ట్రెండింగ్‌లో వారణాసి.. మోదీ కంచుకోటలో ఇదేం సీన్‌? | Varanasi Flood Viral Video: Auto & Bike Overturn in Waterlogged Streets | Sakshi
Sakshi News home page

ట్రెండింగ్‌లో వారణాసి.. మోదీ కంచుకోటలో ఇదేం సీన్‌?

Aug 8 2026 11:19 AM | Updated on Aug 8 2026 11:53 AM

Varanasi Flood Auto And Bike Overturn Viral Video Sparks Debate

వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నగరం భారీ వర్షాలకు అతలాకుతలమైంది. రోడ్లు చెరువులను తలపించేలా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా రోడ్డు మధ్యలో వరద నీటిలో ఓ ఆటో బోల్తా పడటం, ఆ వెంటనే ఓ బైకర్‌ కూడా అదుపుతప్పి నీటిలో పడిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో, అధికారులపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు దాదాపు 22 ప్రాంతాల్లో నీటిముంపు ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రధాన రహదారులపై పెద్దఎత్తున నీరు నిలిచిపోయింది. నీటిమట్టం పెరగడంతో రోడ్డు ఎక్కడుందో, గుంతలు ఎక్కడున్నాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. వర్షం తగ్గిన తర్వాత కూడా పలు ప్రాంతాల్లో నీరు బయటకు వెళ్లకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో నీటితో నిండిన రోడ్డుపై ఓ ఆటో ముందుకు వెళ్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఆటో ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే మరో బైకర్‌ కూడా బ్యాలెన్స్‌ కోల్పోయి నీటిలో పడిపోయాడు. ఈ ఘటనల్లో డ్రైవర్‌, ప్రయాణికులకు గాయలైనట్టు తెలుస్తోంది.

అయితే, వరద నీటిలో వాహనాలు బోల్తా పడుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో అసలు చర్చ మరో అంశంపై మొదలైంది. ‘స్మార్ట్‌ సిటీ’గా అభివృద్ధి చేస్తున్న వారణాసిలో ప్రతిసారీ వర్షానికి రోడ్లు ఎందుకు జలమయం అవుతున్నాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో వారణాసిలో మౌలిక వసతుల అభివృద్ధిపై దేశవ్యాప్తంగా ప్రత్యేక దృష్టి ఉంటుంది. అలాంటి నగరంలో భారీ వర్షం పడిన ప్రతిసారీ రోడ్లపై నీరు నిలిచిపోవడం, వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్న దృశ్యాలు ఇప్పుడు రాజకీయంగానూ, ప్రజా చర్చగానూ మారుతున్నాయి.

భారీ వర్షాలు పడటం సహజమే అయినప్పటికీ.. వర్షం తగ్గిన తర్వాత కూడా నీరు గంటల తరబడి రోడ్లపై నిలిచిపోతే మాత్రం డ్రైనేజీ, పట్టణ ప్రణాళికపై ప్రశ్నలు తలెత్తాయి. తాజాగా వైరల్‌ అయిన ఆటో బోల్తా, బైకర్‌ ప్రమాద దృశ్యాలు వారణాసిలోని నీటిముంపు సమస్య తీవ్రతను మరోసారి బయటపెట్టాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement