బ్యాక్‌ పరిమితి 1 శాతమే. కాకపోతే గరిష్ఠంగా ఒక స్టేట్‌మెంట్‌ సైకిల్‌కు రూ.1,000 పరిమితి వర్తిస్తుంది. వార్షిక ఫీజు వెయ్యి రూపాయలు. కానీ ఏడాదికి రూ.లక్ష ఖర్చుపెడితే దీన్నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ కార్డుపై మరో ప్రధాన ఆకర్షణేమిటంటే ఒక త్రైమాసికంలో గనక రూ.లక్ష వరకు ఖర్చు చేస్తే వెయ్యి రూపాయల ఓచర్‌ లేదా లాంజ్‌ బెనిఫిట్లలో ఏదో ఒకటి ఎంచుకునే మైల్‌స్టోన్‌ ప్రయోజనం ఉంటుంది.  

అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యులకైతే.. అమెజాన్‌ పే ఐసీఐసీఐ

దీన్ని చాలా ప్రత్యేకమైన కార్డ్‌గా చెప్పొచ్చు. ప్రత్యేకించి అమెజాన్లో షాపింగ్‌ చేసే అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యులకు ఇది అత్యుత్తమం. ఎందుకంటే అమెజాన్‌లో చేసే ఖర్చులపై ప్రైమ్‌ సభ్యులకైతే 5%, సభ్యులు కానివారికైతే 3% క్యాష్‌బ్యాక్‌ ఉంటుంది. అమెజాన్‌ పే భాగస్వాములకు గనక ఈ కార్డు ద్వారా పే చేస్తే దానికి  2%, ఇతర అర్హత కలిగిన ఖర్చులపై 1% క్యాష్‌బ్యాక్‌.  దీనికి పరిమితి కూడా లేదు. కార్డు తీసుకునేటపుడు ఎలాంటి ఫీజూ ఉండదు. రెన్యువల్‌ ఫీజూ ఉండదు. అమెజాన్‌లో తరచుగా కొనుగోళ్లు చేసే వారికి ఉత్తమం. అయితే క్యాష్‌బ్యాక్‌ నేరుగా బ్యాంక్‌ ఖాతాలోకి రాదు. అమెజాన్‌ పే బ్యాలెన్స్‌కు జతవుతుంది.

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ రెండింటికీ.. బాబ్‌ కార్డ్‌ క్యాష్‌బ్యాక్‌

అర్హత కలిగిన ఆన్‌లైన్‌ లావాదేవీలపై 5%, ఆఫ్‌లైన్‌ లావాదేవీలపై 1% క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది ఈ కార్డు. కాకపోతే నెలకు గరిష్ఠంగా రూ.1,500 మాత్రమే పొందగలుగుతారు. ఈ క్యాష్‌బ్యాక్‌ నేరుగా మీ బిల్లు నుంచి తగ్గిపోతుంది. అయితే ఈ ఆఫర్‌ పొందాలంటే ఒక స్టేట్‌మెంట్‌ సైకిల్‌లో కనీసం 4 లావాదేవీలైనా చేయాలి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి...

  • క్యాష్‌బ్యాక్‌ కోసం అదనంగా లేదా అనవసరంగా ఖర్చులు చేయొద్దు రూ.1,000 క్యాష్‌బ్యాక్‌ కోసం రూ.20,000 అనవసర ఖర్చు చేయటం నష్టమే.  

  • బిల్లు రాగానే అందులో కనీసం ఇంత చెల్లిస్తే సరిపోతుందని ఉంటుంది. కానీ అలా చేయొద్దు  మీరు చెల్లించాల్సిన పూర్తి మొత్తాన్ని గడువు తేదీ లోపు చెల్లించేయాలి. లేకపోతే వడ్డీ అనేది క్యాష్‌బ్యాక్‌కు ఎన్నో రెట్లు ఎక్కువకావచ్చు.  

  • ఈఎంఐకి క్యాష్‌బ్యాక్‌ వర్తిస్తుందో లేదో చూడాలి చాలా కార్డులపై ఈఎంఐ లావాదేవీలకు క్యాష్‌బ్యాక్‌ వర్తించదు.  

  • నెలవారీ/ త్రైమాసిక క్యాష్‌బ్యాక్‌ గరిష్ఠ పరిమితి చూడాలి.  

  • వార్షిక ఫీజును ఏ సందర్భాల్లో మినహాయిస్తారో ముందు తెలుసుకోవాలి.  

  • పండగ డిస్కౌంటు, కార్డు క్యాష్‌బ్యాక్‌ రెండూ వస్తాయని ముందే అనుకోవద్దు కొన్ని వ్యాపార సంస్థల ఆఫర్లు ఇతర క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లతో కలపలేని సందర్భాలుంటాయి.

ఒకటికి మించిన కార్డులు ఓకేనా?

ఉంచుకోవచ్చు, కానీ వార్షిక ఫీజులు తడిసి మోపెడు కాకుండా చూసుకోవాలి. వార్షిక ఫీజుల్లేని కార్డులు బెటర్‌. ఒకవేళ ఫీజులున్న కార్డులైతే గరిష్ఠంగా 2–3 చాలు. మీ ఖర్చుల్ని అన్ని కార్డులపై సమానంగా విభజించటం కాకుండా ఏ కేటగిరీకి ఏ కార్డు మంచిదో ఆఫర్లను బట్టి బేరీజు వేసుకుని వాడితే గరిష్ఠ లబ్ధి పొందొచ్చు. 

ఉదాహరణకు: అమెజాన్లో కొంటే... అమెజాన్‌ పే ఐసీఐసీఐ డైనింగ్, ట్రావెల్‌కు.. ఎస్‌ పైసా సేవ్‌ గ్రాసరీకి.. ఫెడరల్‌ పైసాబ్యాక్‌ మామూలు ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు.. ఎస్‌బీఐ క్యాష్‌బ్యాక్‌.

ఇదీ చదవండి: బోణీ కొట్టిన ‘గణేష్‌’ ఎకానమీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement