పానియాయ్: ఇండొనేషియాలోని తూర్పు ప్రాంతం పపువాలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ మార్కెట్ పూర్తిగా దగ్ధమై 11 మంది మృతి చెందారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. సెంట్రల్ పపువా ప్రావిన్స్‌లోని పానియాయ్ పట్టణంలో అర్ధరాత్రి దాటిన కొద్దిసేపటికే మంటలు కనిపించాయని స్థానిక పోలీసు ప్రతినిధి హెన్రీ జె. మనురుంగ్ తెలిపారు. కొద్దిసేపటికే మంటలు పలు దుకాణ సముదాయాలకు వ్యాపించాయని చెప్పారు.
“పరిశీలన సమయంలో మంటల్లో కాలిన గాయాలతో 11 మంది మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. మృతుల్లో ఐదుగురు పెద్దలు కాగా, మిగిలిన ఆరుగురు చిన్నారులు ఉన్నారు” అని హెన్రీ ఒక ప్రకటనలో తెలిపారు. మృతి చెందిన చిన్నారుల వయసు 2 నుంచి 9 సంవత్సరాల మధ్య ఉందని ఆయన తెలిపారు. 3 గంటలకు పైగా మంటలు కొనసాగాయి. అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించినప్పటికీ దాదాపు 40 దుకాణాలు, ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
అగ్నిప్రమాదానికి కారణమేంటో అధికారులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. “ఇళ్లు, దుకాణాలు ఒకదానికొకటి అత్యంత దగ్గరగా ఉండటంతో పాటు మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అగ్నిమాపక చర్యలకు చాలా సమయం పట్టింది” అని హెన్రీ తెలిపారు. ఇండొనేషియాలో ప్రాణనష్టానికి దారితీసే అగ్నిప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి.
డిసెంబర్‌లో సెంట్రల్ జకార్తాలోని 7 అంతస్తుల కార్యాలయ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో 22 మంది మృతి చెందారు. భవనం కింది అంతస్తులో డ్రోన్ బ్యాటరీ పేలడమే ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు తెలిపారు. 2023లో దేశ తూర్పు ప్రాంతంలోని నికెల్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో జరిగిన పేలుడులో 12 మంది మృతి చెందారు.


