హైదరాబాద్ : మూసీ నది ప్రాశస్త్యము- ఆషాడ బోనాల ఉత్సవాల వైభవ ప్రభావాలను సమన్వయం చేస్తూ 'మూసి తరంగాలు- సింహవాహిని శతకం' పద్య సంకలనాన్ని తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుంద రెడ్డి, మూసీ పునర్జీవన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి ఆవిష్కరించారు. శుక్రవారం మాసబ్ ట్యాంక్ మూసి పునర్జీవన సంస్థ కార్యాలయంలో జీహెచ్ఎంసి జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్ట్, కవి వరకాల యాదగిరి పాల్గొన్నారు.
బోనాల సంబరాల వైభవాన్ని పుస్తకంలో అద్భుతంగా విశ్లేషించారని ఈ సందర్భంగా మూసి పునర్జీవన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్ నరసింహారెడ్డి అన్నారు. హైదరాబాదు నగరంలోని పలు మహంకాళి ఆలయాల్లో జరిగే బోనాల పండగ వేడుకలతో పాటు ఒకప్పుడు హైదరాబాదు నగర ప్రజల జీవనాడి ముచుకుందా నది ప్రవాహ వర్ణనలను సూత్రికరించటం విశేషమన్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా చేపట్టిన మూసీ నది సమూల ప్రక్షాళన ప్రాధాన్యతను పద్యాల రూపంలో ఆకట్టుకునే రీతిలో వరకాల యాదగిరి సాహితీ వర్ణన పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటుందన్నారు.
సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుంద రెడ్డి మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్ట్ వరకాల యాదగిరి కలం నుంచి వార్తలు వ్యాసాలే కాక పద్య సాహిత్యం వెలువడటం విశేషమని అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది అభివృద్ధి పనుల ప్రాధాన్యతను విశ్లేషించడంతోపాటు హైదరాబాదు నగర చారిత్రాత్మక సంప్రదాయ బోనాల వేడుకల వైభవాన్ని పుస్తకంలో అద్భుతంగా వర్ణించారని పేర్కొన్నారు.
జీహెచ్ఎంసి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్టుగా యాదగిరి తన అనుభవంతో హైదరాబాద్ నగర వారసత్వ సంస్కృతిపై రాసిన చారిత్రాత్మక అంశాలు నేటి తరానికి విజ్ఞాన దాయకంగా ఉంటాయని అన్నారు. సంప్రదాయ సాహిత్యంను కోరుకునే తెలుగు పాఠకులను 'మూసి తరంగాలు -సింహ వాహినిశతకం' విశేషంగా ఆకర్షిస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.
వరకాల యాదగిరి మాట్లాడుతూ నాలుగున్నర దశాబ్దాలుగా నిరంతరం మూసి నది ప్రవాహాన్ని పరిశీలించిన అనుభవం, చరిత్ర సంస్కృతి సాంప్రదాయాలపై ఉన్న ఆసక్తితో పుస్తకాన్ని వెలువరించినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మూసి పునర్జీవన సంస్థ డైరెక్టర్ విష్ణువర్ధన్ రావు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత కవి యాదగిరికి శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు.


