వరద అనేది కేవలం ప్రకృతి విపత్తు మాత్రమే కాదు, అది నగర ప్రణాళికలోని లోపాలు, ప్రవాహ మార్గాల ఆక్రమణ, దీర్ఘకాల శాస్త్రీయ ఆలోచన లోపం వంటివాటిని బహిర్గతం చేస్తుంది. హైదరా బాద్ నగరానికి 1908 సెప్టెంబర్‌లో సంభవించిన మహావరద నగర చరిత్రను మలుపు తిప్పింది.
2020 అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు మూసీ ఉప్పొంగిన తీరు, మళ్లీ అదే హెచ్చరికను గుర్తుచేసింది. ఇప్పటి వరకు వరదలపై చర్చ ఎక్కువగా నేటి వర్షపాతం గణాంకాలకే పరిమితమైంది. కానీ, నది ప్రవర్తనను వర్తమాన డేటాతో అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. నదులు నెమ్మదిగా మారుతాయి. భూభాగ వినియోగం, అడవుల తగ్గుదల, నగరీకరణ, మురుగు ప్రవాహాలు, మట్టి నిక్షేపాలు– ఇవన్నీ నదీ వ్యవస్థను కాల క్రమంలో మార్చేస్తాయి. ఆ మార్పుల ఆనవాళ్లు నదీ అవక్షేపాల్లో నిలిచి ఉంటాయి. అందుకే మూసీ ఒడ్డున పేరుకుపోయిన మట్టి పొరలు (స్తరాలు) ఒక సహజ చరిత్ర పత్రంలా పనిచేస్తాయి.
శాస్త్రీయ విశ్లేషణ ఎలా అంటే...
నదీ అవక్షేపాలు అంటే కేవలం బురద కాదు. ప్రతి పొర ఒక కాలానికి చెందిన సమాచారం. వరద తీవ్రత, పరిసర వృక్షావరణం, మానవ జోక్యం, కాలుష్య ముద్ర– ఇవన్నీ వాటిలో దాగి ఉంటాయి. ఈ పొరలను అవక్షేప కోర్ నమూనాల రూపంలో సేకరించి విశ్లేషిస్తే, గత వరదల స్వభావాన్ని పునర్నిర్మించవచ్చు.
అదే సమయంలో పుప్పొడి శాస్త్రం మరో కీలక దృక్కోణాన్ని అందిస్తుంది. మట్టిలో దాగి ఉన్న చెట్లు, గడ్డి, పంటల పుప్పొడి ద్వారా అప్పటి వృక్షావరణం, వ్యవసాయ విస్తరణ, భూభాగ విని యోగ మార్పులు తెలిసిపోతాయి. ఒక పొరలో సహజ వృక్ష పుప్పొడి అధికంగా ఉంటే ఆ ప్రాంతం అప్పట్లో మరింత సహజ స్థితిలో ఉన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. పంటల పుప్పొడి పెరిగితే వ్యవ సాయం విస్తరించిన సూచన. పుప్పొడి తగ్గి, ధూళి లేదా నిర్మాణ సంబంధిత కణాలు పెరిగితే పట్టణీకరణ వేగాన్ని సూచించవచ్చు. అవక్షేప శాస్త్రం (సెడిమెంటాలజీ), పుప్పొడి శాస్త్రం (పాలినోలజీ) కలిసి మూసీ చరిత్రను డేటా ఆధారంగా చెప్పగలవు.
మూసీపై ఇలాంటి అధ్యయనం ఎందుకు అవసరం అంటే కారణం సుస్పష్టం. ప్రస్తుత వరద నియంత్రణ చర్యలు ఎక్కువగా ఇటీవలి పరికరాలతో నమోదు చేసిన గణాంకాల మీద ఆధార పడుతున్నాయి. కానీ నదులు దీర్ఘకాల చక్రాల్లో పనిచేస్తాయి. కొన్నేళ్ల గణాంకాలు మాత్రమే చూసి వరద మైదానాన్ని నిర్ణయించడం ప్రమాదకరం. నీరు సహజంగా వెళ్లే మార్గాలు, నిలిచే ప్రాంతాలు, వరద మైదానాలు గుర్తించడంలో తప్పులు జరిగితే, తప్పుడు చోట్ల నిర్మాణాలు పెరుగుతాయి. అప్పుడు ప్రతి భారీ వర్షం విపత్తుగా మారే అవకాశం ఉంటుంది.
ఇటీవల ఒక నివేదిక ప్రకారం మూసీ అవక్షేపాల్లో కాలుష్యం ప్రధానంగా సేంద్రియ స్వభావం కలిగి ఉంది. అంటే సమస్య కేవలం వర్షం కాదు, నీరు వెళ్లాల్సిన సహజ మార్గాలు దెబ్బతినడం. అందుకే మూసీ కారిడార్‌లో అవక్షేప కోర్ నమూనాలను అధ్య యనం చేయడం కీలకం. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, చార్మి నార్ పరిసరాలు, ప్రతాపసింగారం వంటి ప్రాంతాల నుంచి నమూ నాలు తీసుకుని కర్బన–14 పద్ధతిని అనుసరించి కాల నిర్ణయం చేసి, కొన్ని వందల సంవత్సరాల వరకూ చరిత్రను పునర్నిర్మించవచ్చు. ఏ దశలో కరువు, ఏ దశలో తీవ్రమైన వరద, ఏ దశలో నగర ఒత్తిడి పెరిగిందో స్పష్టంగా తెలుసుకోవచ్చు.
ఈ పరిశోధన ఫలితాలు హైదరాబాద్‌కు దిక్సూచిగా మారు తాయి. శాస్త్రీయ వరద మ్యాపులు తయారవుతాయి. గతంలో వరద నీరు ఏయే మార్గాల్లో ప్రవహించిందో తెలిసినప్పుడు ఆ ప్రాంతాల్లో కొత్త నిర్మాణాలకు పరిమితులు విధించడం సులభమవుతుంది. భవిష్యత్ బృహత్తర ప్రణాళికలో ‘నాన్ కన్‌స్ట్రక్షన్ ఫ్లడ్ జోన్’ వంటి నిర్ణయాలు ఊహలపై కాకుండా డేటాపై ఆధారపడి తీసుకోవచ్చు. అలాగే వరద హెచ్చరిక వ్యవస్థలు కూడా మరింత సమర్థవంతంగా పనిచేయడానికి దోహదపడతాయి. మట్టి పొరల్లో దాగిన చరిత్రను వినగలిగితేనే హైదరాబాద్ వరద భద్రతకు శాస్త్రీయ మార్గం సుగమ మవుతుంది.
– డా. రామకృష్ణ మనిమద్దె, ఎర్త్ సైంటిస్ట్, నదీ వ్యవస్థల పరిశోధకుడు


