దేశీయ మద్యం పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తూ ప్రముఖ లిక్కర్ తయారీ సంస్థ ‘డయాజియో ఇండియా’ (యూనైటెడ్ స్పిరిట్స్)తో పాటు పలు ప్రముఖ కంపెనీలపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘన, పక్కదోవ పట్టించే లేబులింగ్, నిబంధనలకు విరుద్ధంగా కృత్రిమ ఫ్లేవర్లు ఉపయోగిస్తున్నారనే ఆధారాలతో కఠిన చర్యలు చేపట్టింది.
లేబులింగ్ మోసం
డయాజియోకు చెందిన అత్యధిక విక్రయాలు కలిగిన రాయల్ ఛాలెంజ్ విస్కీని ‘అమెరికన్ ఓక్ కాస్క్’లలో మెచ్యూరేషన్ చేసినట్లు కంపెనీ లేబుల్‌పై ప్రచారం చేసుకుంటోంది. అయితే, అందులో సింహభాగం నాన్-మెచ్యూర్డ్ గ్రెయిన్ న్యూట్రల్ స్పిరిట్, నీరు మాత్రమే ఉన్నాయని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ విచారణలో వెల్లడైంది. ఇది వినియోగదారులను పక్కదోవ పట్టించడమేనని రెగ్యులేటర్ తేల్చిచెప్పింది. బ్లెండెడ్ ఆల్కహాల్‌పై ఏజింగ్ (తయారైన తేదీ-వయసు) పేర్కొనేటప్పుడు మిశ్రమంలోని అత్యల్ప వయసుగల స్పిరిట్‌నే ప్రామాణికంగా తీసుకోవాలనే నిబంధనను కూడా కంపెనీ పాటించలేదని స్పష్టం చేసింది.
కృత్రిమ ఫ్లేవర్లు.. ప్యాకేజింగ్ లోపాలు
సహజసిద్ధమైన మాల్ట్ లేదా మోలాసెస్ ప్రక్రియ ద్వారా కాకుండా.. విస్కీలో విస్కీ ఫ్లేవర్, రమ్‌లో రమ్ ఫ్లేవర్ వంటి కృత్రిమ (ఆర్టిఫిషియల్) సువాసనలను నేరుగా కలపడం నియమావళికి విరుద్ధమని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పేర్కొంది. దీంతో రాయల్ ఛాలెంజ్, యాంటిక్విటీ బ్లూ, బాగ్‌పైపర్, ఓల్డ్ మాంక్ వంటి బ్రాండ్ల నిర్దిష్ట బ్యాచ్‌ల విక్రయాలపై ఆంక్షలు విధించింది. మరోవైపు సురక్షిత గుర్తింపులు లేని రీసైకిల్డ్ ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగించినట్లు గుర్తించి సుమారు 18,000 బాక్సుల పరిమాణంలో ఉన్న సీసాలను బెంగళూరు కేంద్రంలో అధికారులు క్వారంటైన్/సీజ్ చేశారు.
ఇదీ చదవండి: కేంద్రానికి పసిడి పంట


