బంగారం, వెండి, ప్లాటినం దిగుమతి సుంకాలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేంద్ర ఖజానాకు కాసుల వర్షం కురిపించింది. ఈ ఏడాది మే 13 నుంచి ఆగస్టు 2 వరకు స్వల్ప వ్యవధిలోనే విలువైన లోహాల దిగుమతుల ద్వారా కస్టమ్స్ సుంకాల రూపంలో ఏకంగా రూ.10,463 కోట్ల రాబడి సమకూరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ఆదాయంలో పసిడిదే అగ్రస్థానం
మొత్తం కస్టమ్స్ వసూళ్లలో సింహభాగం బంగారం నుంచే లభించింది. బంగారం దిగుమతులపై రూ.10,040 కోట్లు, వెండి దిగుమతులపై రూ.328 కోట్లు, ప్లాటినం దిగుమతులపై రూ.95 కోట్లు సమకూరింది.
సుంకాల పెంపునకు కారణాలు
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ సంక్షోభం, హార్మూజ్ జలసంధి ఆటంకాల కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు, ఎరువుల ధరలు పెరిగాయి. దేశీయ విదేశీ మారక నిల్వలను (ఫారెక్స్) పరిరక్షించుకోవడానికి, అనవసర దిగుమతులకు అడ్డుకట్ట వేయడానికి కేంద్రం మే 13న పసిడి, వెండి దిగుమతి సుంకాన్ని 6 శాతాల నుంచి 15 శాతానికి, ప్లాటినం సుంకాన్ని 6.4 శాతం నుంచి 15.4 శాతానికి పెంచిన విషయం విదితమే. చమురు, నిత్యావసర పారిశ్రామిక ముడిసరుకుల దిగుమతులకు ఫారెక్స్ నిల్వలను ప్రాధాన్యత క్రమంలో కేటాయించడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం.
స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం
పన్ను రేట్లు పెరగడంతో అక్రమ రవాణా పెరిగే అవకాశం ఉండటంతో తనిఖీ ఏజెన్సీలు నిఘాను తీవ్రతరం చేశాయి. మే 13 నుంచి జూన్ 30 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా వివిధ సరిహద్దుల్లో దాడి చేసి 161 కిలోల అక్రమ బంగారాన్ని జప్తు చేయడమే కాకుండా 116 మంది స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రపంచంలో చైనా తర్వాత రెండో అతిపెద్ద పసిడి వినియోగదారైన భారత్‌లో దిగుమతి సుంకాల పెంపు వల్ల పసిడి విక్రయాలు కొంత మందగించినప్పటికీ ప్రభుత్వానికి మాత్రం త్వరితగతిన భారీగా రెవెన్యూ సమకూరిందని ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఇదీ చదవండి: పబ్లిక్ వైఫై వాడే ప్రయాణికులే టార్గెట్!


