ఇల్లు కట్టుకోవాలంటే సాధారణంగా స్థలం చూసుకుని, ఆర్కిటెక్ట్‌ను పిలిచి, నచ్చిన డిజైన్‌లో నిర్మించుకుంటాం. కానీ అమెరికాకు చెందిన ఓ బిలియనీర్ మాత్రం భిన్నంగా ఆలోచించారు. తొలుత ఇండోనేషియాలోని బాలి దీవిలో ఓ ఇల్లు కట్టించారు. తర్వాత దాన్ని ముక్కలు ముక్కలుగా విడదీసి, వేల కిలోమీటర్ల దూరంలోని హవాయికి తెచ్చుకుని అక్కడ పునర్‌నిర్మించుకున్నారు. ఇన్ని వ్యయప్రయాసలకోర్చి ముచ్చటగా కట్టించుకున్న ఆ ఇంటిని ఇప్పుడు అమ్మకానికి పెట్టడంతో ఇది మరోసారి వార్తల్లోకి వచ్చింది.
ఇదంతా ఎప్పుడు, ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే మూడున్నర దశాబ్దాలు వెనక్కి వెళ్లాల్సిందే. అమెరికాకు చెందిన జాన్ పాల్ డిజోరియా (John Paul DeJoria) పెద్ద బిజినెస్‌మేన్. 1990లో ఓసారి బాలి వెళ్లారు. అక్కడి సంప్రదాయ వాస్తుశైలిని చూసి మనసు పారేసుకున్నారు. అలాంటి ఇల్లు తనకూ ఉండాలని భావించారు. వెంటనే వందల మంది స్థానిక నిపుణులు, పనివాళ్లను రంగంలోకి దించారు.
బోర్నియో అడవుల నుంచి తెచ్చిన పచ్చి కలప, టేకుతో దేవాలయాన్ని పోలిన నిర్మాణ శైలిలో ఇల్లు కట్టించారు. పైకప్పు కోసం ఏకంగా పది లక్షలకు పైగా చెక్క పలకలను అమర్చారు. డ్రాగన్ ముఖాల శిల్పాలు అలంకారానికే కాకుండా వర్షం పడినప్పుడు నీటిని కిందకు మళ్లించే స్పౌట్లుగా తీర్చిదిద్దారు. ఆ ఇంటిని చూసి సంతృప్తి చెందిన డిజారియో.. ఇల్లు మొత్తం జాగ్రత్తగా విప్పేయమన్నారు. దీంతో ఆ ఇంటిని నిర్మించినవారే ఒక్కో చెక్కముక్కా తీసి నంబరింగ్ ఇచ్చారు.
ఇదీ చదవండి: రాత్రికి రాత్రే 2 కిలోమీటర్లు వెనక్కి సముద్రం!
వాటిని గోనెసంచుల్లో మూటలు కట్టి ఓడలో పసిఫిక్ మహాసముద్రం మీదుగా హవాయిలోని బిగ్ ఐలాండ్‌కు తరలించారు. అక్కడ కిహోలో బే వద్ద ఉన్న ప్రైవేటు తీర ప్రాంతంలోని మూడెకరాల స్థలంలో యథాతథంగా పునర్ నిర్మించారు. ఈ మొత్తం ప్రక్రియకు దాదాపు ఆరేళ్లు పట్టింది. ఆ రోజుల్లో దాదాపు రూ.17 కోట్లు ఖర్చయింది. ఇక్కడివరకు అంతా బాగానే ఉన్నా.. తక్కువ తేమ ఉన్న హవాయి వాతావరణం కారణంగా ఇల్లు కొంచెం కుచించుకుపోయింది. అయినా, ఆ వాస్తుశైలి కారణంగా అది అక్కడ ఎంతో ప్రత్యేకంగా నిలిచింది.
తాజాగా ఈ ఇంటిని 3.25 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.270 కోట్లు) అమ్మకానికి పెట్టారు. దీని యజమాని డిజోరియా టెక్సాస్‌లో స్థిరపడటంతో ఈ ఇంటిని వినియోగించడంలేదు. దీంతో అమ్మేయడమే బెటరని ఈ నిర్ణయానికి వచ్చారు. ఎక్కడో పుట్టి వేలాది కిలోమీటర్లు ప్రయాణించి హవాయి చేరిన ఆ ఇల్లు.. ఇప్పుడు కొత్త యజమాని కోసం ఎదురుచూస్తోంది.
– సాక్షి, సెంట్రల్ డెస్క్


