సాక్షి, ఢిల్లీ: ఇటీవల పుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్‌ఇండియా విమానం అకస్మాత్తుగా కుదుపులకు గురైన సంగతి తెలిసిందే. దీంతో అందులోని ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ సమయంలో ఫైలట్ ప్రవర్తనా ఏమాత్రం సరిగ్గా లేదని విచారణలో తేలింది. అతనికి నిర్వహించిన రెండు డోప్ టెస్ట్‌లలోనూ అతను విఫలమైనట్లు విశ్వసనీయ వర్గాలు ధృవీకరించాయి. అయితే, తాను ఎటువంటి మత్తు పదార్థాలను తీసుకోలేదని ఆ ఫైలట్ తెలిపారు.
మెుట్టమెుదటగా ఏం జరిగిందంటే
ఢిల్లీ నుంచి ఫుకెట్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం వెళ్లే సమయంలో ఫైలట్ బాత్రూమ్‌కు వెళ్లాల్సి వచ్చింది. అయితే ఆ సమయంలో నిబంధనల ప్రకారం తన సీట్లో కూర్చోవడానికి ఒక కేబిన్ అటెండెంట్‌ను పిలిచారు. అయితే ఆ కేబిన్ అటెండెంట్‌కు పైలట్ సీట్ ఆపరేట్ చేయడం సరిగ్గా రాకపోవడంతో, పైలట్ ఆమెను తీవ్రంగా మందలించారు. దీంతో తనను శాంతింపజేయడానికి, ఫుకెట్‌లో 24 గంటల కంటే తక్కువగా ఉన్న లేఓవర్ సమయంలో పైలట్ సిబ్బంది అందరినీ ఒక పార్టీకి తీసుకెళ్లారు. ఈ సమయంలోనే ఆయన గంజాయి సేవించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తిరుగు ప్రయాణంలో ఆగస్ట్ 4న 137 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందితో ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న AI-2379 విమానం అకస్మాత్తుగా 300 అడుగుల ఎత్తును కోల్పోయింది. ఈ సమయంలో విమానం స్టాల్ వార్నింగ్ మోగింది. ఆ సమయంలో పైలట్ కాక్‌పిట్ నేలపై కూర్చొని ఉన్నట్లు అక్కడి ప్రయాణికులు గుర్తించారు. అయితే అకస్మాత్తుగా ఎత్తు కోల్పోవడం వల్ల కలిగిన కుదుపుల వలన కూడా ఇది జరిగి ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో కనీసం 20 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది గాయపడ్డారు.
విమానం అకస్మాత్తుగా 300 అడుగుల కిందకు జారిపోయి ప్రయాణికులు, సిబ్బంది గాయపడిన తర్వాత.. పైలట్ గాయాలను పరిశీలించేందుకు కేబిన్‌లోకి వెళ్లారు. అయితే ఆ సమయంలో ఆయన ఒక కాలికే మాత్రమే సాక్స్ ధరించి ఉన్నారని. అంతేకాకుండా, ప్రయాణికులు తనను వీడియోలు తీయవద్దని ఆయన హెచ్చరించారని వారు తెలిపారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఫైలట్ సరిగ్గా నిలబడలేకపోయారు.
ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కి చెందిన ఒక ప్రమాద పరిశోధకుడు ఆయనను సీసీటీవీ ద్వారా పర్యవేక్షిస్తున్నామని చెప్పడంతో, ఆయన కూర్చోవడానికి ఇతరుల సహాయం తీసుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా, పైలట్ తన మూత్ర నమూనాను సమర్పించే సమయంలోనూ AAIB అధికారే స్వయంగా ఆయనను శారీరకంగా పట్టుకుని సహాయం చేయాల్సి వచ్చింది.
ఈ ఘటనపై కనీసం ఒక కేబిన్ క్రూ సభ్యురాలు పైలట్ గంజాయి సేవించాడని అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. విమానం ఎక్కుతున్నప్పుడే పైలట్ మత్తులో ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటన పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వందలమంది ప్రాణాలతో ముడిపడి ఉన్న ఈ అంశంలో ఇంత నిర్లక్షంగా వ్యవహరించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


