చాలు బంగారం.. చాలు | Gold imports drop sharply | Sakshi
Sakshi News home page

చాలు బంగారం.. చాలు

Aug 9 2026 4:57 AM | Updated on Aug 9 2026 4:57 AM

Gold imports drop sharply

భారీగా పడిపోయిన బంగారం దిగుమతులు 

2021–22లో 868.4 టన్నులు దిగుమతి.. 2025–26లో 718 టన్నులే.. 

దిగుమతుల బిల్లుల్లో మాత్రం 58 శాతం పెరుగుదల 

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 120 టన్నులే.. ఆరేళ్ల కనిష్టానికి దిగుమతులు 

సాక్షి, అమరావతి: పసిడి ప్రియులకు పేరొందిన భారత దేశంలో బంగారం కొనుగోళ్లు, దిగుమతులు తగ్గిపోతున్నాయి. 2021–22 సంవత్సరంతో పోలిస్తే 2025–26 ఆర్థిక సంవత్సరంలో దిగుమతులు 17.23 శాతం క్షీణించాయి. 2021–22లో 868.4 టన్నుల బంగారం దిగుమతి కాగా.. 2025–26లో 718.74 టన్నులకు పడిపోయిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలిపింది. అంతర్జాతీయంగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు తోడు రూపాయి విలువ పడిపోవడం, బంగారం కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు విధించడం దిగుమతులు తగ్గడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. 

బంగారం దిగుమతులను తగ్గించడానికి కేంద్రం ఈ ఏడాది మే నుంచి దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. మరోపక్క బంగారం కొనుగోళ్లు తగ్గించాలని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీనే పిలుపునివ్వడంతో అమ్మకాలపై గణనీయమైన ప్రభావం కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు బంగారం దిగుమతులు ఆరేళ్ల కనిష్ట స్థాయికి 120 టన్నులకు పరిమితమైనట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రధాని పిలుపుతో ఆభరణాల అమ్మకాలు 24 శాతం తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. అలాగే పాత బంగారం అమ్మడం కూడా దిగుమతులు తగ్గడానికి ప్రధా­న కారణంగా పేర్కొంటున్నారు. ఇదే సమయంలో బంగారం ధరలు భారీగా పెరగడంతో స్మగ్లింగ్‌ పెరుగుతోంది. 

విలువ పరంగా 58 శాతం పెరుగుదల
పరిమాణం పరంగా బంగారం దిగుమతులు తగ్గుతున్నా.. పసిడి దిగుమతుల బిల్లు మాత్రం భారీగా పెరిగిపోతోంది. 2021–22లో 868.4 టన్నుల దిగుమతికి ప్రస్తుత రూపాయి ధర ప్రకారం రూ.4,36,800 కోట్లు చెల్లించాల్సి వస్తే, 2025–26లో 718.74 టన్నులకు ఏకంగా రూ.6,88,320 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. అంటే దిగుమతులు తగ్గినా బిల్లు మాత్రం ఏకంగా 57.58 శాతం పెరిగిపోయింది. 

దీనికి ప్రధాన కారణం ఐదేళ్ల క్రితం ఔన్స్‌ బంగారం ధర 2,000 డాలర్లు ఉంటే ఇప్పుడది ఏకంగా 4,200 డాలర్లకు చేరడమే. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ.1.40 లక్షల నుంచి రూ.1.50 లక్షల మధ్య కదులుతోంది. బంగారం ధరలు భారీగా పెరిగిపోవడంతో వినియోగదారులు తక్కువ బరువున్న ఆభరణాల కొనుగోలుకు మక్కువ చూపిస్తున్నట్లు వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement