లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు కాంగ్రెస్ విప్ జారీ
న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో చాలా కీలకమైన అంశాలు చర్చకు రానున్నందున ఈ నెల 10, 11, 12వ తేదీల్లో తప్పనిసరిగా హాజరు కావాలంటూ శుక్రవారం కాంగ్రెస్ తన పార్టీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు విప్ జారీ చేసింది. ఈ మూడు రోజుల్లో తమ ఎంపీలు కూడా తప్పనిసరిగా సభల్లో ఉండేలా చూడాలని ప్రతిపక్ష ఇండియా కూటమి పక్షాలను కూడా కాంగ్రెస్ కోరింది.
వచ్చే వారంలో వివాదాస్పద విదేశీ విరాళాల నియంత్రణ సవరణ(ఎఫ్‌సీఆర్‌ఏ) బిల్లు–2026, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రవేశపెట్టే చాన్సుందన్న వార్తల నేపథ్యంలో లోక్‌సభలో కాంగ్రెస్ చీఫ్ విప్ కె.సురేశ్, రాజ్యసభలో ఆ పార్టీ చీఫ్ విప్ జైరాం రమేశ్ ఈ మేరకు వేర్వేరుగా క్షుప్తంగా విప్‌లను జారీ చేశారు. అయితే, ఎఫ్‌సీఆర్‌ఏ, నియోజకవర్గాల బిల్లును ప్రవేశపెట్టే యోచన లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లు నెగ్గాలంటే సాధారణ మెజారిటీ ఉంటే సరిపోతుంది. రాజ్యాంగ సవరణ బిల్లుకు మాత్రం మూడింట రెండొంతుల మెజారిటీ
అవసరమవుతుంది.


