వినాయక చవితి
‘కుడుమిస్తే పండగ’ అని సామెత. పిల్లలకు కుడుములు తెచ్చే వినాయక చవితి వస్తే ఇక పండగే. ‘ఓ బొజ్జ గణపయ్య... నీ బంటు నేనయ్యా... ఉండ్రాళ్లు చవిచూడవయ్యా’ అని పాటలు పాడతాం కానీ ఆ కుడుములు గణేశుడు తినడు పాపం... మాకే ఇచ్చేస్తాడు. బొజ్జ గణపయ్యకు పిల్లలంటే ఇష్టం కదా మరి.
బాలగణేశుడు తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ తిరిగి అదే లోక ప్రదక్షిణగా గణనాయకుడైపోయాడు. ఆయన కేవలం తల్లిదండ్రుల చుట్టే తిరిగాడు. మేమైతే తల్లిదండ్రులు చెప్పిన స్కూళ్ళు, పుస్తకాలు, ట్యూషన్ల చుట్టూ తిరుగుతూ వినాయక చవితిరోజు మాకు బాగా మార్కులు రావాలని పుస్తకాలన్నీ తెచ్చి వినాయకుని విగ్రహం దగ్గర పెట్టేవాళ్లం. నూరు ఇవ్వకపోయినా గట్టున పడేసేవాడు.
అప్పట్లో డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయని? రూపాయి రూపాయికి అందరూ వెతుక్కోవడమే. మరి దేవుణ్ణి పెట్టాలంటే డబ్బు ఏదీ? అందుకే చందాలు మొదలయ్యాయి. ఇంటింటికీ తిరిగి రూపాయి, అర్ధ చందాలు వసూలు చేసి దేవుడి విగ్రహం పెట్టేవాళ్లు. ఇప్పటిలా వీధి వీధినా ఒకటి లేదనుకోండి. ఊరికి ఒకటి. అదీ మూడు రోజులే.
ఇక ఇళ్లల్లో వినాయక చవితికి మట్టి ప్రతిమలే. ఇవి ఎలా చేస్తారో చూద్దామని పండగరోజు ఉదయాన్నే బజారుకు నాన్నతో పాటు వెళ్లేవాళ్లం. వినాయకుని విగ్రహాలు అమ్మేవాళ్లు ఆ ముందురోజు రాత్రే ఊళ్లోకి దిగి బంకమన్ను, నీళ్లు ఏర్పాటు చేసుకుని వాళ్ల దగ్గర అచ్చులు పెట్టుకుని ఉండేవాళ్లు. బంకమన్ను కలిపి, నూనె రాసిన అచ్చులో అదిమి, అచ్చును పేపర్ మీద తిరగేస్తే వినాయకుని బొమ్మ రెడీ. అదే పేపర్‌లో దానిని చుట్టి ఇంటికి తెచ్చుకునేవాళ్లం. మా చిన్నప్పుడు వినాయకునికి గొడుగు తప్పనిసరి. అవి విడిగా అమ్మేవారు. రంగు కాగితాల గొడుగు కొనుక్కొని వచ్చి వినాయకుణ్ణి ప్రతిష్టించాక గొడుగు వెనుక గుచ్చేవాళ్లం.
చవితిరోజు చంద్రుణ్ణి చూస్తే నీలాపనిందలు వస్తాయని పెద్దవాళ్లు చంద్రుణ్ణి చూడొద్దని ముందే వార్నింగ్ ఇచ్చేవాళ్లు. శమంతకమణి కథలో శ్రీకృష్ణుడిపై మణి దొంగతనం నింద పడటానికి కారణం చవితి చంద్రుణ్ణి చూడటమే అని చెబుతారు. అందుకే చాలా భయం వేసేది. చంద్రుణ్ణి చూడకుండానే పెన్ను కొట్టేశామనో, నోట్సు చింపేశామనో మన మీద నిందలు పడుతూనే ఉంటాయి. చూస్తే ఇంకేమైనా ఉందా?
వినాయక చవితి రోజు ఉదయం పూట బజార్లన్నీ ఏవో గడ్డి మైదానాల్లా ఉంటాయి. పత్రి అమ్మేవారు వరుసగా కూచుని కిటకిటలాడుతూ ఉంటారు. అన్నిరకాల పత్రి ఒకరి దగ్గర ఉండదు. కొందరు మారేడు, గరిక అమ్మితే కొందరు ఉమ్మెత్త, మాచీపత్రం అమ్ముతారు. కొందరి దగ్గర జిల్లేడు దొరికితే, కొందరి దగ్గర వావిలి దొరుకుతుంది. ఇక కొన్నిరకాల పత్రి మనమే ఊరి బయటకు వెళ్లి, ΄÷లాల వెంట తిరిగి తెచ్చుకోవాలి. మొత్తం ఇరవై ఒక్క రకాల పత్రితో పూజ చేయాలని శాస్త్రం. అన్నీ ఔషధ గుణాలున్న ఆకులే.
అమ్మ ఉదయాన్నే లేచి వినాయకుడికి పెట్టాల్సిన ఉండ్రాళ్లు, కుడుములు, పాయసం తయారు చేస్తే నాన్న దూలానికి ‘పాలవెల్లి’ కట్టి దానికి మొక్కజొన్న ΄÷త్తులు, వెలగపండ్లు, సీతాఫలాలు వేలాడదీసేవారు. తొమ్మిదీ తొమ్మిదిన్నరకు పూజ మొదలయ్యేది. పూజ కొంచెం ఎక్కువసేపు జరిగినట్టు అనిపించినా, కుదురు లేనట్టుగా కూచున్నా అయ్యే వరకూ లేవడం అసాధ్యం. లేస్తే తిట్లే. పూజ అయ్యాక వినాయకుడి ముందు గుంజిళ్లు తీసి, చెంపలు వేసుకొని, చదువు బాగా రావాలని మొక్కుకునేవాళ్లం.
ఆ సాయంత్రం ఊళ్లో పిల్లలందరికీ ఒకటే ఆటలు. పల్లేరుకాయలతో కొట్టుకునే ఆట ఉండేది. భలే దెబ్బ తగిలేది. తర్వాత మానేశారు అలా కొట్టుకోవడం. తర్వాత మంటపం దగ్గర కూచుంటే స్పీకర్లలో ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం పాటలు తెగ వినిపించేవి. ప్రసాదం దక్కేది. వీలుంటే పాటకచ్చేరీ కూడా ఉండేది.
మూడు రోజులు వినాయకుణ్ణి ఇంట్లో ఉంచుకున్నాక ఇక నిమజ్జనం చేసేవాళ్లం. ఈనాటిలా పెద్దపెద్ద లారీలు, క్రేన్లు అప్పట్లో లేవు. వీధిలోని కుర్రాళ్లంతా కలిసి వీధిలోని మట్టి విగ్రహాలన్నీ ఒక చిన్న బండి మీదో లేదా చేతుల మీదుగానో మోసుకుంటూ ‘గణపతి బొ΄్పా మోరియా’ అంటూ కాలువకో, చెరువుకో లేదా సముద్ర తీరానికో ఊరేగింపుగా తీసుకెళ్లేవాళ్లం. తీరానికి వెళ్ళాక మట్టి వినాయకుడు నీటిలో కరిగిపోతుంటే, ‘వచ్చే ఏడాది త్వరగా రా తండ్రీ’ అని చేతులు ముడిచి దండం పెట్టేవాళ్లం.
ఆ రోజుల్లో వినాయక చవితి నిరాడంబరంగా, హోరు లేకుండా ఉండేది. ఆకుపచ్చగా ఉండేది. సహజంగా ఉండేది. పండగ అంతరార్థం తెలుసుకుంటే పర్యావరణంతో పాటుగానే పండుగ చేసుకోమని గణేశుడు చెప్తున్నట్టే ఉంటుంది. ప్రకృతిగణాలకు నాయకుడైన గణేశుడు ప్రకృతిని కాపాడి వానలు, పంటలు ఇవ్వాలని కోరుకుందాం.
– కె
ఇదీ చదవండి: వినాయక చవితి.. పత్రి


