36000 అడుగుల ఎత్తులో హై టెన్షన్‌.. విమానం ఇంజిన్‌ షట్‌డౌన్‌! | Air India flight turns back Kochi after engine Issue | Sakshi
Sakshi News home page

36000 అడుగుల ఎత్తులో హై టెన్షన్‌.. విమానం ఇంజిన్‌ షట్‌డౌన్‌!

Sep 7 2026 1:40 PM | Updated on Sep 7 2026 2:05 PM

Air India flight turns back Kochi after engine Issue

తిరువనంతపురం: కేరళలోని కొచ్చి విమానాశ్రయం నుంచి అబుదాబి బయలుదేరిన ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి గాల్లోనే ఇంజిన్‌ సమస్య తలెత్తింది. విమానం 36 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా ఓ ఇంజిన్‌లో ఆయిల్‌ పరిమాణం వేగంగా పడిపోవడంతో పాటు.. ఆయిల్‌ ప్రెజర్‌ ప్రమాదకర స్థాయికి చేరింది. పరిస్థితిని గమనించిన పైలట్లు అప్రమత్తమై అబుదాబి ప్రయాణాన్ని రద్దు చేసి విమానాన్ని తిరిగి కొచ్చికి మళ్లించారు. దీంతో ప్రయాణికుల్లో కొద్దిసేపు తీవ్ర ఆందోళన నెలకొంది.

వివరాల మేరకు.. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన బోయింగ్‌ 737 విమానం IX 415 కొచ్చి నుంచి అబుదాబికి బయలుదేరింది. సుమారు 50 నిమిషాల పాటు ప్రయాణించిన తర్వాత.. విమానం 36 వేల అడుగుల ఎత్తులో ఉండగా పైలట్‌, కో-పైలట్‌ ఇంజిన్‌-1లో ఆయిల్‌ పరిమాణం వేగంగా తగ్గుతున్నట్లు గుర్తించారు. అదే సమయంలో ఆయిల్‌ ప్రెజర్‌ కూడా ప్రమాదకర స్థాయికి చేరినట్లు సమాచారం. పరిస్థితిని అంచనా వేసేందుకు సిబ్బంది FORDEC అనే నిర్ణయాత్మక విధానాన్ని అనుసరించారు.

అయితే ఆయిల్‌ పరిమాణం తగ్గడం ఆగకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని భావించారు. దీంతో అబుదాబి వెళ్లడం కంటే విమానాన్ని తిరిగి కొచ్చికి తీసుకురావడమే సురక్షితమని నిర్ణయించారు. ఆయిల్‌ ప్రెజర్‌ ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఇంజిన్‌-1ను ఆపివేయాల్సి వచ్చింది. అనంతరం విమానాన్ని సురక్షితంగా కొచ్చి వైపు మళ్లించారు. చివరకు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్‌ కావడంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.

విమాన సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రమాదాన్ని ముందుగానే గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంజిన్‌లో ఆయిల్‌ పరిమాణం వేగంగా పడిపోవడం వంటి కీలక సంకేతాలను గమనించిన వెంటనే పైలట్లు తీసుకున్న నిర్ణయం విమానాన్ని సురక్షితంగా తిరిగి ల్యాండ్‌ చేయడంలో కీలకంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement