మీకు అండగా నేనుంటా.. | PM Narendra Modi Breakfast Meet With NDA MPs | Sakshi
Sakshi News home page

మీకు అండగా నేనుంటా..

Aug 8 2026 6:04 AM | Updated on Aug 8 2026 6:04 AM

PM Narendra Modi Breakfast Meet With NDA MPs

దేశ అభివృద్ధి కోసం మనమంతా కలిసికట్టుగా పని చేయాలి  

ఎన్డీయే భాగస్వామ్య పక్షాల ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు  

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ కార్యకలాపాలకు పదేపదే అంతరాయం కలుగుతుండడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. సభలో నెలకొన్న గందరగోళం కారణంగా, ఇటీవల ఎన్నికైన ప్రతిభావంతులైన ఎంపీల మాటలను వినే అవకాశం దేశానికి దక్కలేదని పేర్కొన్నారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన నేషనలిస్ట్‌ సిటిజన్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌సీపీఐ), శివసేన, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(అథవాలే), రాష్ట్రీయ లోక్‌ మోర్చా, ఏఐఏడీఎంకే, యూపీపీఎల్‌ పార్టీలకు చెందిన 40 మందికి పైగా ఎంపీలతో శుక్రవారం జరిగిన అల్పాహార విందు సమావేశంలో మోదీ మాట్లాడారు.

 మంగళవారం జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశమైన గైర్హాజరైన ముగ్గురు తృణమూల్‌ కాంగ్రెస్‌ రెబెల్‌ ఎంపీలు ఖలీలుర్‌ రెహ్మాన్, యూసుఫ్‌ పఠాన్, అబూ తాహెర్‌ ఖాన్‌ ఈ విందు సమావేశంలో పాల్గొనడం విశేషం. కేంద్ర మంత్రి జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా లేదా కనీసం ఏడాది కాలంగా ఎన్డీయేతో కలిసి ఉన్నవారందరూ తన కుటుంబ సభ్యులేనని అన్నారు. దేశ అభివృద్ధి కోసం మనమంతా కలిసికట్టుగా పని చేయాలని చెప్పారు. అందరూ పార్లమెంట్‌ సమావేశాల్లో చురుగ్గా పాల్గొనాలని, ప్రజా సమస్యలపై చర్చించాలని కోరారు. ఎన్డీయే ఎంపీలందరికీ తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా యోగా చేయాలని సూచించారు. ప్రతి వారం ఆరోగ్య పరీక్ష చేయించుకోవాలని తెలిపారు.   

ఎన్డీయే అంటే ఒక కుటుంబం  
తూర్పు, ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి గురించి ప్రధానమంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. అలాగే దేశ నిర్మాణంలో ఎంపీలు ఏ విధంగా సమర్థవంతంగా కృషి చేయవచ్చనే అంశంపై చర్చించారు. నియోజకవర్గాల అభివృద్ధికి అవసరమైన అంశాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎంపీలకు తాను వెన్నుదన్నుగా నిలుస్తానని పేర్కొన్నారు. ఎన్డీయే అంటే ఒక కుటుంబమని పునరుద్ఘాటించారు. తమ భాగస్వామ్య పక్షాలకు అన్నివిధాలుగా అండగా నిలుస్తామని వివరించారు. కేవలం ఎన్డీయే సభ్యులకే కాకుండా ప్రతి ఎంపీకీ మద్దుతుగా నిలిచానని గుర్తుచేశారు. అల్పాహార విందుకు హాజరైనప్పటికీ తాను తాము ఎన్డీయేలో భాగస్వాములం కాదని నేషనలిస్ట్‌ సిటిజన్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నేత అబూ తాహెర్‌ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement