ఇథనాల్‌ తయారీకి చెరకు వాడకంపై కేంద్రం కోత? | India to Restrict Sugarcane Use for Ethanol Amid Rising Sugar Prices | Sakshi
Sakshi News home page

ఇథనాల్‌ తయారీకి చెరకు వాడకంపై కేంద్రం కోత?

Aug 10 2026 6:39 PM | Updated on Aug 10 2026 6:50 PM

India to Restrict Sugarcane Use for Ethanol Amid Rising Sugar Prices

దేశీయంగా రికార్డు స్థాయికి చేరిన చక్కెర ధరలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాబోయే అక్టోబరు నుంచి ప్రారంభమయ్యే నూతన మార్కెటింగ్ సీజన్‌లో ఇథనాల్ తయారీ కోసం చెరకు వినియోగాన్ని పరిమితం చేయాలని యోచిస్తోంది. దేశీయ వినియోగానికి ప్రథమ ప్రాధాన్యమిస్తూ మార్కెట్‌లో చక్కెర లభ్యతను పెంచడం, తద్వారా భగ్గుమంటున్న నిత్యావసర ధరలను అదుపు చేయడమే ఈ ప్రతిపాదన వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.

దేశంలో చక్కెర ఉత్పత్తికి కీలకంగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఈసారి వర్షపాతం కొరవడటంతో రాబోయే పంట దిగుబడిపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సరఫరా తగ్గిపోవడం, సమీపిస్తున్న పండుగల సీజన్ దృష్ట్యా వినియోగం పెరగడంతో గత నెల రోజుల్లోనే చక్కెర ధరలు ఏకంగా 10 శాతం మేర పెరిగి గరిష్ఠ స్థాయికి చేరాయి. పరిస్థితులు చేయిదాటిపోకుండా ఉండటానికి, విదేశాల నుంచి అత్యవసర దిగుమతులు చేసుకునే పరిస్థితి రాకుండా నివారించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది.

గడిచిన ఏడాది కాలంలో చక్కెర మిల్లులు సుమారు 30 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెరను (మొత్తం ఉత్పత్తిలో దాదాపు 10 శాతం) ఇథనాల్ తయారీకి మళ్లించాయి. అయితే నూతన నిబంధనల ప్రకారం, నేరుగా ‘చెరకు రసం’ అలాగే అధిక చక్కెర తీవ్రత ఉండే ‘బీ-హెవీ’ మోలాసెస్ నుంచి ఇథనాల్ ఉత్పత్తిని నిలిపివేయాలని మిల్లులను ఆదేశించే అవకాశం ఉంది. దీనికి బదులుగా చక్కెర సేకరించగా మిగిలిన వ్యర్థ పదార్థమైన ‘సీ-హెవీ’ మోలాసెస్ నుంచి మాత్రమే ఇథనాల్ ఉత్పత్తికి అనుమతించనున్నారు.

అయితే, పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలనే ఈ-20 జాతీయ లక్ష్యానికి విఘాతం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. చెరకు ద్వారా తగ్గే ఇథనాల్ కోటాను భర్తీ చేయడానికి దేశంలో ప్రస్తుతం పుష్కలంగా లభ్యమవుతున్న మొక్కజొన్న, బియ్యం నిల్వలను ఇథనాల్ తయారీకి విస్తృతంగా వినియోగించుకోవాలని భావిస్తోంది. ఈ సమతుల్య విధానం అమలులోకి వస్తే దేశీయంగా చక్కెర సరఫరా స్థిరపడి సామాన్య వినియోగదారులకు ధరల భారం నుంచి ఉపశమనం లభిస్తుందని ఆర్థిక రంగానికి చెందిన నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇదీ చదవండి: కేంద్రానికి పసిడి పంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement