సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తులకు కేటాయించే గదులను నకిలీ ఆధార్ కార్డులు, మార్ఫింగ్ చేసిన ఫొటోలతో అక్రమంగా పొందుతూ.. అధిక ధరలకు విక్రయిస్తున్న రూమ్ దళారీల ముఠాను తిరుమల టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుమలలో రూమ్ దళారీల అక్రమ కార్యకలాపాలపై పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది ప్రత్యేక నిఘా ఉంచారు.
ఈ క్రమంలో ఇవాళ(శనివారం) ఉదయం తిరుమల సీఆర్వో కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా గదులు పొందేందుకు ప్రయత్నిస్తున్న ఆరుగురు వ్యక్తులను సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు ఒక ముఠాగా ఏర్పడి నకిలీ ఆధార్ కార్డులను తయారు చేసి, వాటిలో ఫొటోలను మార్ఫింగ్ చేసి, వాటి ద్వారా టీటీడీ సీఆర్వోలో గదులు పొందుతున్నట్లు వెల్లడైంది.
అనంతరం ఆ గదులను గదులు లభించని భక్తులకు అధిక మొత్తానికి విక్రయిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అదే విధంగా, తిరుమలలోని పీఏసీ-5 వద్ద భక్తులు ఛార్జింగ్‌కు ఉంచిన సెల్‌ఫోన్లను దొంగతనం చేసినట్లు కూడా విచారణలో వెల్లడైంది. నిందితులు బి. శ్రీనివాస్ (46), ఇరప్ప కాలప్ప (43), విష్ణు వర్ధన్ (33), అమూల్ కుమార్ సింగ్ (27), ఎస్. ప్రకాష్ (39), పి. సందీప్ (20)లను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుల దగ్గర నుంచి గది బుకింగ్‌లు, నకిలీ గుర్తింపు పత్రాలకు సంబంధించిన కార్యకలాపాలకు ఉపయోగించిన సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల విచారణలో భాగంగా ఈ నెల 6న తెల్లవారుజామున తిరుమల పీఏసీ-5 దగ్గర దొంగతనం చేసిన రెండు సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తిరుమలలో గదులను టీటీడీ అధికారిక కౌంటర్లు, అధికారిక ఆన్‌లైన్ విధానాల ద్వారా మాత్రమే పొందాలని పోలీసులు సూచించారు. రూమ్ దళారీలను నమ్మి టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి మోసపోవద్దని తెలిపారు. నకిలీ ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు పత్రాల ద్వారా గదులు ఇప్పిస్తామని చెప్పే వ్యక్తులను నమ్మవద్దని సూచించారు. రూమ్ దళారీల కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తులు.. భక్తులను మోసం చేసే ప్రయత్నాలు గుర్తించిన వెంటనే పోలీసు అత్యవసర సేవ 112, సంబంధిత టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.


