డీజిల్‌లో ఇథనాల్ ప్రయోగం ఫెయిల్ | Why Ethanol Blended Diesel Failed Safety Tests: Flash Point Risk Explained | Sakshi
Sakshi News home page

డీజిల్‌లో ఇథనాల్ ప్రయోగం ఫెయిల్

Aug 12 2026 2:04 PM | Updated on Aug 12 2026 2:05 PM

Why Ethanol Blended Diesel Failed Safety Tests Flash Point Danger Explained

పెట్రోల్‌ బాటలోనే డీజిల్‌లోనూ ఇథనాల్‌ను కలిపి విదేశీ ముడి చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ వ్యూహానికి సాంకేతిక విఘాతం ఎదురైంది. డీజిల్‌లో ఇథనాల్‌ మిశ్రమం నాణ్యతా ప్రమాణాల పరిధిలోని అత్యంత కీలకమైన ‘ఫ్లాష్‌ పాయింట్‌’ (ఇంధనం మండిపోయే కనిష్ఠ ఉష్ణోగ్రత) పరీక్షలో విఫలమైందని కేంద్ర మంత్రి సురేష్ గోపి పార్లమెంట్‌లో రాతపూర్వకంగా వెల్లడించారు.

ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్ కంపెనీలు (ఓంఎంసీ) తమ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌(ఆర్‌ అండ్‌ డీ) కేంద్రాలు, గుర్తింపు పొందిన ప్రయోగశాలలు, వాహన తయారీదారుల భాగస్వామ్యంతో దీనిపై శాస్త్రీయ మూల్యాంకనం నిర్వహించాయి. సాధారణ డీజిల్‌తో పోలిస్తే ఇథనాల్‌ను కలిపినప్పుడు ఇంధనం ఫ్లాష్‌ పాయింట్ గణనీయంగా తగ్గిపోతోందని ఈ అధ్యయనంలో తేలింది. స్వచ్ఛమైన డీజిల్‌కు నిర్దేశించిన సురక్షిత ఫ్లాష్‌ పాయింట్‌ ప్రమాణాలను ఇథనాల్‌ మిశ్రమం అందుకోలేకపోతోంది. సాంకేతికంగా ఫ్లాష్‌ పాయింట్‌ తక్కువగా ఉంటే ఇంధనం రవాణా, నిల్వ ప్రక్రియల్లో తీవ్ర ప్రమాదాలు జరగడంతో పాటు ఇంజిన్‌ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ సాంకేతిక లోపాలను పూర్తిగా నివారించే వరకు డీజిల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని విస్తృత వినియోగంలోకి తీసుకురావడం సాధ్యపడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా డీజిల్‌లో ఐసోబుటనాల్ కలపడంపై ప్రశ్నించగా.. ప్రస్తుతం ఎలాంటి ఐసోబుటనాల్ మిశ్రమాన్ని వినియోగించడం లేదని మంత్రి తెలిపారు. అలాగే పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని ప్రస్తుతమున్న 20 శాతం (E20) కంటే పెంచే ఆలోచన కూడా లేదని తేల్చిచెప్పారు.

అయితే, దేశంలో చమురు కంపెనీల వద్ద పెరుగుతున్న ఇథనాల్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకునేందుకు, ఎల్‌పీజీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఇథనాల్‌ను ‘క్లీన్ కుకింగ్ ఫ్యూయల్’(స్వచ్ఛమైన వంట ఇంధనం)గా ఉపయోగించడంపై కేంద్రం అధ్యయనం చేస్తోంది. ఇండియన్ ఆయిల్, హిందూస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం భాగస్వామ్యంలోని ఎల్‌పీజీ ఇక్విప్‌మెంట్ రీసెర్చ్ సెంటర్ దీనికి సంబంధించిన ఆవిష్కరణలపై పనిచేస్తోంది.

ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న బంగారం.. ధరకు రెక్కలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement