తెలంగాణ వస్త్ర రంగానికి రూ.69,860 కోట్లకు పైగా మద్దతు ధర
వరంగల్‌లో పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా స్పందించిన బీజేపీ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ ఆర్థిక వ్యవస్థతో పాటు సాంస్కృతిక వారసత్వానికి చేనేత రంగం ప్రతీక అని, నేతన్నల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ అగ్రనేతలు పేర్కొన్నారు. శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ వేర్వేరు ప్రకటనల్లో శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో చేనేత రంగానికి ప్రోత్సాహం: కిషన్‌రెడ్డి
వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ‘5ఎఫ్ విజన్’(ఫామ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాబ్రిక్, ఫ్యాబ్రిక్ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్) ద్వారా ఎగుమతులను రూ.9 లక్షల కోట్లకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ముఖ్యంగా తెలంగాణలోని పత్తి రైతుల నుంచి మద్దతు ధర (ఎంఎస్‌పీ) కింద కేంద్రం రూ.69,860 కోట్లకు పైగా వెచ్చించిందని వివరించారు. రాష్ట్రంలో చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు వరంగల్ జిల్లాలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పీఎల్‌ఐ, ముద్రా పథకాలతో పాటు ఆర్టీఫిషీయల్ ఇంటెలిజెన్స్ లాంటి సాంకేతికతను చేనేతకు అనుసంధానిస్తున్నట్లు తెలిపారు.
భారతీయ ఆత్మకు ప్రతిరూపం చేనేత: బండి సంజయ్
చేనేత రంగం కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదని, భారతీయ ఆత్మకు ప్రతిరూపమని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘వోకల్ ఫర్ లోకల్’, ‘మేక్ ఇన్ ఇండియా’పిలుపుతో చేనేతను ప్రపంచ స్థాయికి మోదీ ప్రభుత్వం తీసుకెళ్తోందన్నారు. అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన ఉమ్మడి కరీంనగర్, సిరిసిల్ల నేతన్నల నైపుణ్యం దేశానికే గర్వకారణమని కొనియాడారు. సబ్సిడీ నూలు, నైపుణ్య శిక్షణ, హ్యాండ్లూమ్ హ్యాకథాన్ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా చేనేత కార్మికుల వార్షికాదాయాన్ని రూ.5లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోందని తెలిపారు.
దేశ ప్రగతికి సంకేతం: డాక్టర్ లక్ష్మణ్
ఖాదీ కేవలం ఒక వస్త్రం మాత్రమే కాదని, అది దేశ స్వదేశీ స్ఫూర్తికి, ఆత్మనిర్భరతకు సంకేతమని ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ కొనియాడారు. ప్రతి ఒక్కరూ చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ నేతన్నల జీవనోపాధికి చేయూతనందించాలని పిలుపునిచ్చారు.


