- పదేపదే మోసపోయిన షేక్‌పేటకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి
- 2025 ఆగస్టు నుంచి ఈ ఏడాది జూన్ వరకు వ్యవహారం
- రకరకాల పేర్లు చెప్పి ఇలా టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు
- ఎట్టకేలకు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు, కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: ఎవరైనా ఒకటి రెండుసార్లు సైబర్ నేరాల బారినపడితేనే అప్రమత్తం అవుతారు. అదీ ఒకేరకమైన వేదికల కేంద్రంగా జరిగితే వాటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటారు. అయితే షేక్‌పేటకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి (48) మాత్రం 11 నెలల కాలంలో ఎనిమిది విడతల్లో రూ.5.1 లక్షలు మోసపోయాడు. ప్రతి సందర్భంలోనూ సైబర్ నేరగాళ్లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం ద్వారానే... నగదు రికవరీ, విదేశీ ఉద్యోగాల పేరుతోనే ఎర వేసి టోకరాలు వేయడం గమనార్హం. పూర్తి వివరాలు లేకపోయినా... ఈ ఎనిమిది విడతలకు ముందూ ఓసారి ఇతడు బాధితుడిగా మారినట్లు ఫిర్యాదు ఆధారంగా తెలుస్తోంది. 2025 ఆగస్టు నుంచి 2026 జూన్ వరకు జరిగిన ఈ ‘సీరియల్ సైబర్ క్రైమ్’పై ఎట్టకేలకు బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించడంతో గురువారం కేసు నమోదైంది.
క్రైమ్–1లో రూ.2,83,500:
ఈ బాధితుడు గతేడాది ఆగస్టులో ఫేస్‌బుక్‌లో డెంటన్స్ గ్లోబల్ లా ఫర్మ్ పేరుతో వచ్చిన ప్రకటన చూశాడు. సైబర్ మోసాల్లో కోల్పోయిన డబ్బును బాధితులకు తిరిగి ఇప్పిస్తామన్నది దాని సారాంశం. అప్పటికి కొన్నాళ్ల క్రితం ఓ సైబర్ నేరంలో డబ్బు పోగొట్టుకున్న ఇతడిని ఈ ప్రకటన ఆకర్షించింది. దీంతో బాధితుడు అందులో ఉన్న నంబర్‌లో సంప్రదించాడు. తాము కేవలం క్రిప్టోకరెన్సీ రూపంలోనే డబ్బు రికవరీ చేస్తామంటూ ఆ ఖాతాలు తెరవాలని చెప్పారు. ఖాతా ప్రారంభం, వెరిఫికేషన్, పన్నులు, సాంకేతిక లోపాలంటే స్వాహా చేశారు.
క్రైమ్–2లో రూ.19,050:
గతేడాది డిసెంబరులో బాధితుడికి ఫేస్‌బుక్‌లో దుబాయ్‌కి ఉద్యోగ వీసాలు ఇప్పిస్తామంటూ డీఎన్‌ఏటా ఇంటర్నేషనల్ పేరుతో వచ్చిన ప్రకటనను ఆకర్షించింది. అందులో పేర్కొన్న ప్రకారం బాధితుడు స్టోర్ కీపర్ ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. ఇతడిని సంప్రదించిన సైబర్ నేరగాళ్లు వీసా దరఖాస్తు, వైద్య పరీక్షలు, సెక్యూరిటీ డిపాజిట్, ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో రూ.19.05 వేలు వసూలు చేశారు.
క్రైమ్–3లో రూ.27,653:
జనవరిలో ఇన్‌స్టాగ్రాంలో విజ్డమ్ క్యాపిటల్ పేరుతో వచ్చిన ప్రకటన చూశాడు. సైబర్ నేరాల బాధితులకు తాము సొమ్ము రికవరీ చేస్తామంటూ అందులో ఉండటంతో మళ్లీ ఆకర్షితుడయ్యాడు. వారిని సంప్రదించగా తమకు ఢిల్లీ పోలీసులతో సంబంధాలు ఉన్నాయని నమ్మించారు. ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడి పెడితే కోల్పోయిన మొత్తం తిరిగి వస్తుందని చెప్పి ఖాతా ప్రారంభం, ప్రాసెసింగ్, వెరిఫికేషన్, పన్నుల పేరుతో డబ్బు వసూలు చేశారు.
క్రైమ్–4లో రూ.25,000:
అదే నెల్ల బాధితుడికి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో సింగపూర్ ఉద్యోగ వీసాలు ఇప్పిస్తామంటూ ఫ్లై టు అబ్రాడ్ పేరుతో వచ్చిన ప్రకటన ఇతడి కంట్లో పడింది. వీరి ద్వారానూ స్టోర్ కీపర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసి, రిజిస్ట్రేషన్, బయోమెట్రిక్, ఎంబసీ, హెల్త్ ఇన్సూరెన్స్ ఛార్జీల పేరుతో డబ్బు చెల్లించి మోసపోయాడు.
క్రైమ్–5లో రూ.31,500:
ఇప్పటికే రెండుసార్లు ‘రికవరీ క్రైమ్’లో బాధితుడిగా మారిన ఇతడికి ఫిబ్రవరిలో ఫేస్‌బుక్‌లో ట్రేడ్ గిని ప్లాట్‌ఫాం అనే ప్రకటన కనిపించింది. వీరిని సంప్రదించగా... ఢిల్లీ పోలీసులతో పాటు ఐ4సీ ఐటీ విభాగంతో సంబంధాలు ఉన్నాయని, హ్యాకర్ల ద్వారా ఆ నగదు రికవరీ చేస్తామన్నారు. వీళ్లూ రిజిస్ట్రేషన్, భద్రత, వెరిఫికేషన్, సిస్టమ్ వాలిడేషన్ పేర్లతో కాజేశారు.
క్రైమ్–6లో రూ.69,200:
ఏప్రిల్‌లో అమెరికాలో ఉద్యోగ వీసాలు ఇప్పిస్తామని లాయల్ కన్సల్టెన్సీ పేరుతో సోషల్ మీడియాలో వచ్చిన ప్రకటనను నమ్మాడు. ఫ్రూట్ పికింగ్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుని... డీఎస్–160 ఫారం, వీసా ప్రాసెసింగ్, బయోమెట్రిక్, అపాయింట్‌మెంట్, ఇమిగ్రెంట్ పిటిషన్, అటెస్టేషన్ వంటి పేర్లతో వాళ్లు డిమాండ్ చేసిన డబ్బు చెల్లించి మోసపోయాడు.
క్రైమ్–7లో రూ.35,000:
అదే నెల్లో ఇన్‌స్టాగ్రాంలో కెనడా ఉద్యోగ వీసాలు ఇప్పిస్తామంటూ సుమయ్యా టూరిజం ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వచ్చిన ప్రకటన చూశాడు. వీరి ద్వారా ఫుడ్ ప్యాకింగ్ హెల్పర్ ఉద్యోగం దరఖాస్తు చేశాడు. ఈ కేటుగాళ్లు వివిధ రకాల పేర్లతో పాటు బ్యాంక్ స్టేట్‌మెంట్ తనిఖీ అంటూ టోకరా వేశారు.
క్రైమ్–8లో రూ.23,400:
జూ¯Œ లో యూకేకు చెందిన ఎన్‌కోర్ సొల్యూషన్స్ పేరుతో ఫేస్‌బుక్‌లో వచ్చిన ప్రకటన ఇతడి కంట్లో పడింది. గతంలో సైబర్ నేరంలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి ఇప్పిస్తామని అందులో ఉండగా మళ్లీ నమ్మేశాడు. వారిని సంప్రదించి బ్యాంకు వెరిఫికేషన్ అని చెప్పడంతో నగదు చెల్లించి మోసపోయాడు.
కామేష్


