న్యూఢిల్లీ: నష్టాల్లో కొనసాగుతున్న ఎయిరిండియా అదనపు మూలధనం కోసం సహ యజమానుల నుంచి టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ (ఎస్‌ఐఏ) నుంచి 1.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.14,000 కోట్లకుపైగా) నిధులను కోరాలని యోచిస్తోంది. ఈ వార్తలపై స్పందించిన సింగపూర్ ఎయిర్‌లైన్స్... ఎయిరిండియా నుంచి వచ్చే అదనపు మూలధన అభ్యర్థనలను తమ బోర్డు జాగ్రత్తగా పరిశీలిస్తుందని తెలిపింది. అదనపు నిధుల కేటాయింపు నిర్ణయం తీసుకునేటప్పుడు గ్రూప్ ఇతర పెట్టుబడి అవసరాలతో పాటు ఎయిరిండియా వ్యాపార వ్యూహాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. ఎయిరిండియాలో ప్రస్తుతం సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 25.1 శాతం వాటా ఉంది.
సింగపూర్ ఎంపీ అభ్యంతరం
ఎయిరిండియాకు అదనపు నిధులు సమకూర్చే అంశంపై సింగపూర్ పార్లమెంటు సభ్యుడు కెన్నెత్ టియాంగ్ బూన్ కియాట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘ఎయిరిండియా నష్టాలను భరించడానికి సింగపూర్ పౌరులు బాధ్యులు కాదు. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో సింగపూర్ ప్రభుత్వ సార్వ¿ౌమ సంపద నిధి (సావరిన్ వెల్త్ ఫండ్) ‘టెమాసెక్’కు ప్రధాన వాటా ఉంది. కావున, టెమాసెక్ నిధులను ఎయిరిండియా కోసం మళ్లించకూడదు.
సింగపూర్ ఎయిర్‌లైన్స్ స్వతంత్రంగానే దీనిపై నిర్ణయం తీసుకోవాలి’’ అని ఆయన సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. ఈ అంశంపై సింగపూర్ రవాణా శాఖ మంత్రిని ప్రశ్నిస్తూ పార్లమెంటులో ప్రశ్న కూడా దాఖలు చేసినట్లు తెలిపారు. ఆ ప్రశ్న సెపె్టంబర్ 8న జరిగే సింగపూర్ పార్లమెంట్ సమావేశంలో చర్చకు రానుంది. అయితే, అదనపు నిధుల అవసరం, సింగపూర్ ఎంపీ వ్యక్తం చేసిన అభ్యంతరాలపై ఎయిరిండియా నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.
పునరుద్ధరణకు అయిదు నుంచి పదేళ్లు
ఎయిరిండియా పునరుద్ధరణ ప్రక్రియకు అయిదు నుంచి పదేళ్లు సమయంపట్టవచ్చని టాటా సన్స్ చైర్మన్, ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఇటీవల పేర్కొన్నారు. పాత వ్యవస్థలు, సంస్థాగత సంస్కృతి, విమానాల సముదాయాన్ని ఆధునికీకరించడంతో పాటు భారీ సంఖ్యలో నైపుణ్యం కలిగిన విమానయాన నిపుణులను తీర్చిదిద్దాల్సి ఉందని చెప్పారు. ఎయిర్‌స్పేస్ ఆంక్షలు, పశ్చిమాసియా ఉద్రిక్తతలతో పెరిగిన ఇంధన ధరలు, విదేశీ మారకపు విలువల్లో హెచ్చుతగ్గులు వంటి అంశాలు ఎయిరిండియా పునరుద్ధరణ ప్రయాణానికి సవాళ్లుగా మారాయని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.
2025–26 ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ఇండియా నష్టాలు 3.56 బిలియన్ సింగపూర్ డాలర్లకు చేరాయి. ఇది మే 14 నాటి మారకం విలువ ప్రకారం రూ.26,700 కోట్లకుపైగా ఉంది. ఎయిరిండియా నష్టాలు సింగపూర్ ఎయిర్‌లైన్స్ గ్రూప్ ఆర్థిక ఫలితాలపై ప్రభావం చూపాయి. అలాగే, విస్తారా విలీనంతో గత ఏడాది ఒకసారి నమోదైన అకౌంటింగ్ లాభం ఈసారి లేకపోవడం కూడా ప్రతికూలంగా మారింది. దీంతో గ్రూప్ నికర లాభం 57 శాతం తగ్గి 1.184 బిలియన్ సింగపూర్ డాలర్లకు చేరింది.


